Updated : 13/05/2022 15:30 IST

పాలమూరు ఫలానికి పేరు తెచ్చారు

సీతాఫలాలంటే నోరూరనిదెవరికి? అందులోనూ అద్భుతమైన రుచితో ఉండే పాలమూరు సీతాఫలం గురించి ఎంత చెప్పినా తక్కువే. వాటి రుచిని అందరికీ పరిచయం చేసే పనిలో పడ్డారు నవాబ్‌పేట మహిళలు. పనిలో పనిగా వారికీ ఉపాధి, ఆదాయమూ...

పాలమూరు సీతాఫలం రుచి గురించి తెలిసినా... తినే భాగ్యం లేదే అని బాధపడుతున్నారా? మనకా చింత లేకుండా చేసేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేటలో గత ఏడాది సీతాఫలం శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అక్కడి మహిళా సమాఖ్య సభ్యులు. ఈ మండలం చుట్టూ అడవులు, గుట్టలు ఎక్కువ. అక్కడే సీతాఫలాలు విరివిగా దొరుకుతాయి. దాంతో మహిళా సమాఖ్య భవనంలోనే ఈ యూనిట్‌ను ప్రారంభించారు. రూ.6 లక్షల విలువ చేసే శుద్ధి యంత్రాలు, ఫ్రీజర్లని డీఆర్‌డీఏ సమకూర్చింది. నిర్వహణ బాధ్యత మహిళలదే. పండ్ల కొనుగోలు, ఇతర ఖర్చులకు పెట్టుబడి కోసం సమాఖ్య డబ్బులను ఉపయోగించుకున్నారు. పండ్ల కొనుగోలు, వేతనాల కోసం ఆరు లక్షలు ఖర్చుచేశారు. అమ్మకాల ద్వారా రూ. 7.5 లక్షలు ఆర్జించారు. గుజ్జే కాదు, గింజలు, పళ్లు కూడా అమ్ముతారు. వాటి ద్వారానూ ఆదాయం వస్తోంది. 32 మంది మహిళలు రెండు నెలల పాటు ఉపాధి పొందారు. ఈ ఏడాదీ 22    టన్నుల సీతాఫలాలను సేకరించి శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. కేజీ గుజ్జు రూ.208. ఈ గుజ్జు రుచిగా, నాణ్యంగా ఉండటంతో ఐస్‌క్రీమ్‌ పరిశ్రమలు ప్రత్యేకంగా ఆర్డర్లు ఇస్తున్నాయి. స్కూప్స్‌ సంస్థ వీళ్లకు పెద్ద ఖాతాదారు. ‘మా ప్రాంతంలో సీతాఫలాలు విపరీతంగా దొరుకుతాయి. ఇవి పండాక ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. పళ్లుగా అమ్మినా ఇంకా చాలా వృథా అయ్యేవి. అందుకే గతేడాది మహిళా సంఘం ఆధ్వర్యంలో సీతాఫలం శుద్ధి కేంద్రాన్ని పెట్టాలన్న ఆలోచన వచ్చింది. డీఆర్‌డీఏ అధికారులతో చర్చించాం. వాళ్లూ ప్రోత్సహించి వెన్నుదన్నుగా నిలిచారు. మహిళా సంఘాల సభ్యులే రెండు షిప్టుల్లో పని చేస్తాం. దీని వల్ల కొంత మందికి ఉపాధితో పాటు సంఘానికి లాభమూ వస్తోందని’ అని సంతోషంగా చెప్పుకొచ్చారు మండల మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణ. ఈ విజయంతో మరిన్ని కొత్త కార్యకలాపాలు చేయాలన్న ఉత్సాహం కలుగుతోందని చెబుతున్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటున్న నవాబుపేట మహిళలు అభినందనీయులు కదూ.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని