Tabassum Haque : వాళ్ల కోసమే ఈ అందాల పోటీలు!
మన నుదుటి రాత ఆ బ్రహ్మ రాస్తాడంటారు.. కానీ మన తలరాత మనమే రాసుకోవాలంటోంది దిల్లీకి చెందిన తబాసుమ్ హఖ్. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమె.. చిన్నతనంలో చదువుకునేందుకు సరైన సదుపాయాలు లేక, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది. ఉన్నత విద్యతోనే ఈ పరిస్థితుల్ని....
(Photo: Instagram)
మన నుదుటి రాత ఆ బ్రహ్మ రాస్తాడంటారు.. కానీ మన తలరాత మనమే రాసుకోవాలంటోంది దిల్లీకి చెందిన తబాసుమ్ హఖ్. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమె.. చిన్నతనంలో చదువుకునేందుకు సరైన సదుపాయాలు లేక, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది. ఉన్నత విద్యతోనే ఈ పరిస్థితుల్ని అధిగమించచ్చని నిర్ణయించుకున్న ఆమె.. జర్నలిజం వృత్తిని ఎంచుకుంది. ప్రముఖ సంస్థలో ఉద్యోగం, మంచి జీతం అందుకుంది. ఆ తర్వాత పెళ్లి, పిల్లల బాధ్యతతో కొన్నేళ్లు ఇంటికే పరిమితమైనా.. తన కెరీర్‌ను మాత్రం వదులుకోలేదామె. అయితే ఈసారి తన దృష్టి కోణాన్ని మార్చుకొని అందాల పోటీల నిర్వహణవైపుకి మళ్లించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశం తరఫున ఎంతోమంది అందాల రాణుల్ని విశ్వ వేదికపై నిలబెడుతోంది. ఇక తాజాగా మరో అంతర్జాతీయ బ్యూటీ ఈవెంట్‌లో భాగమైన ఆమె.. తానింత స్థాయికి చేరుకోవడానికి తన కూతురిని చూసి స్ఫూర్తి పొందిన ఓ సందర్భమే కారణమంటోంది. మరి, ఇంతకీ ఏంటా సందర్భం? కలం వదిలి అందాల పోటీల వైపుకి ఆమె సాగించిన ప్రయాణం ఆమె మాటల్లోనే..!
నేను పుట్టి పెరిగిందంతా దిల్లీలోనే. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు. అందుకే నాకు, నా తోబుట్టువులకు మంచి విద్యనందించాలని పట్టుబట్టింది. అయితే అందుకు తగ్గట్లుగా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు మాకు సహకరించలేదు. దీంతో ఆర్థికంగా నా కుటుంబానికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నా. ఇందుకు చదువొక్కటే మార్గమని దానిపై దృష్టి పెట్టా.
జర్నలిజం వైపు అడుగులు..!
డిగ్రీ, పీజీ పూర్తయ్యాక సౌత్ దిల్లీ పాలిటెక్నిక్ కళాశాలలో జర్నలిజం కోర్సు చదివేందుకు స్కాలర్‌షిప్ అందుకున్నా. ఇదే నా కెరీర్‌ను మలుపుతిప్పిందని చెప్పాలి. కోర్సు పూర్తి కాగానే ప్రముఖ వార్తా సంస్థలో ఉద్యోగం వచ్చింది. మంచి జీతం, ఉజ్వల భవిష్యత్తు.. చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ ఒక్కసారిగా కనుమరుగైపోయాయి. ఉద్యోగం చేస్తోన్న క్రమంలోనే సుబోద్ జైన్ అనే జర్నలిస్ట్‌తో పరిచయమైంది. అది ప్రేమకు దారితీసింది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఎంత ప్రయత్నించినా మా ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో బయటికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం. ఇక మా వివాహబంధాన్ని అత్తింటి వారు స్వాగతించారు. మా ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే మొదటి ప్రెగ్నెన్సీ సమయంలోనే పలు ఆరోగ్య కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలా ఇల్లు, పిల్లల ఆలనా పాలనలోనే ఏళ్లు గడిచిపోయాయి.
కూతురి ఈవెంట్.. ఆలోచన రేకెత్తించింది!
నా పాప చిన్నతనం నుంచీ చాలా చురుకు. స్కూల్లో నిర్వహించే ప్రతి పోటీలో పాల్గొని ప్రతిభ చూపేది. అలా ఓసారి తన స్కూల్లో నిర్వహించిన ఓ పోటీలో పాల్గొని ర్యాంప్ వాక్ చేసింది. అప్పుడనిపించింది.. నేనెందుకు అందాల పోటీలు నిర్వహింకూడదని?! అది కూడా పెళ్లైన వాళ్లను ఈ వేదికపైకి తీసుకొస్తే వాళ్లలో దాగున్న ప్రతిభను నిరూపించుకోవడానికి ఓ చక్కటి అవకాశం సృష్టించినదాన్నవుతా.. అనుకున్నా! నా ఆలోచనను నా భర్తతో పంచుకున్నా.. తనూ సరేననడంతో.. 2016లో ‘పరిస్సా కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థను ప్రారంభించా. పెళ్లైన మధ్య తరగతి మహిళలకు అందాల పోటీలు నిర్వహించడమే దీని ముఖ్యోద్దేశం. అలా తొలుత ‘మిసెస్ దిల్లీ - NCR’ పేరుతో ఈవెంట్ నిర్వహించా. దీనికి మంచి స్పందన రావడంతో నాలో ఆత్మవిశ్వాసం రెట్టించింది.
అంతర్జాతీయ వేదికలపైనా..!
దీంతో అంతర్జాతీయ స్థాయిలో అందాల పోటీల నిర్వహణ కోసం ‘Dazzles Event’ పేరుతో మరో సంస్థను స్థాపించా. ఈ వేదికగా థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక.. తదితర దేశాల్లోనూ అందాల పోటీల్ని నిర్వహించే అవకాశం దక్కింది. మిసెస్ ఏషియా, మిసెస్ ఇండియా యూనివర్స్, మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్, మిసెస్ ఇండియా వరల్డ్, మిసెస్ తెలంగాణ.. వంటి పోటీలు అందులో కొన్ని! ఈ పోటీల్లో వివాహితలే కాదు.. క్యాన్సర్‌ను జయించిన మహిళలకూ అవకాశం ఇస్తున్నాం. ఇక తాజాగా (జూన్ 22న) దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ప్రారంభమైన మరో అందాల పోటీల కోసం దేశం తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చింది. ఇందులో సుమారు వంద దేశాల నుంచి పోటీదారులు పాల్గొంటున్నారు. భవిష్యత్తులో యూరోపియన్ దేశాల్లో మిస్, మిసెస్ అందాల పోటీలు నిర్వహించాలన్నది నా కల. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించా. మరో విషయం ఏంటంటే.. నేను ధర్మశాల క్యాన్సర్ ఆస్పత్రితో కలిసి రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నా. ఈ క్రమంలోనే నేను నిర్వహించే అందాల పోటీల్లోనూ వీటిపై అవగాహన పెంచడానికి ఏదో ఒక ఈవెంట్ ఉండేలా ప్రణాళిక వేసుకుంటా.
మహిళలందరిలో ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది. అయితే చాలామంది వాటిని నిర్లక్ష్యం చేస్తూ తమ వల్ల ఏదీ సాధ్యం కాదనుకుంటారు. అలాకాకుండా దాన్ని గుర్తించి.. ఆ దిశగా ప్రయత్నిస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.. అదే మనల్ని విజయతీరానికి చేర్చుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.