ఏడింటి లోపు డిన్నర్ పూర్తవ్వాల్సిందే!

సన్నగా ఉంటే ‘కట్టెపుల్ల’లా ఉన్నావంటారు. ముద్దుగా బొద్దుగా ఉంటే ‘ఇంత లావా?’ అంటూ విమర్శిస్తుంటారు. ఇలా చాలామంది శరీరాకృతి విషయంలో కొన్ని కొలతల్ని నిర్దేశించుకొని.. సూటిపోటి మాటలతో ఇతరుల్ని.......

Published : 11 May 2022 02:08 IST

(Photos: Instagram)

సన్నగా ఉంటే ‘కట్టెపుల్ల’లా ఉన్నావంటారు. ముద్దుగా బొద్దుగా ఉంటే ‘ఇంత లావా?’ అంటూ విమర్శిస్తుంటారు. ఇలా చాలామంది శరీరాకృతి విషయంలో కొన్ని కొలతల్ని నిర్దేశించుకొని.. సూటిపోటి మాటలతో ఇతరుల్ని ఇబ్బంది పెడుతుంటారు. బరువు విషయంలో తానూ ఇలాంటి విమర్శలెన్నో ఎదుర్కొన్నానంటోంది టాలీవుడ్‌ అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఫిట్‌నెస్‌ అంటే మక్కువ చూపే ఈ చిన్నది.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో శరీరాకృతి విషయంలో తానెదుర్కొన్న అనుభవాల్ని ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

‘షేప్‌ ఆఫ్‌ యూ’.. బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ శిల్పా శెట్టి ఇటీవలే ప్రారంభించిన టాక్‌ షో ఇది. ఈ వేదికగా సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ వారి ఫిట్‌నెస్‌ రహస్యాల్ని తెలుసుకుంటుందీ అందాల అమ్మ. తద్వారా అభిమానుల్లో ఫిట్‌నెస్‌, ఆరోగ్యం పట్ల స్ఫూర్తి రగిలిస్తోంది. అయితే ఈ టాక్‌ షో తాజా ఎపిసోడ్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సందడి చేసింది. ఈ క్రమంలో తన ఆరోగ్య, ఫిట్‌నెస్‌ రహస్యాలు, బరువు విషయంలో తానెదుర్కొన్న అనుభవాల్ని ఇలా పంచుకుంది.

50 రోజులు.. 10 కిలోలు!

‘నేను దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయమైన తొలినాళ్లలో నా బరువు విషయంలో పలు విమర్శలు ఎదుర్కొన్నా. అయితే అప్పటికే ఇండస్ట్రీలో సమంత, కాజల్‌ అగ్ర కథానాయికలుగా కొనసాగుతున్నారు.. పైగా వాళ్లు చాలా ఫిట్‌గా ఉన్నారు కూడా! అంటే.. తెరపై కనిపించే శరీరాకృతినే ప్రజలు ప్రామాణికంగా తీసుకుంటారేమో అనిపించింది. ఇక నా విషయంలో చాలామంది.. ‘నువ్వు సన్నగా, కట్టెపుల్లలా ఉన్నావ’న్నారు. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు. ఇక బాలీవుడ్‌లో ప్రవేశించే నాటికి నా వయసు 20 ఏళ్లు. ఆడిషన్‌కి వెళ్లినప్పుడు కొంతమంది నాకు బరువు తగ్గమని సలహా ఇచ్చారు. దాంతో బరువు విషయంలో ముంబయి స్టాండర్డ్స్ ఇలాగే ఉన్నాయేమో అనుకున్నా! కానీ శరీరాకృతి విషయంలో ఈ కొలతలేంటో అర్థం చేసుకునే పరిణతి నాకు అప్పటికి రాలేదు. అయితే ‘దే దే ప్యార్‌ దే’ సినిమా కోసం మాత్రం 50 రోజుల్లో సుమారు 10 కిలోలు తగ్గాల్సి వచ్చింది. అప్పుడు మరింత సన్నగా మారిపోయా. తిరిగి నాలుగైదు కిలోలు పెరిగాక కానీ నాకు నేను ఫిట్‌గా ఫీలవ్వలేకపోయా..!’

ఆయుర్వేద పద్ధతుల్ని నమ్ముతా!

‘ఇక నా ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ విషయాలకొస్తే.. నేను పాటించే జీవనశైలే ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేస్తుందని చెప్తా. ఉదయం లేవగానే మొదటి ఆహారంగా బటర్‌ కాఫీ తీసుకుంటా.. ఆపై షూటింగ్స్‌ సమయంతో పనిలేకుండా నా వర్కవుట్స్‌పై దృష్టి పెడతా. ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా వారమంతా వ్యాయామాలు చేయాలనిపిస్తుంటుంది. కానీ నా ట్రైనర్స్‌ సలహా మేరకు ఆరు రోజులు వివిధ రకాల వర్కవుట్స్‌ చేస్తుంటా. ఇక ఏడో రోజు యోగా, నడక.. వంటి తేలికపాటి వ్యాయామాలకు ప్రాధాన్యమిస్తా. వర్కవుట్స్‌ పూర్తి కాగానే అల్పాహారం తీసుకుంటా. అది కూడా ఉడికించిన కోడిగుడ్లకు ఎక్కువ ప్రాధాన్యమిస్తా. అవైతే ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేసి ఇతర ఆహార పదార్థాల మీదకు మనసు మళ్లకుండా చేస్తాయి.

ఇక ఆయుర్వేద సూత్రాల్ని, సంప్రదాయ ఆహార పద్ధతుల్ని బాగా నమ్మే వ్యక్తిని నేను. ఈ క్రమంలో పప్పు, రోటీ, కాయగూరలు ఎక్కువగా తీసుకుంటా. సూర్యాస్తమయం తర్వాత తినడం నాకు అలవాటు లేదు. అందుకే సాయంత్రం 6.30 కల్లా డిన్నర్‌ పూర్తి చేస్తా. మళ్లీ సూర్యోదయం అయ్యాకే మొదటి ఆహారం తీసుకుంటా. ఎక్కడికెళ్లినా గ్రీన్‌ టీ లేదా చామొమైల్‌ టీ బ్యాగ్స్‌ నా హ్యాండ్‌బ్యాగ్‌లో కచ్చితంగా ఉంటాయి.. అది పార్టీలో అయినా సరే.. గోరువెచ్చటి నీళ్లు తెప్పించుకొని అందులో ఈ టీ బ్యాగ్స్ వేసుకొని తీసుకుంటా..’ అంటూ తన ఫిట్‌నెస్ రహస్యాల్ని అందరితో పంచుకుంది రకుల్.

అయితే ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుందని.. అందుకే ఇతరుల ఫిట్‌నెస్‌ టిప్స్‌ని గుడ్డిగా పాటించడం కాకుండా.. అది చేసే వ్యాయామమైనా, తీసుకునే ఆహారమైనా నిపుణుల సలహా మేరకు పాటించడమే ఉత్తమమంటోంది రకుల్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్