ప్రభుత్వోద్యోగం వదిలి రాజకీయాల వైపు..!

ఆమె ఓ ప్రభుత్వాసుపత్రిలో నేత్ర వైద్యురాలిగా పనిచేస్తోంది.. సురక్షితమైన ఉద్యోగం.. నెల తిరిగే సరికి వేలకొద్దీ జీతం.. అయినా ఈ సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలన్న తపన ఆమెను వెంటాడేది. అందుకు రాజకీయాలే సరైన వారధి అని భావించి.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇటువైపుగా అడుగులేసింది. ఇటీవల జరిగిన పంజాబ్‌ ఎన్నికల్లో ప్రత్యర్థిని చిత్తు చేసి....

Published : 19 Mar 2022 19:06 IST

(Photos: Facebook)

ఆమె ఓ ప్రభుత్వాసుపత్రిలో నేత్ర వైద్యురాలిగా పనిచేస్తోంది.. సురక్షితమైన ఉద్యోగం.. నెల తిరిగే సరికి వేలకొద్దీ జీతం.. అయినా ఈ సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలన్న తపన ఆమెను వెంటాడేది. అందుకు రాజకీయాలే సరైన వారధి అని భావించి.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇటువైపుగా అడుగులేసింది. ఇటీవల జరిగిన పంజాబ్‌ ఎన్నికల్లో ప్రత్యర్థిని చిత్తు చేసి అసెంబ్లీలో అడుగుపెట్టిందామె. ఆమే.. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ బల్జిత్‌ కౌర్. ఎన్నికల్లో అడుగుపెట్టిన తొలిసారే విజయదుందుభి మోగించిన ఆమె.. తాజాగా మంత్రిగా ప్రమాణం చేశారు. ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేసిన పది మంది మంత్రుల్లో కౌర్‌ ఒక్కరే మహిళ కావడం విశేషం. రాజకీయాల్లోకొచ్చినా.. రోగులకు ఉచిత సేవలందించడానికి తానెప్పుడూ ముందే ఉంటానంటోన్న ఈ మహిళా మంత్రి గురించి కొన్ని విశేషాలు మీకోసం..

ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతోమంది మహిళలు పురుషులతో పోటాపోటీగా తలపడి విజయం సాధించిన సంగతి తెలిసిందే! వారిలో డాక్టర్‌ బల్జిత్‌ కౌర్‌ ఒకరు. మాలౌట్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. తాజాగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భగ్‌వంత్‌ మాన్‌ మంత్రివర్గంలో ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయగా.. అందులో కౌర్‌ ఒక్కరే మహిళ కావడం విశేషం.

నాన్న స్ఫూర్తితో..!

కౌర్‌ వృత్తిరీత్యా డాక్టర్‌. పంజాబ్‌ ముక్‌ట్సర్‌ సిటీలోని ప్రభుత్వాసుపత్రిలో నేత్ర వైద్యురాలిగా విధులు నిర్వర్తించేవారామె. ఆమె తండ్రి సాధూ సింగ్‌.. గతంలో ఫరీద్‌కోట్‌ నుంచి ఆప్‌ ఎంపీగా పనిచేశారు. అయితే ప్రభుత్వోద్యోగం, మంచి జీతం అందుకుంటున్నప్పటికీ.. ఇంకా ఈ సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలని సంకల్పించుకున్నారు కౌర్‌. ఇందుకు రాజకీయాలే సరైన వారధిగా భావించి ఇటు వైపు వచ్చానంటున్నారు.

‘నాన్నకు రాజకీయానుభవం ఉంది. అది నాలోనూ స్ఫూర్తి నింపింది. ఓవైపు వైద్య వృత్తిలో కొనసాగుతున్నప్పటికీ ప్రజా సేవను విస్తరించడానికి రాజకీయాలే చక్కటి మార్గం అనిపించింది. అందుకే ఎన్నికలకు మూడు నెలల ముందే నా ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేశాను..’ అంటున్నారు కౌర్‌. ఆమె భర్త కూడా ప్రభుత్వోద్యోగే. ప్రస్తుతం ఆయన ఆ రాష్ట్ర విద్యుత్‌ శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆమె రూటే సెపరేటు!

సాధారణంగా ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు, పెద్ద ఎత్తున ప్రజా సభల్ని నిర్వహించడం మనకు తెలిసిందే! అయితే ఈ క్రమంలో కౌర్‌ అందరిలా కాకుండా ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నారు. ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా తాను వెళ్లిన చోటల్లా ఆరోగ్య శిబిరాలు నిర్వహించేవారామె. ఈ క్రమంలో అక్కడికొచ్చిన వారికి కంటి పరీక్షలు చేయడం.. అవసరమైన వారికి మందులు అందించడం, తీవ్ర సమస్యలుంటే వారికి ఆయా చికిత్సలు చేయించుకోమని సూచించడం.. వంటివి చేసేవారు కౌర్‌. అంతేకాదు.. మహిళలకు చేయూతనందించడానికి, వారిలో ప్రోత్సాహం నింపడానికి కొన్నిసార్లు ఉపన్యాసాలు కూడా ఇచ్చేవారామె. ఇలా ఆమె ఎంచుకున్న విభిన్న దారే ప్రజల మనసులు కొల్లగొట్టేలా చేసిందని చెబుతున్నారు పంజాబ్‌ వాసులు.

ఆ సేవలూ కొనసాగిస్తా!

రాజకీయాల్లో బిజీ అయినంత మాత్రాన తన వైద్య వృత్తిని విస్మరించనని చెబుతున్నారు కౌర్‌. తాను ఉద్యోగంలో లేకపోయినా.. రోగులకు ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహిస్తానంటున్నారు. ‘ఇకపై మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ.. నా వైద్య సేవలు కొనసాగుతాయి. ముక్‌ట్సర్‌లోని ‘సర్బాత్‌ దా భాలా’ స్వచ్ఛంద సంస్థ ఆవరణలో ఏర్పాటైన ఆస్పత్రిలో ఉచితంగా రోగులకు కంటి పరీక్షలు నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇక మరోవైపు ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల కొరత ఉంది. దానివల్ల కొంతమంది ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా వారిపై ఆర్థిక భారం అధికంగా పడుతుంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరత తీరాలి. ప్రభుత్వంతో మాట్లాడి ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తా..’ అంటున్నారు కౌర్‌. మరోవైపు ఇద్దరు పిల్లల తల్లిగానూ తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తోన్న ఆమె.. సామాజిక అంశాలపై వ్యాసాలు, కవితలు కూడా రాస్తుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్