‘ఆంటీ.. ఈ వయసులో స్కేటింగ్‌ అవసరమా?’ అనేవారు!

‘జీవితం చాలా చిన్నది.. దాన్ని మనకు నచ్చినట్లుగా మలచుకోవాలి.. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాలి.. అప్పుడే మనం సానుకూలంగా ఉంటూ.. చుట్టూ ఉన్న వారిలో పాజిటివిటీని నింపగలం’ అంటారు ఇండో-కెనడియన్‌ మహిళ ఓర్బీ రాయ్‌. 9/11 దాడుల నుంచి బతికి బయటపడిన ఆమె.. జీవితం విలువ తెలుసుకొని దాన్ని పూర్తిగా ఆస్వాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఓవైపు తనకు నచ్చిన డిజైనింగ్‌ వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు స్కేటింగ్‌ని తన ప్రవృత్తిగా మార్చుకున్నారు.

Published : 25 Jun 2021 22:49 IST

Photo : Instagram

‘జీవితం చాలా చిన్నది.. దాన్ని మనకు నచ్చినట్లుగా మలచుకోవాలి.. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాలి.. అప్పుడే మనం సానుకూలంగా ఉంటూ.. చుట్టూ ఉన్న వారిలో పాజిటివిటీని నింపగలం’ అంటారు ఇండో-కెనడియన్‌ మహిళ ఓర్బీ రాయ్‌. 9/11 దాడుల నుంచి బతికి బయటపడిన ఆమె.. జీవితం విలువ తెలుసుకొని దాన్ని పూర్తిగా ఆస్వాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఓవైపు తనకు నచ్చిన డిజైనింగ్‌ వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు స్కేటింగ్‌ని తన ప్రవృత్తిగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లైన ఆమె.. తన వయసు యాభైకి సమీపిస్తోన్నా ఎంతో చలాకీగా స్కేటింగ్‌ బోర్డ్‌పై రయ్‌ మంటూ దూసుకెళ్తున్నారు. ఇలా తన స్కేటింగ్‌ వీడియోలు చూసి కొంతమంది ప్రశంసించినా.. మరికొంతమంది మాత్రం విమర్శిస్తుంటారని; ఎవరేమనుకున్నా తనకు నచ్చిన పని చేస్తూ నలుగురిలో స్ఫూర్తి నింపడానికే ప్రయత్నిస్తానంటారామె. మనలోని అభిలాషను నెరవేర్చుకోవడానికి వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపిస్తోన్న ఓర్బీ తన స్కేటింగ్‌ జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చారు.

మా పూర్వీకులు కోల్‌కతాలో నివాసం ఉండేవారు. నేను పుట్టిపెరిగిందంతా న్యూయార్క్‌లోనే! ఇరవై ఏళ్ల క్రితం ఇక్కడి వాల్‌స్ట్రీట్‌లో విధులు నిర్వర్తించేదాన్ని. కానీ 9/11 ఉగ్రదాడుల్ని కళ్లారా చూశాక, ఆ భయంకర దాడుల నుంచి బయటపడ్డాక జీవితం ఎంత విలువైందో నాకు అర్థమైంది.. అందుకే దాన్ని మరింత అర్థవంతంగా, సంతోషంగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నా. జీవితాన్ని ఆస్వాదించడం కోసం అప్పటిదాకా నేను చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేసి టొరంటోకి వచ్చేశా.

ఇంటి అలంకరణతో మొదలైంది!

ఈ క్రమంలోనే నాకెంతో ఇష్టమైన ఇంటి అలంకరణ (Home Decor)ను నా ఫుల్‌టైమ్‌ కెరీర్‌గా మార్చుకున్నా. Alpona అనేది దుస్తులకు రంగులద్దే ఓ కళ. ఇది బెంగాల్‌లో చాలా ఫేమస్. దీన్ని నేను మా అమ్మ దగ్గర్నుంచి నేర్చుకున్నా. ఈ కళనే నా హోమ్‌ డిజైనింగ్‌ కోసం ఉపయోగిస్తున్నా. ఇందులో భాగంగా తొలినాళ్లలో కోల్‌కతాకు చెందిన చేతి వృత్తుల కళాకారులతో పనిచేస్తూ జామెట్రిక్‌, సర్క్యులర్‌.. వంటి విభిన్న డిజైన్లలో రంగులద్దిన ఫ్యాబ్రిక్స్‌తో పిల్లో కవర్స్‌, టేబుల్ క్లాత్స్.. వంటివి రూపొందించేదాన్ని. ఇక 2002లో ‘OM home’ అనే పేరుతో ఓ సంస్థను ప్రారంభించాక నా డిజైన్లను మోడ్రన్‌ బెడ్డింగ్‌, ఇతర ఇంటి అలంకరణ వస్తువుల్ని రూపొందించే దాకా విస్తరించా. దీంతో నా బ్రాండ్‌కి మంచి ఆదరణ వచ్చింది. ఆ తర్వాత్తర్వాత నా దృష్టి పిల్లల అలంకరణ వస్తువుల వైపుకి మళ్లింది. ఈ క్రమంలోనే ఇక్కడి ఓ స్థానిక సంస్థతో చేతులు కలిపి పిల్లల కోసం నాణ్యమైన, పర్యావరణ హితమైన బెడ్డింగ్‌, పిల్లలకు సంబంధించిన కొన్ని వస్తువుల్ని రూపొందిస్తున్నా. ప్రస్తుతం మా వస్తువులు క్యాలిఫోర్నియా, న్యూయార్క్‌, మసాచుసెట్స్‌, టెక్సాస్‌, ఒంటారియో.. వంటి నగరాల్లోని మా స్టోర్లలో లభ్యమవుతున్నాయి. అంతేకాదు.. పిల్లల వస్తువుల్ని విక్రయించే ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్స్‌లోనూ మా ఉత్పత్తుల్ని అమ్మకానికి ఉంచా.

దానికి వయసుతో పనేముంది!

ప్రతి ఒక్కరిలోనూ తాము చేస్తోన్న వృత్తితో సంబంధం లేకుండా ఏదో ఒక అభిలాష/అభిరుచి దాగుంటుందని నమ్మే వ్యక్తిని నేను! నా విషయానికొస్తే స్కేటింగే నా ప్రవృత్తి, నా అభిరుచి. అందుకే ఓవైపు డిజైనింగ్‌లో కొనసాగుతూనే.. మరోవైపు స్కేటింగ్‌పై దృష్టి పెట్టా. నేనే కాదు.. మా వారు, నా ఇద్దరు పిల్లలూ స్కేటింగ్‌ అంటే మక్కువ చూపుతారు. ఇలా మాది స్కేటింగ్‌ ఫ్యామిలీ అన్నమాట! నలభైల్లోకి అడుగుపెట్టాక స్కేట్‌ బోర్డ్‌పై సాధన చేస్తోన్న నన్ను చూసి ప్రశంసించే వారి కంటే విమర్శించే వారే ఎక్కువమంది ఉండేవారు. ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన నా స్కేటింగ్‌ వీడియోలు చూసి కొంతమంది అబ్బాయిలైతే.. ‘ఆంటీ.. ఈ వయసులో మీకు స్కేటింగ్‌ అవసరమా?’ అంటూ కామెంట్‌ చేసేవారు.. అంతేకాదు.. నా చర్మ ఛాయ తక్కువని విమర్శించిన వారూ ఉన్నారు. కానీ ఇవేవీ నేను పట్టించుకోలేదు. అయినా మనసుకు నచ్చిన పని చేయడానికి వయసు అడ్డంకి కాకూడదు అనేది నా సూత్రం. ఇది నిరూపించడానికే ‘ఆంటీ స్కేట్స్‌’ పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని క్రియేట్‌ చేసి.. అందులో నా స్కేటింగ్‌ వీడియోల్ని అప్‌లోడ్‌ చేస్తున్నా..

పాజిటివిటీ నింపడానికే..!

మనం సంతోషంగా, సానుకూల దృక్పథంతో ఉన్నప్పుడే ఇతరుల్లో పాజిటివిటీని నింపగలం. ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ నేను ఇదే చేస్తున్నా. నా స్కేటింగ్‌ వీడియోల్ని ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తూ.. మనసుకు నచ్చిన పని చేస్తే మనలోని ప్రతికూలతల్ని ఇట్టే అధిగమించచ్చన్న సందేశాన్ని అందరికీ చాటుతున్నా. అలాగే జిమ్‌ వేర్‌లోనే ఇలాంటి సాహసాలు చేయచ్చని చాలామంది అనుకుంటారు. కానీ కుర్తీ, చీర.. వంటి భారతీయ సంప్రదాయ దుస్తుల్లోనూ అలవోకగా స్కేటింగ్‌ చేయచ్చని నిరూపించడానికే ఇటీవల నేను శారీలో స్కేటింగ్‌ చేసి.. ఆ వీడియోల్ని ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేశా. వాటికి మంచి స్పందన వచ్చింది. వాటిని చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందారు.. తమ స్కేటింగ్‌ అనుభవాలను సైతం పంచుకున్న వారున్నారు.

జీవితం చాలా చిన్నది.. అందులోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించడం మన హక్కు. దాన్ని వయసుతో ముడిపెట్టడం, ఇతరుల మాటల్ని పట్టించుకోవడం వల్ల మనం చాలా మిస్సవుతాం. అలాంటి పొరపాటు మీరు చేయకండి.. మీరు హ్యాపీగా, పాజిటివ్‌గా ఉంటూనే ఇతరుల్లోనూ సంతోషాన్ని నింపండి..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్