కరోనాకు అదరలేదు.. తుపాన్లకు బెదరలేదు!

‘మన ప్రతి మాటా ప్రేమతో ఉండాలి.. ప్రతి పనీ నిస్వార్థంతో చేయాల’నేవారు మదర్‌ థెరిసా. ఈ మాటల్నే అణువణువునా నింపుకొన్నారు కొందరు నర్సులు. తమకంటే ఎక్కువగా వృత్తినే ప్రేమిస్తూ.. తమ సుదీర్ఘ కెరీర్‌లో ఎంతోమంది రోగులకు.....

Published : 03 Jun 2022 17:29 IST

(Photo: Twitter)

‘మన ప్రతి మాటా ప్రేమతో ఉండాలి.. ప్రతి పనీ నిస్వార్థంతో చేయాల’నేవారు మదర్‌ థెరిసా. ఈ మాటల్నే అణువణువునా నింపుకొన్నారు కొందరు నర్సులు. తమకంటే ఎక్కువగా వృత్తినే ప్రేమిస్తూ.. తమ సుదీర్ఘ కెరీర్‌లో ఎంతోమంది రోగులకు నిస్వార్థమైన సేవలందించారు. కొవిడ్‌కు బెదరకుండా, ప్రకృతి వైపరీత్యాలకు వెరవకుండా వాళ్లు చేసిన సేవలే వారిని ప్రతిష్టాత్మక ‘జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు - 2021’కు ఎంపికయ్యేలా చేశాయి. త్వరలోనే ఈ అవార్డు అందుకోబోతోన్న కొంతమంది నర్సుల గురించి తెలుసుకుందాం..!

వాళ్లకు కన్నతల్లైంది!

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాకు చెందిన 45 ఏళ్ల ఖులానా బారిక్‌ జిల్లా హెడ్‌క్వార్టర్‌ ఆస్పత్రిలో ప్రసూతి విభాగ ఇన్‌ఛార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. వ్యక్తిగత అవసరాల కంటే వృత్తినే ఎక్కువగా ప్రేమించే ఆమె.. కొవిడ్‌, వరదలు.. వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సెలవులు తీసుకోలేదు. ఈ క్రమంలో కరోనా సమయంలో వైరస్‌ సోకిన గర్భిణులకు సుఖ ప్రసవం అయ్యేలా, డెలివరీ తర్వాత ఆ పసిపిల్లల్ని కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు. అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా బారిక్‌ను ఆ సమయంలో కొవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా పేర్కొంటూ గౌరవించింది. ఈ అంకిత భావమే ఆమెను ప్రతిష్టాత్మక ఫ్లోరెన్స్‌ మెడల్‌కు ఎంపిక చేసిందంటూ ‘ఒడిశా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ’ తాజాగా ట్విట్టర్‌ వేదికగా కొనియాడింది.
‘ఫ్లోరెన్స్‌ అవార్డు ఓ గొప్ప గుర్తింపు. ఈ మెడల్‌కు ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. నాకు వృత్తిలోనే సంతోషం, సంతృప్తి లభిస్తాయి. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా డ్యూటీ చేయడానికే మొగ్గుచూపుతాను తప్ప.. సెలవులు తీసుకోవడానికి నా మనసు అంగీకరించదు..’ అంటున్నారు బారిక్.


ఆమే ‘తొలి’ నర్సు!

ఫ్లోరెన్స్‌ మెడల్‌ తన బాధ్యతల్ని మరింతగా పెంచిందంటోంది ఒడిశాలోని బేరంపూర్‌కు చెందిన శిబానీ దాస్‌. అక్కడి MKCG మెడికల్‌ కాలేజీ-ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. తద్వారా ఈ ఆస్పత్రి నుంచి ఈ మెడల్ అందుకోబోతోన్న తొలి నర్సుగా నిలవనుంది శిబానీ. గతంలో కొన్నేళ్ల పాటు కోల్‌కతాలో పనిచేసిన ఆమె.. ఎంతో ఓపిక, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తుంటారు. కరోనా సమయంలోనూ తన ప్రాణాల కంటే వృత్తికే ప్రాధాన్యమిచ్చారామె. మరోవైపు ఆస్పత్రి వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటూ యాజమాన్యం మన్ననలందుకున్నారు. ‘ఈ ప్రతిష్టాత్మక మెడల్‌ నా బాధ్యతల్ని మరింతగా పెంచింది. ఇక పైనా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా. రోగులందరూ ఆరోగ్యంగా తిరిగి ఇంటికెళ్లేందుకు నా వంతు సేవలు కొనసాగిస్తా..’ అంటున్నారీ 50 ఏళ్ల నర్సు.


పాతికేళ్ల సేవ!

కొవిడ్ రోగులకు సేవ చేయడం ఒక ఎత్తైతే.. ఇన్ఫెక్షన్‌ ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవడం మరో ఎత్తు. ఈ క్రమంలో తనదైన పనితనాన్ని చాటారు కేరళ నర్సు సుసాన్‌ చాకో. కొల్లంలోని సూరనాడ్‌లో పుట్టిపెరిగిన ఆమె.. పాతికేళ్లుగా నర్సింగ్‌ వృత్తిలో ఉన్నారు. పదహారేళ్ల క్రితం కొల్లం జిల్లా ఆస్పత్రిలో విధుల్లో చేరిన ఆమె.. ప్రస్తుతం నర్సింగ్‌ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. కరోనా సమయంలో ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ ఇంఛార్జిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించిన ఆమె.. వైరస్‌ ప్రబలకుండా తన వంతుగా కృషి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ మెడల్‌’కు ఎంపికయ్యారు సుసాన్‌. మరోవైపు జిల్లా స్థాయిలో ట్రైనింగ్‌ కో-ఆర్డినేటర్‌గా, ట్రైనర్‌గానూ పనిచేస్తున్నారామె. ఇలా తన పాతికేళ్ల సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది ‘కాయకల్ప్‌’ అవార్డు కూడా అందుకున్నారు సుసాన్.

నర్సింగ్‌ వృత్తిలో విశేష సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు’ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరంతా త్వరలోనే రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోనున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్