Published : 21/02/2022 19:26 IST

ఆ బొమ్మలతో పిల్లల్లో స్ఫూర్తి నింపుతోంది!

(Photo: Instagram)

ఇప్పటి పిల్లలు బొమ్మలంటే బార్బీ డాల్స్‌, కార్టూన్‌ క్యారక్టర్లతో రూపొందించిన బొమ్మల్నే ఇష్టపడుతున్నారు. కానీ పాతకాలం నాటి చేత్తో చేసిన బొమ్మలు, చెక్క బొమ్మల గురించి తెలిసిన చిన్నారులు ఈ కాలంలో చాలా అరుదుగా ఉన్నారని చెప్పచ్చు. ఈ ఆదరణ కరవై ఇప్పటికే అంతరించిపోయిన ఈ కళకు పునర్వైభవం తీసుకురావాలని నిర్ణయించుకుంది కొడైకెనాల్‌కు చెందిన స్మృతి లామే. పాతబడిపోయిన, వృథా అంటూ మనం పడేసే దుస్తులతో వివిధ రకాల హ్యాండ్‌మేడ్‌ బొమ్మల్ని తయారుచేయిస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. స్వతహాగా స్త్రీవాద భావజాలం కలిగిన స్మృతి తమదైన ప్రతిభాసామర్ధ్యాలతో చరిత్రకెక్కిన పలువురు స్ఫూర్తిదాయక మహిళలకు ఈ బొమ్మలతో ప్రాణం పోస్తోంది. తద్వారా ఈ తరం పిల్లలకు నాటి కళను, ఆదర్శ మహిళల జీవితాల్నీ పరిచయం చేస్తున్నారు.

41 ఏళ్ల స్మృతి ఇద్దరు పిల్లల తల్లి. గతంలో కొన్నేళ్ల పాటు జర్నలిస్ట్‌గానూ విధులు నిర్వర్తించిందామె. ఆమె భర్త ఉద్యోగ నిమిత్తం కొన్నేళ్ల పాటు గురుగ్రామ్‌లోనే నివాసమున్న వారు.. పిల్లల చదువుల రీత్యా రెండేళ్ల కిందట తమిళనాడులోని కొడైకెనాల్‌కు మకాం మార్చారు. అంతలోనే కొవిడ్‌ ప్రతికూల పరిస్థితుల రీత్యా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు.

వాళ్లకు అండగా!

అయితే అదే సమయంలో ఆమెకు కుట్టుమిషన్ అవసరమైంది. తన ఇంట్లో దిండు కవర్ల కోసమని టైలర్‌ని వెతికే పనిలో పడిందామె. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆర్డర్లు లేక, తద్వారా ఆదాయం రాక నష్టాల్లో ఉన్న ఓ స్వయం సహాయక బృందం గురించి తెలుసుకుందామె. అంతేకాదు.. వాళ్ల కుటుంబాలకు ఆ మహిళలే ఆదాయ మార్గాలని, వారిలో బోలెడన్ని నైపుణ్యాలున్నాయని గ్రహించిన స్మృతి.. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎలాగైనా వారికి సహాయపడాలని నిర్ణయించుకుంది. ఇలా ఆలోచిస్తోన్న క్రమంలోనే ర్యాగ్‌ డాల్స్‌ (వస్త్రంతో రూపొందించిన బొమ్మలు) ఐడియా తన మదిలో మెదిలింది. నిజానికి ఈ ఆలోచన కొత్తదేమీ కాదని, తన చిన్నతనంలో స్వయంగా ఇలాంటి బొమ్మల్ని తయారుచేశానంటోంది స్మృతి.

అటు సహాయం.. ఇటు సందేశం!

‘నాకీ ఆలోచన రావడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు. ఎందుకంటే ఇలాంటి బొమ్మల్ని నా చిన్నతనంలో బోలెడన్ని తయారుచేసేదాన్ని. కానీ ఇప్పటి పిల్లలకు వీటి గురించి అస్సలు తెలియదు.. ఎందుకంటే ఇప్పుడంతా బార్బీ యుగమే కదా! అందుకే పిల్లల ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి ఈ స్వయం సహాయక బృందం హెల్ప్‌ తీసుకోవాలనుకున్నా. తద్వారా వారికి ఆదాయ మార్గం చూపచ్చన్న కోణంలోనూ ఆలోచించా. అందుకే నా ఆలోచనను వారితో పంచుకొని వెంటనే పని మొదలుపెట్టా.. ఈ క్రమంలో వృథాగా పడేసే పాత దుస్తులు, గుడ్డ ముక్కలతో బొమ్మలే కాదు.. మాస్కులు, గుమ్మాలకు కట్టుకునేందుకు చక్కటి సందేశాత్మక తోరణాలు.. వంటివెన్నో తయారుచేయించడం మొదలుపెట్టా..’ అంటూ తన ఆలోచనను ఆచరణలోకి తెచ్చిన విధానం గురించి పంచుకుంది స్మృతి.

బొమ్మలతో పిల్లలకు పాఠాలు!

మన చరిత్రలో ఎంతోమంది ఆదర్శ మహిళలున్నారు. పురుషాధిక్యం పేరుతో వారి చుట్టూ ఉన్న సవాళ్లను అధిగమించి, అడ్డుగోడల్ని బద్దలుకొట్టి ఎంతోమందికి స్ఫూర్తిగా మారారు. అలాంటి మహిళలకు తన బొమ్మలతో ప్రాణం పోస్తున్నారు స్మృతి. ‘అన్ని అంశాల్లోనూ ఆడ మగ ఇద్దరూ సమానమేనని నమ్ముతాను నేను. సందర్భం వచ్చినప్పుడల్లా ఇదే అంశం గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటా. ఇక నా వ్యాపార ఆలోచనలోనూ స్త్రీవాదం తొణికిసలాడుతుంది. ఎందుకంటే నేను తయారుచేయించే బొమ్మలన్నీ చరిత్రలో నిలిచిపోయిన స్ఫూర్తిదాయక మహిళలవే! ఇండో-అమెరికన్‌ వ్యోమగామి కల్పనా చావ్లా, భారత విద్యావేత్త సావిత్రీభాయ్‌ ఫూలే, అమెరికన్‌ కవయిత్రి మాయా ఆంగ్లో, మెక్సికన్‌ పెయింటర్‌ ఫ్రిదా కహ్లో.. వంటి ఆదర్శమూర్తులవే! వీటిని ఈ తరం పిల్లలకు అందించి.. ర్యాగ్‌ డాల్‌ కళకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు.. ఆయా మహిళల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తిని వారిలో కలిగించడమే ముఖ్యోద్దేశంగా పెట్టుకున్నా..’ అంటున్నారీ డాల్‌ ఉమన్.

వ్యాపారంలో ఇంతింతై..!

ప్రస్తుతం ‘The Smritsonian’ పేరుతో ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ స్టోర్‌ని ఏర్పాటుచేసి తన ఉత్పత్తుల్ని విక్రయిస్తోంది స్మృతి. అయితే తొలుత తన ఉత్పత్తుల్ని ఫేస్‌బుక్‌ వేదికగా విక్రయించిందామె. దీంతో చాలామంది నుంచి మంచి స్పందన రావడంతో.. స్థానికంగా స్టోర్‌ని ఏర్పాటుచేసింది. మరోవైపు సోషల్‌ మీడియా పేజీ ద్వారా కూడా తన ఉత్పత్తుల్ని విక్రయిస్తోందామె. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రస్తుతం యూరప్‌, అమెరికాల నుంచి కూడా తనకు ఆర్డర్లొస్తున్నాయని చెబుతోందీ మహిళా ఆంత్రప్రెన్యూర్‌. ఇలా ఈ ఒక్క ఆలోచనతో కష్టకాలంలో స్వయం సహాయక బృందాలకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటు, పిల్లల్లోనూ స్ఫూర్తి నింపుతోంది స్మృతి.

ఇంటి నుంచి మొదలైనప్పుడే..

తన ర్యాగ్‌ డాల్‌ వ్యాపారంతో ఆత్మనిర్భర్‌ ఛాంపియన్‌గా నిలిచి.. దేశ ప్రధాని ప్రశంసలందుకుంది ఈ సూపర్‌ ఉమన్ ‘అన్ని అంశాల్లోనూ ఆడ మగ ఇద్దరూ సమానమేనని నమ్ముతాను నేను. బహుశా ఈ ధోరణి మా అమ్మ, అమ్మమ్మల నుంచే అలవడిందనుకుంటా. ఎందుకంటే వాళ్లూ ఆ కాలంలో తమ భర్తలపై ఆధారపడకుండా ఉద్యోగాలు చేశారు. ఇంట్లో భార్యభర్తలిద్దరూ సమానమేనని చాటారు. అలా వాళ్ల మాటలు, చేతలు నాకెంతో స్ఫూర్తినిచ్చాయి. ప్రస్తుతం మా ఇంట్లోనూ ఇలాంటి సమానత్వమే కొనసాగుతోంది. ఇలా ఇంటి నుంచి సమానత్వం మొదలైనప్పుడే సమాజంలో మార్పొస్తుంది.. ఇదే స్త్రీపురుష సమానత్వానికి నాంది పలుకుతుంది..’ అంటూ తన మాటలతో ఈ సమాజాన్నీ మార్చే ప్రయత్నం చేస్తోందామె.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని