ఆ పిల్లల చదువు ఆగకూడదని తనేం చేసిందో తెలుసా?

తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే.. గురువు జీవితాన్నిస్తాడంటారు.. అలా ఎంతోమంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు కశ్మీర్‌ లోయకు చెందిన మసరత్‌ ఫరూఖ్‌. నిత్యం అల్లర్లు, బాంబుల మోతతో దద్దరిల్లే ఈ ప్రాంతంలో స్కూళ్లు ఏడాదంతా.....

Updated : 17 Jun 2022 20:44 IST

(Photo: Instagram)

తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే.. గురువు జీవితాన్నిస్తాడంటారు.. అలా ఎంతోమంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు కశ్మీర్‌ లోయకు చెందిన మసరత్‌ ఫరూఖ్‌. నిత్యం అల్లర్లు, బాంబుల మోతతో దద్దరిల్లే ఈ ప్రాంతంలో స్కూళ్లు ఏడాదంతా కొనసాగడం కల్లే. పైగా లాక్‌డౌన్‌ ప్రభావంతో పిల్లలంతా నెలల తరబడి ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇలాంటి కారణాల వల్ల పిల్లల చదువుకు ఆటంకం కలగకూడదని నిర్ణయించుకుందామె. ఈ ఆలోచనతోనే పిల్లలు బడికి రాకపోతేనేం.. తామే పిల్లల వద్దకు వెళ్లి చదువు చెప్తామంటూ.. ఓ విద్యా సంస్థను స్థాపించింది. ప్రి-నర్సరీ దగ్గర్నుంచి పన్నెండో తరగతి దాకా.. జాతీయ, అంతర్జాతీయ సిలబస్‌లలో వందలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతోన్న ఆమె సేవల్ని కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా గుర్తించారు. ‘కశ్మీరీ విద్యారంగంలో తొలి మహిళా యువ ఆంత్రప్రెన్యూర్‌’గా గుర్తింపునిచ్చి గౌరవించారు. దీంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. మరి, ఇంతకీ ఫరూఖ్‌ టీచింగ్‌ జర్నీ ఎక్కడ, ఎలా ప్రారంభమైంది? పిల్లలకు ఆత్మీయ టీచర్‌గా ఆమె ఎలా మారారు? రండి.. తెలుసుకుందాం..!

టీచింగ్‌పై మక్కువతో..!

శ్రీనగర్‌లో పుట్టిపెరిగిన 27 ఏళ్ల మసరత్‌ ఫరూఖ్‌కు చిన్నతనం నుంచే టీచింగ్‌ వృత్తి అంటే ఇష్టం. ఈ క్రమంలోనే అటు తన చదువును కొనసాగిస్తూనే.. మరోవైపు కొందరు పిల్లలకు ట్యూషన్లు చెప్పేదామె. క్లినికల్‌ సైకాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఆమె.. తన తపనను నెరవేర్చుకోవడానికి కరోనా లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుందని చెప్పచ్చు. ఆ సమయంలో స్కూళ్లు మూతపడడం, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఆమెను ఆలోచనలో పడేసింది. దీనికి తోడు కశ్మీర్‌లో నిత్యం జరిగే అల్లర్లు, ఉగ్ర దాడుల వల్ల తరచుగా స్కూళ్లను మూసివేయాల్సి వస్తుంటుంది. ఇలాంటి కారణాల వల్ల పిల్లల చదువుకు అంతరాయం కలగకూడదంటే.. పిల్లల వద్దకే చదువును తీసుకెళ్లాలనుకుంది ఫరూఖ్‌. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కరోనా సమయంలో ‘స్మార్ట్‌ క్లాసెస్‌ హోమ్‌ ట్యూషన్స్‌’ పేరుతో ఓ విద్యా సంస్థకు శ్రీకారం చుట్టిందామె.

ఇద్దరు టీచర్లతో మొదలు..!

ప్రతి ఇంట్లో ఉన్న చిన్నారులకు విద్యనందించాలంటే అది తన ఒక్కదాని వల్ల సాధ్యం కాదు. అందుకే తొలుత ఇద్దరు టీచర్లను రిక్రూట్‌ చేసుకొని తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది ఫరూఖ్‌. ‘కొవిడ్‌ సమయంలో కొన్నాళ్లు ఇంట్లోనే ఖాళీగా గడపాల్సి వచ్చింది. ఈ సమయంలో పిల్లలకు సరైన విద్యా సదుపాయాల్లేక.. వాళ్ల చదువులు సరిగ్గా సాగకపోవడం గమనించా. ఆన్‌లైన్‌ క్లాసులున్నా.. పిల్లలు ఏకాగ్రత పెట్టలేకపోయారు. అందుకు మా కజిన్సే ప్రత్యక్ష ఉదాహరణ. దీంతో క్రమంగా వాళ్లలో చదువు పట్ల ఆసక్తి కూడా తగ్గిపోతూ వచ్చింది. దీన్ని అధిగమించడానికే విద్యా సంస్థను ప్రారంభించా. ముందు ఇద్దరు టీచర్లను రిక్రూట్‌ చేసుకొని.. ఇంటింటికీ వెళ్లి చదువు చెప్పేలా ప్రణాళిక రూపొందించుకున్నా..’ అంటూ తన జర్నీ ప్రారంభమైన తీరును వివరించింది ఫరూఖ్.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ సేవలు..!

ఇద్దరు టీచర్లతో మొదలైన తన సంస్థలో ఇప్పుడు సుమారు 80 మంది ఉన్నత విద్యావంతులు, అనుభవజ్ఞులైన టీచర్లు ఉన్నారంటోంది ఫరూఖ్‌. అందులోనూ 50 శాతం మంది మహిళా ఉపాధ్యాయులకు అవకాశాలు కల్పించింది. ‘తొలుత ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్లం. ఎందుకంటే పిల్లలు టీచర్‌తో నేరుగా కాంటాక్ట్‌ అయితేనే మరింత శ్రద్ధగా పాఠాలు వినగలుగుతారన్నది నా నమ్మకం. పైగా ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో వారికి గ్యాడ్జెట్స్‌ అందిస్తే.. చదువు కంటే గేమ్స్‌, ఇతర విషయాల పైనే దృష్టి పెడుతున్నారు. అందుకే ఆఫ్‌లైన్‌లో సేవలు ప్రారంభించి.. వారికి విద్యపై ఆసక్తి పెంచడంలో సఫలమయ్యాం. ఆపై క్రమంగా ఆన్‌లైన్‌ సేవల్నీ అందుబాటులోకి తీసుకొచ్చా. త్వరలోనే కశ్మీర్ నలుమూలలకూ విద్యా సేవల్ని విస్తరించే ఆలోచనలో ఉన్నా..’ అంటూ తన భవిష్యత్‌ లక్ష్యాల గురించి చెప్పుకొచ్చింది ఫరూఖ్.

గవర్నర్‌ మెప్పు పొందింది!

ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా పలు ప్రముఖ విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఆమె.. ప్రి-నర్సరీ నుంచి 12వ తరగతి దాకా తరగతులు నిర్వహిస్తోంది. అది కూడా CBSE, NCERT, కేంబ్రిడ్జి పాఠ్యప్రణాళికలతో! దీంతో పాటు ఆయా సబ్జెక్టులపై హోమ్‌ ట్యూషన్స్‌ సేవలు కూడా అందిస్తోంది. ఏదేమైనా తన సంస్థ ద్వారా ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఫరూఖ్‌ ఫౌండేషన్లో ప్రస్తుతం సుమారు 300కు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇలా ఓవైపు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ.. మరోవైపు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోన్న ఈ యంగ్‌ టీచర్‌ సేవల్ని గుర్తించిన కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా.. ‘కశ్మీరీ విద్యారంగంలో తొలి మహిళా యువ ఆంత్రప్రెన్యూర్‌’గా ఆమెను గుర్తించి గౌరవించారు. ఈ గుర్తింపు దక్కడం గర్వంగా ఉందంటోన్న ఫరూఖ్‌.. ‘ప్రస్తుతం ఇక్కడ ఉన్నత చదువులు చదివి ఉపాధి లేని యువత ఎంతోమంది ఉన్నారు. వాళ్లు తమ ఆసక్తి, నైపుణ్యాలకు తగ్గ వ్యాపారం లేదా ఇతర మార్గాల్ని అన్వేషించచ్చు.. తద్వారా మరింత మందికి ఉపాధి కల్పించిన వారవుతారు..’ అంటూ ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో స్ఫూర్తి నింపుతోందీ కశ్మీరీ విద్యాకుసుమం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్