Published : 02/05/2022 15:09 IST

ఈ టిఫిన్ క్యారియర్లతో ఆ సమస్యలు ఉండవు!

(Photos: Instagram)

సాధారణంగా ఏదైనా రెస్టరంట్‌కు వెళ్లినా, టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లినా.. ఆహారాన్ని ప్యాక్‌ చేయడానికి సిల్వర్‌ ఫాయిల్‌ కవర్స్‌ ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం.. లేదంటే ప్లాస్టిక్‌ డబ్బాల్ని వినియోగిస్తుంటారు. నిజానికి ఈ రెండూ పర్యావరణహితమైనవి కావు. తద్వారా వాటిలో ప్యాక్‌ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లడంతో పాటు అవి భూమిలో కలిసిపోవడానికి లక్షల ఏళ్లు పడుతుంది. అందుకే ఈ రెండు సమస్యలకు ఏదైనా పరిష్కారం కనుక్కోవాలని ఆలోచించింది బెంగళూరుకు చెందిన సృష్టి గార్గ్‌. ఈ క్రమంలో- ‘డిప్‌-ఇన్‌-టిఫిన్‌’ పేరుతో ఎకో-ఫ్రెండ్లీ ఫుడ్‌ క్యారియర్స్‌ని రూపొందించాలని సంకల్పించింది. ఈ ఇన్నొవేటర్‌కు.. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో, ఎందుకొచ్చిందో తెలుసుకుందాం రండి..

పర్యావరణమంటే మక్కువ చూపే వారు కొందరుంటారు. వారి ఆలోచనల్లో, చేతల్లో అది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. సృష్టి కూడా ఇలాంటి అమ్మాయే! చిన్నతనం నుంచీ పర్యావరణంపై ప్రేమ చూపించే ఆమె.. ఈ దిశగా ఏదైనా కొత్త ఉత్పత్తి తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ‘సృష్టి స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ’ నుంచి డిజైనింగ్‌లో డిగ్రీ పట్టా అందుకుంది.

డిజైనింగ్‌కి పర్యావరణంతో ముడిపెట్టి..!

ఆపై ఇందులోనే అడ్వాన్స్‌డ్‌ డిజైనింగ్‌ కోర్సు నేర్చుకున్న సృష్టి.. ఇంటర్న్‌గా, ఫ్రీలాన్స్‌ ప్రొడక్ట్‌ డిజైనర్‌గా పలు కంపెనీల్లో పనిచేసింది. డిజైనింగ్‌తో ఎలాంటి మార్పైనా సాధ్యమే అన్న సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతుంటుందామె. దీన్ని పర్యావరణంతో ముడిపెట్టి తన మనసులోని ఆలోచనలన్నీ పేపర్‌పై పెట్టడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ముంబయి డబ్బావాలాలు వినియోగించే స్టీల్ టిఫిన్ క్యారియర్ స్కెచ్‌ను పేపర్‌పై గీసింది. అయితే దాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా.. కాస్త మార్పు చేసి తాటి ఉత్పత్తులతో టిఫిన్‌ క్యారియర్‌ తయారుచేయాలని నిర్ణయించుకుంది సృష్టి.

‘ఏ రెస్టరంట్‌కి వెళ్లినా, టిఫిన్‌ సెంటర్‌కి వెళ్లినా.. ప్యాకింగ్‌ కోసం ప్లాస్టిక్‌తో తయారుచేసిన సిల్వర్‌ ఫాయిల్‌ కవర్స్‌, డబ్బాల్నే ఉపయోగిస్తుంటారు. అయితే దానివల్ల అటు పర్యావరణానికి, ఇటు ఆరోగ్యానికీ నష్టమే. నేను కాలేజీలో చదివే రోజుల్లో దీనిపై నాకు మరింత అవగాహన పెరిగింది. అందుకే ప్రాజెక్ట్‌లో భాగంగా తాటి ఉత్పత్తులతో ఎకో-ఫ్రెండ్లీ టిఫిన్‌ క్యారియర్‌ తయారుచేయాలని నిర్ణయించుకున్నా. ఈ ఆలోచనకు భారతీయ సంప్రదాయాల్ని ముడిపెట్టాలనుకున్నా. ఈ క్రమంలో నా డిజైనింగ్‌ స్కిల్స్ ఉపయోగపడ్డాయి..’ అంటూ తన ఐడియా గురించి చెబుతోంది సృష్టి.

తడి పదార్థాల్నీ క్యారీ చేయచ్చు!

అల్పాహారం ప్యాక్‌ చేసే క్యారియర్ల కోసం ఎండిపోయిన తాటి ఉత్పత్తులతో రూపొందించిన పాత్రలను ఒకదానిపై ఒకటి పేర్చి క్యారియర్‌ రూపమిస్తోంది సృష్టి. దాన్ని సులభంగా పట్టుకునేందుకు వీలుగా పేపర్‌ హ్యాండిల్‌ను జత చేసింది. ‘మొదట్లో ఇడ్లీ, వడ, అప్పం.. వంటి పొడి పదార్థాల్ని ప్రయత్నించి చూశాం.. ఇక ఇప్పుడు చట్నీ, సాస్‌.. వంటి తడి పదార్థాలు లీకవకుండా ఉండేలా బౌల్‌ తయారీలో పలు మార్పులు చేర్పులు చేస్తున్నాం. ఇక ఏ బౌల్‌లో ఏ టిఫిన్‌ ఉందో తెలిసేలా.. షీట్‌ పేపర్‌పై దాని పేరు ముద్రించి.. దాన్నే ఈ బౌల్స్‌పై మూతలా వాడుతున్నాం.. మేము తయారుచేసే ఈ డిప్‌-ఇన్‌-టిఫిన్‌ బౌల్స్.. పేపర్‌ మాదిరిగానే 90 రోజుల్లో భూమిలో కలిసిపోతాయి..’ అంటూ చెప్పుకొచ్చింది సృష్టి.

ఇలా తన ఐడియాతో పర్యావరణాన్ని కాపాడడమే కాదు.. ఎంతోమందికి ఉపాధినీ కల్పించాలని ఆశిస్తోంది ఈ యంగ్‌ ఇన్నొవేటర్‌. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న తన ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఆయా ఫుడ్‌ డెలివరీ కంపెనీలు, రెస్టరంట్లతో చర్చలు సాగిస్తోంది ఈ యువ ఆంత్రప్రెన్యూర్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని