Updated : 12/05/2022 20:12 IST

Pad Woman: ఇలా దేశాన్ని మార్చేస్తోంది!

(Photos: Instagram)

మహిళలకు నెలసరి నేస్తాలు శ్యానిటరీ ప్యాడ్లు. అయితే బయట దొరికే వాటిలో ప్లాస్టిక్‌ వాడకం వల్ల అవి ఇటు ఆరోగ్యానికి, అటు పర్యావరణానికి.. రెండు విధాలుగా నష్టమే! పైగా నాణ్యత, ఫీచర్లను బట్టి వీటి ధర కూడా ఎక్కువే! అంటే.. దిగువ మధ్య తరగతి వారు, మారుమూల గ్రామాల్లో నివసించే మహిళలు వీటిని కొనలేని పరిస్థితి. ఇలాంటి ప్రతికూలతలన్నీ దగ్గర్నుంచి గమనించారు కేరళకు చెందిన అంజూ బిష్త్‌. ఎలాగైనా ఈ పరిస్థితిలో మార్పు తేవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా తన టీమ్‌తో కలిసి రీయూజబుల్‌ (తిరిగి ఉపయోగించుకునే) శ్యానిటరీ ప్యాడ్స్‌ తయారుచేయాలని సంకల్పించుకున్నారు. ఆమె మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఎంతోమంది గ్రామీణ మహిళలకు చేరువవడమే కాదు.. పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తోంది. అందుకే నీతి ఆయోగ్‌ నుంచి ‘విమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా’ అవార్డు కూడా అందుకున్నారామె. మరి, ఇంతకీ ఈ ప్యాడ్‌ ఉమన్‌ కథ ఎక్కడ, ఎప్పుడు, ఎలా మొదలైందో తెలుసుకుందాం రండి..

కేరళలోని కొల్లంలో పుట్టి పెరిగిన అంజూకి పర్యావరణమన్నా, సమాజ సేవ చేయడమన్నా చిన్నతనం నుంచే ఇష్టం. తాను ఎంత ఉన్నత చదువులు చదివినా, మంచి హోదాలో ఉన్నా ఈ రెండు అంశాలపై దృష్టి సారించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. 1998లో అమెరికాలోని మేరీల్యాండ్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎంఎస్‌ పూర్తి చేసిన అంజూ.. కొన్నేళ్ల పాటు అక్కడే మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పని చేశారు. ఆపై 2003లో ఇండియాకు తిరిగొచ్చిన ఆమె.. కోయంబత్తూర్‌లోని అమృత యూనివర్సిటీలో సుమారు పదేళ్ల పాటు ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టు బోధించారు.

అక్కడే బీజం పడింది!

ఇక 2013లో ‘మాతా అమృతానందమయి మఠం’ ప్రారంభించిన ‘Amrita SeRVe’ అనే ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. దేశవ్యాప్తంగా 101 గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగానే దేశంలోని మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడి సౌకర్యాల లేమి, ఇతర సమస్యల గురించి అవగాహన తెచ్చుకున్నారామె. ఈ క్రమంలోనే నెలసరి సమయంలో అక్కడి మహిళలు పాటించే అసురక్షిత నెలసరి పద్ధతుల గురించి తెలుసుకున్నారు అంజూ. ఇదే ‘సౌఖ్యం రీయూజబుల్‌ ప్యాడ్స్‌’ పేరుతో పర్యావరణహిత శ్యానిటరీ న్యాప్‌కిన్ల తయారీకి దారి తీసింది.

ఆరోగ్యం.. పర్యావరణ హితం..!

ఎంతో పరిశోధన, ఎన్నో విశ్లేషణల అనంతరం.. వ్యవసాయ వ్యర్థాల నుంచి బనానా ఫైబర్‌, కాటన్‌ క్లాత్‌తో తిరిగి ఉపయోగించుకునే శ్యానిటరీ న్యాప్‌కిన్లు తయారుచేయాలని నిర్ణయించుకున్నారు అంజూ. పైగా బయట దొరికే ప్యాడ్ల నాణ్యతకు ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇలా వ్యవసాయ వ్యర్థాలతో తయారవుతోన్న శ్యానిటరీ ప్యాడ్లు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేవు.. దీంతో ప్రపంచం దృష్టిని తనవైపుకి తిప్పుకున్నారామె. ఇలా తయారైన ఎకో-ఫ్రెండ్లీ ప్యాడ్స్‌ని గ్రామీణ ప్రాంతాల మహిళలకు అతి తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇప్పటివరకు సుమారు 5 లక్షలకు పైగా ప్యాడ్స్‌ని రూపొందించి.. ఆయా గ్రామాల్లోని మహిళలకు అందించింది అంజూ బృందం. దీంతో ఏటా విడుదలయ్యే సుమారు 2 వేల టన్నులకు పైగా కార్బన్‌ డయాక్సైడ్‌, దాదాపు 43,750 టన్నుల భూమిలో కలవని నెలసరి వ్యర్థాలు ఉత్పత్తి కాకుండా అడ్డుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

విదేశాల్లోనూ తన ముద్ర!

అంజూ బిష్త్‌ తన బృందంతో కలిసి ప్రస్తుతం తయారుచేస్తోన్న ఈ రీయూజబుల్‌ శ్యానిటరీ ప్యాడ్స్‌ యూకే, జర్మనీ, యూఎస్‌ఏ, కువైట్‌, స్పెయిన్‌.. వంటి దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. అంతేకాదు.. ఆన్‌లైన్‌ స్టోర్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇలా తన ఇనీషియేటివ్‌తో అటు మహిళల ఆరోగ్యానికి, ఇటు పర్యావరణానికి మేలు చేస్తోన్న అంజూ.. తన సమాజ సేవకు గుర్తింపుగా పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇటీవలే నీతి ఆయోగ్‌ నుంచి ‘విమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా’ అవార్డు కూడా స్వీకరించారామె. మరోవైపు ‘విమెన్‌ ఇన్‌ ఇండియన్‌ సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ నెట్‌వర్క్‌’లో కీలక సభ్యురాలిగా కొనసాగుతోన్న ఆమె.. 2020 మార్చిలో ‘సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు సైతం దక్కించుకున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని