Mrs World: అమ్మయ్యాకా.. ఏదైనా సాధ్యమే!

పెళ్లై పిల్లలు పుడితే ఇక మహిళల కెరీర్‌ ముగిసినట్లే అని భావిస్తారు. ఒకవేళ అవకాశాలు తలుపుతట్టినా రాణించలేరని నిరుత్సాహ పరుస్తుంటారు. కానీ కొంతమంది మహిళలు ఇందుకు భిన్నం. ఆలిగా ఇంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే, అమ్మగా పిల్లల బాగోగుల్ని చూసుకుంటూనే.. తమకు ఆసక్తి ఉన్న రంగంలో సత్తా చాటుతున్నారు.

Updated : 11 Jan 2022 21:23 IST

(Photo: Instagram)

పెళ్లై పిల్లలు పుడితే ఇక మహిళల కెరీర్‌ ముగిసినట్లే అని భావిస్తారు. ఒకవేళ అవకాశాలు తలుపుతట్టినా రాణించలేరని నిరుత్సాహ పరుస్తుంటారు. కానీ కొంతమంది మహిళలు ఇందుకు భిన్నం. ఆలిగా ఇంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే, అమ్మగా పిల్లల బాగోగుల్ని చూసుకుంటూనే.. తమకు ఆసక్తి ఉన్న రంగంలో సత్తా చాటుతున్నారు. ఒడిశాకు చెందిన నవ్‌దీప్‌ కౌర్‌ను ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ‘మిసెస్‌ ఇండియా 2020-21’ కిరీటం అందుకున్న ఆమె.. ప్రస్తుతం ‘మిసెస్‌ వరల్డ్‌’ పోటీలకు సిద్ధమవుతోంది. త్వరలోనే జరగనున్న ఈ పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొనేందుకు ఇటీవలే లాస్‌ వెగాస్‌ చేరుకుంది. ‘మహిళలు ఏ దశలో ఉన్నా తమను తాము నిరూపించుకోగల సమర్థులు.. అయితే అందుకు కావాల్సిందల్లా స్వీయ నమ్మకమే!’ అంటోన్న ఈ అందాల అమ్మ సక్సెస్‌ స్టోరీ చదివేద్దామా మరి!

ఒడిశా స్టీల్‌ సిటీ రూర్కెలాలోని కన్స్‌బాహల్‌ అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగింది నవ్‌దీప్‌ కౌర్‌. అయితే తన చుట్టూ వనరులు, సౌకర్యాలు పరిమితమే అయినప్పటికీ.. చదువుపైనే దృష్టి పెట్టిందామె. ఈ క్రమంలోనే కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌, ఆపై ఎంబీఏ పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక కొన్నాళ్ల పాటు ఓ బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా, మరికొన్నాళ్ల పాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించింది. మరోవైపు యుక్త వయసు నుంచే అందాల పోటీల్లో పాల్గొనాలన్న ఆసక్తిని సైతం పెంచుకుంది కౌర్‌.

ఊహించని విజయమిది!

అయితే అంతలోనే పెళ్లైపోవడం, పాప పుట్టడంతో తన లక్ష్యాన్ని చేరుకోవడానికి మరికొన్నేళ్లు వేచి చూడక తప్పలేదంటోందామె. ‘ప్రస్తుతం నా పాపకు ఆరేళ్లు. అందాల పోటీల్లో పాల్గొనాలన్న కోరిక మిస్‌గా ఉన్నప్పట్నుంచే ఉన్నా.. మిసెస్‌గా మారాకే అది నెరవేరింది. గతేడాది మిసెస్‌ ఇండియా - 2020-21 కిరీటం గెలుచుకున్నా. పోటీల్లోనైతే పాల్గొనాలనుకున్నా కానీ.. గెలుపోటములు మన చేతిలో లేవన్నట్లు.. ఈ విజయం నేను ఊహించింది కాదు..’ అంటోందీ అందాల అమ్మ. ప్రస్తుతం భారత్‌ తరఫున ‘మిసెస్‌ వరల్డ్‌’ పోటీలకు సిద్ధమవుతోన్న కౌర్‌.. ఇందుకోసం బాడీ లాంగ్వేజ్‌, హావభావాలు, మేకప్‌ నైపుణ్యాలు.. వంటివన్నీ నిపుణుల ఆధ్వర్యంలో అవపోసన పడుతోంది.

ఒక్కరు మారినా చాలు!

పెళ్లై పిల్లలు పుట్టాక మహిళలు తమ కెరీర్‌పై దృష్టి పెడతానంటే ‘ఈ వయసులో నీకు అవసరమా?’ అన్నట్లు చూస్తుంటారు. సమాజంలో పాతుకుపోయిన ఈ ధోరణినే మార్చాలనుకుంటున్నానంటోంది కౌర్‌. ‘పిల్లలు పుట్టాక మహిళలకు తమకు నచ్చిన రంగంలో రాణించాలని ఉన్నా.. కుటుంబ ప్రోత్సాహం కరువవడంతో వారి కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. అయితే ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని అని చెప్తా. మాది ఉమ్మడి కుటుంబం.. నా ఫ్యామిలీ నాకు అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తుంటుంది. నన్ను నేను నిరూపించుకొని.. ఒక్కరిలో స్ఫూర్తి నింపినా చాలని ప్రతి రోజూ అనుకుంటా. మీకు మరో విషయం చెప్పనా..? మహిళలు తమ శక్తి సామర్థ్యాలను నమ్ముకుంటే తప్పకుండా విజయం సాధిస్తారు. ఇదేదో నేను మాటవరసకు అంటున్నది కాదు.. స్వీయానుభవంతో చెప్తున్నా..’ అంటూ తన విజయ రహస్యాన్ని బయటపెట్టిందీ ఒడిశా బ్యూటీ.

అందమైన మనసూ ఉంది!

ఇలా కేవలం నాలుగు మంచి మాటలు చెప్పడమే కాదు.. సేవా గుణంతోనూ తనలోని అంతః సౌందర్యాన్ని చాటుకుంటోంది కౌర్‌. ప్రస్తుతం ‘లేడీస్‌ సర్కిల్‌ ఇండియా’ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా కొనసాగుతోందామె. బాలికా విద్యను ప్రోత్సహించే మరో క్లబ్‌తో మమేకమై.. వెయ్యి మంది అమ్మాయిల్ని దత్తత తీసుకొని.. వారి చదువుకు సంబంధించిన బాధ్యతల్ని తన భుజాలపై వేసుకుంది. అంతేకాదు.. నెలలో ఐదు రోజులు ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల కోసం సమయం కేటాయిస్తోంది కౌర్‌. ఈ క్రమంలోనే వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పుతోంది. మరోవైపు అక్కడి గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు ఉచితంగా వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తోంది.

జనవరి 15న లాస్‌ వెగాస్‌ వేదికగా జరగనున్న ‘మిసెస్‌ వరల్డ్‌’ పోటీల కోసం ఇటీవలే అక్కడికి చేరుకుంది కౌర్‌. మరి, అందంతో పాటు అందమైన మనసునూ తన సొంతం చేసుకున్న ఈ అందాల అమ్మ.. విశ్వ వేదికపైనా విజయం సాధించాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం..!

ఆల్‌ ది బెస్ట్‌ మిసెస్‌ బ్యూటీ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్