Published : 15/02/2022 16:26 IST

గురుగ్రామ్‌కు తొలి మహిళా పోలీస్ కమిషనర్!

(Photos: Facebook)

‘పోలీసులంటే రక్షక భటులు. తమ పనితీరుతో ప్రజా సమస్యల్ని పారదోలి.. వారి జీవితాన్ని సులభతరం చేయడంతో పాటు సౌకర్యవంతంగా మలచడమే తమ కర్తవ్యం..’ అంటున్నారు గురుగ్రామ్‌ కొత్త కమిషనర్‌గా తాజాగా ఛార్జ్‌ తీసుకున్న కళా రామచంద్రన్‌. మొన్నటిదాకా ఈ పదవిలో ఉన్న కేకే రావ్‌ వేరే చోటికి బదిలీపై వెళ్లడంతో ఆ స్థానంలో నియమితులయ్యారామె. దీంతో ఈ సిటీ తొలి మహిళా పోలీస్‌ కమిషనర్‌గా ఘనత సాధించారు కళ.

20 ఏళ్ల కెరీర్‌.. వివిధ హోదాలు!

కళా రామచంద్రన్‌.. 1994 బ్యాచ్‌కు చెందిన హరియాణా కేడర్‌ పోలీసు అధికారిణి. తన రెండు దశాబ్దాల పోలీస్‌ కెరీర్‌లో వివిధ శాఖల్లో పలు అత్యున్నత హోదాల్లో విధులు నిర్వర్తించారామె. గతంలో ఫతేహాబాద్‌లోని రేవరి సిటీ ఎస్పీగా పనిచేసిన కళ.. 2001లో ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు డెప్యుటేషన్‌పై వెళ్లారు. 2017–2020 వరకు మేఘాలయలోని ఈశాన్య పోలీసు అకాడమీకి హెడ్‌గా పనిచేశారు. 2020 ఆగస్టులో తిరిగి హరియాణా చేరుకున్న ఆమె.. ఆ రాష్ట్ర పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని మహిళా రక్షణ సెల్‌, విజిలెన్స్‌ బ్యూరోకు అదనపు డీజీపీగా; రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఇక తాజాగా గురుగ్రామ్‌కు పోలీస్ కమిషనర్‌గా పదవి చేపట్టి.. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు కళ.

పోలీసుగా అది నా విధి!

ఒక పోలీసుగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తనకు ప్రజా రక్షణే కర్తవ్యం అంటున్నారు కళ. ఇందుకోసం రాత్రింబవళ్లు పని చేయడానికి తానెప్పుడూ సిద్ధమేనంటున్నారు. ‘ఒక బాధ్యతాయుతమైన పోలీసుగా ప్రజలకు రక్షణ కల్పించడమే నా ముఖ్య విధి. ఈ క్రమంలోనే పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, ప్రజల చుట్టూ అలుముకున్న పలు సమస్యల్ని పారదోలి ఎవరి పనులు వారు సులభంగా, సౌకర్యంగా నిర్వర్తించుకోవడానికి వీలుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాను. అన్ని చోట్ల లాగే ఇక్కడా ట్రాఫిక్‌ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది.. రోడ్డు ప్రమాదాలూ పెరిగిపోతున్నాయి. మా బృందంతో కలిసి త్వరలోనే వీటిని అరికట్టే కార్యచరణ రచిస్తాను. అలాగే ఈవ్‌ టీజింగ్‌, పిల్లల రక్షణ, మహిళలపై జరిగే నేరాల వల్ల స్త్రీలు భయాందోళలకు గురవుతున్నారు. వారిలో ఈ భయం పోవాలి.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా మహిళలు ఎప్పుడంటే అప్పుడు ధైర్యంగా బయటికొచ్చి తమ పనులు తాము చేసుకునేలా తయారుకావాలి. వాళ్లకు అలాంటి సురక్షితమైన వాతావరణం కల్పించడం నా ముందున్న ప్రధాన కర్తవ్యం. అలాగే ఆర్థిక నేరాలు, సైబర్‌ నేరాల పైనా ప్రత్యేక దృష్టి పెడతా..’ అంటూ తన భవిష్యత్‌ లక్ష్యాల గురించి చెప్పుకొచ్చారీ కొత్త కమిషనర్.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని