Cancer Survivor: విమానాల్ని అద్దెకిస్తూ కోట్లు గడిస్తోంది!

‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు.. నిద్ర పోనివ్వకుండా చేసేది’ అన్నారు అబ్దుల్‌ కలాం. విమానయాన రంగంలోకి రావాలన్న కల తననూ పట్టు వదలని విక్రమార్కుడిలా తయారుచేసిందంటోంది జెట్‌ సెట్‌ గో సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ కనికా టేక్రివాల్‌. పురుషాధిపత్యం వేళ్లూనుకుపోయిన విమానయాన రంగంలోకి అడుగుపెట్టాలని.....

Published : 28 Mar 2022 16:53 IST

(Photos: Instagram)

‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు.. నిద్ర పోనివ్వకుండా చేసేది’ అన్నారు అబ్దుల్‌ కలాం. విమానయాన రంగంలోకి రావాలన్న కల తననూ పట్టు వదలని విక్రమార్కుడిలా తయారుచేసిందంటోంది జెట్‌ సెట్‌ గో సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ కనికా టేక్రివాల్‌. పురుషాధిపత్యం వేళ్లూనుకుపోయిన విమానయాన రంగంలోకి అడుగుపెట్టాలని చిన్నతనంలోనే సంకల్పించుకున్న ఆమెకు ఒకానొక దశలో క్యాన్సర్‌ మహమ్మారి అడ్డుపడింది. అయినా ధైర్యంగా దాన్ని అధిగమించి అడుగు ముందుకేసింది. కేవలం ఐదు వేల రూపాయలతో సంస్థను ప్రారంభించి.. ఇప్పుడు రూ. 150 కోట్ల టర్నోవర్‌ను అధిగమించింది. ఇప్పటివరకు విమానాలు, హెలికాప్టర్‌ సేవల్ని మాత్రమే అందుబాటులో ఉంచిన ఆమె.. ఇప్పుడు ఈవీటోల్స్‌ సదుపాయాల్నీ వినియోగదారుల ముందుకు తెచ్చే సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇలా పౌర విమానయాన సేవల్లో క్రియాశీలమైన పాత్ర పోషిస్తున్నందుకు గానూ ఇటీవలే ‘వింగ్స్‌ ఇండియా - 2022’ సదస్సులో భాగంగా ‘వింగ్స్‌ ఇండియా’ అవార్డు అందుకున్నారు కనిక. ఈ నేపథ్యంలో ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ సక్సెస్‌ జర్నీ గురించి తెలుసుకుందాం..!

మనం కాస్త దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు క్యాబ్స్‌ అద్దెకు తీసుకోవడం తెలిసిందే! కనికా టేక్రివాల్‌ నెలకొల్పిన ‘జెట్‌ సెట్‌ గో’ కూడా ఇలాంటి సేవలే అందిస్తోంది. అయితే ఇక్కడ క్యాబ్‌కు బదులుగా విమానాలు, హెలికాప్టర్లు అద్దెకు తీసుకోవచ్చు. నిజానికి పురుషాధిపత్యం ఉన్న విమానయాన రంగంలోకి మహిళలు ఉద్యోగిగా అడుగుపెట్టడమే గొప్ప విషయమంటే.. ఇలాంటి సంస్థను నెలకొల్పడం మరో సవాలని చెప్పాలి. అలాంటి సవాలును స్వీకరించడానికి చిన్నతనం నుంచే సిద్ధపడిందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌.

అమ్మానాన్న వద్దన్నారు!

భోపాల్‌కు చెందిన సంప్రదాయ మార్వాడీ కుటుంబంలో పుట్టి పెరిగిన కనిక.. విమానయానంపై మక్కువతో ఇటువైపుగా అడుగేసింది. ముంబయి యూనివర్సిటీలో బీఏ ఎకనమిక్స్‌ పూర్తి చేసిన ఆమె.. ఎంబీఏ చదవడానికి యూకే వెళ్లింది. అయితే అప్పటికే విమానయాన రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది కనిక. ప్రతి విషయంలో కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించే కనిక.. తనే స్వయంగా ఓ విమానయాన సంస్థను నెలకొల్పాలని సంకల్పించుకుంది. ఇదే ఆలోచనను తన తల్లిదండ్రులతో పంచుకోగా.. తొలుత వాళ్లు వారించారని చెబుతోంది.

‘విమానయాన రంగంలో ఉద్యోగిగా పనిచేయడం, ఆంత్రప్రెన్యూర్‌గా కొనసాగడం.. ఈ రెండూ విభిన్నమని చెప్పాలి. ప్రస్తుత రోజుల్లో ఈ రంగంలోకి అడుగుపెట్టే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే వీరిలో చాలామంది ఉద్యోగులే! కానీ ఉద్యోగం కల్పించే స్థాయిలో మహిళలు చాలా అరుదుగా ఉన్నారు. నిజానికి ఇది సవాలుతో కూడుకున్నది. అయినా ఈ అరుదైన టాస్క్‌నే నేను ఎంచుకోవాలనుకున్నా. ఇదే ఆలోచనను మా అమ్మానాన్నలతో చెప్పాను. కానీ ఇందుకు వారు ఒప్పుకోలేదు. అయినా నేను పట్టుబట్టా. ఆ తర్వాత నా వ్యాపారాభివృద్ధి చూసి వాళ్లే తమ మనసు మార్చుకున్నారు..’ అంటూ ఓ సందర్భంలో పంచుకుంది కనిక.

క్యాన్సర్‌తో పోరాడుతూనే..!

యూకేలో ఎంబీఏ పూర్తి చేసి తిరిగొచ్చాక తన ఆశయంపై పూర్తి దృష్టి పెట్టింది కనిక. అయితే ఈ ప్రయత్నాల్లో ఉన్నప్పుడే క్యాన్సర్‌ బారిన పడిందామె. అలాగని భయంతో కుంగిపోవాలనుకోలేదు కనిక.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూలంగా అడుగు ముందుకేసింది. చికిత్స తీసుకున్న తొమ్మిది నెలలు తనకు ఎంతో విలువైన సమయమని.. ఈ క్రమంలోనే తన వ్యాపారానికి సంబంధించిన వ్యూహరచన మొత్తం పూర్తి చేశానని చెబుతోందీ డేరింగ్‌ లేడీ.

‘యూకేలో ఎంబీఏ చదివేటప్పుడే విమానయాన రంగంలో వ్యాపారాభివృద్ధికి సంబంధించిన మెలకువలు తెలుసుకోవడానికి అక్కడి విమానయాన సంస్థల్లో పనిచేశా. ఇదే ఉత్సాహంతో కంపెనీ పెడదామని భోపాల్‌కు తిరిగొచ్చేశా. కానీ అదే సమయంలో నాకు ‘Hodgkins Lymphoma’ (శోషరస వ్యవస్థపై ప్రభావం చూపే క్యాన్సర్‌) రెండో దశలో ఉందని నిర్ధారణ అయింది. నిజానికి చాలామందికి జీవితంలో ఇది కఠినమైన దశ. కానీ నేను మాత్రం బాధను భరిస్తూనే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నా. క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న తొమ్మిది నెలలు నా వ్యాపార వ్యూహం పైనే దృష్టి పెట్టా. బిజినెస్‌ ఎలా ప్రారంభించాలి.. దాన్నెలా అభివృద్ధి చేయాలన్న పూర్తి స్థాయి అవగాహన నాకొచ్చింది..’ అంటూ చెప్పుకొచ్చిందామె.

ఆ అనుభూతి అందించాలనే..!

సాధారణంగా మనం ఓ వాహనం అద్దెకు తీసుకున్నామంటే.. మన పని పూర్తయ్యేదాకా అది మన సొంత వాహనమే అన్న అనుభూతి కలగాలి.. దాంతో పాటు ఖర్చూ కలిసి రావాలి. చాలా సంస్థల్లో ఇవి లోపించినట్లు తన పరిశోధనల్లో తెలుసుకున్నానని అంటోంది కనిక.

‘సంస్థ ప్రారంభానికి ముందు చాలామంది వినియోగదారుల్ని కలిశాను. ఎక్కువ డబ్బులు వసూలు చేయడంతో పాటు సదరు సంస్థలు అందించే సౌకర్యాలు, మెయింటెనెన్స్‌.. వంటి అంశాల్లో లోపాలున్నట్లు తెలుసుకున్నా. ఇలాంటి సమస్యలు నా సంస్థతో రాకూడదని నిర్ణయించుకున్నా. ఇలా సమగ్ర పరిశీలన, పరిశోధన అనంతరం 2014లో ‘జెట్‌ సెట్‌ గో’ను స్థాపించా. సరసమైన ధరలో, సంపూర్ణ భద్రతతో కూడిన విమానయాన సేవల్ని వినియోగదారులకు అందించడమే మా సంస్థ ముఖ్యోద్దేశం. అయితే తొలుత ఐదు వేల రూపాయల పెట్టుబడితో ఛార్టర్డ్‌ ఫ్లైట్స్‌ బుక్‌ చేసుకోవడానికి ఒక యాప్‌ను రూపొందించా.. రెండేళ్లు తిరిగేసరికి వినియోగదారుల నుంచి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. ఇక ప్రస్తుతం ఏడాదికి దాదాపు లక్ష మంది మా అద్దె విమానాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. తద్వారా మా సంస్థ వ్యాపారం ఏడాదికి సుమారు రూ. 150 కోట్ల టర్నోవర్‌ను దాటేసింది..’ అంటూ తన సంస్థ గురించి చెప్పుకొచ్చారామె.

ఇకపై డ్రోన్ల సేవలూ..!

వినియోగదారులకు ఉత్తమమైన సేవల్ని అందిస్తోన్న జెట్‌ సెట్‌ గో సంస్థకు ‘ఉబర్‌ ఆఫ్‌ ది స్కైస్‌’ అనే మరో పేరు కూడా ఉంది. ప్రస్తుతం దేశీయ ప్రైవేట్‌ జెట్‌ సేవల మార్కెట్లో 21 శాతం వాటా కలిగిన ఈ సంస్థలో క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌, పారిశ్రామిక వేత్త పునీత్‌ దాల్మియా పెట్టుబడులు పెట్టారు. ఇలా ఇంతింతై అన్నట్లుగా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసి విమానయాన రంగంలో తనకంటూ ప్రత్యేకంగా ఓ పేజీ లిఖించుకున్న కనికకు ఇటీవలే ‘వింగ్స్‌ ఇండియా-2022’ సదస్సులో భాగంగా ‘వింగ్స్‌ ఇండియా’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా తన భవిష్యత్‌ లక్ష్యాలను పంచుకున్నారామె.

‘ఇప్పటిదాకా విమానాలు, జెట్స్‌, హెలికాప్టర్లకు పరిమితమైన మా సంస్థ సేవలు ఇకపై ఈవీటోల్స్‌ రూపంలో అందుబాటులోకి రానున్నాయి. పైలట్‌ ఉండని భారీ డ్రోన్లలో ఒకేసారి నలుగురు ప్రయాణించే సదుపాయమే ఈ ఈవీటోల్స్‌. ఒకసారి ఛార్జింగ్‌తో 40 కిలోమీటర్లు ప్రయాణించగలవివి. దీంతో కిలోమీటర్‌కు రూ.12 మాత్రమే ఖర్చవుతుంది. ఎయిర్‌బస్‌తో పాటు మరికొన్ని సంస్థలు ఈ డ్రోన్లను ఉత్పత్తి చేసేందుకు సన్నద్ధమయ్యాయి. తొలిదశలో హైదరాబాద్‌లో, మలిదశలో ముంబయి-బెంగళూర్లలో ఈ సేవల్ని ప్రారంభించనున్నాం. మా ఈ ప్రయత్నంతో చాలామందికి ట్రాఫిక్‌ ప్రయాస తగ్గుతుంది. ఇందుకోసం సుమారు రూ. 1500 కోట్లు నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే బేగంపేటలో త్వరలోనే ఒక ఏవియేషన్‌ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం..’ అంటూ చెప్పుకొచ్చారు కనిక.

‘మనపై మనకు నమ్మకమున్నప్పుడు.. ఎలాంటి అవరోధాలు, సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి లక్ష్యాల్ని చేరుకొని తీరతాం..’ అంటూ తన విజయ సూత్రాన్ని పంచుకున్న కనిక.. భారత ప్రభుత్వం నుంచి ‘జాతీయ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌’ అవార్డును అందుకుంది. అంతేకాదు.. ఫోర్బ్స్‌ ‘30 అండర్‌ 30’, ‘బీబీసీ 100 మంది స్ఫూర్తిదాయక మహిళల’ జాబితాల్లోనూ స్థానం దక్కించుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్