Sufiya Sufi : 6002 కిలోమీటర్లు.. 110 రోజులు.. ఓ గిన్నిస్‌ రికార్డు!

కాస్త దూరం పరిగెడితేనే అలసిపోతాం.. కాళ్లు నొప్పులు పుడుతున్నాయంటూ ఆపసోపాలు పడుతుంటాం.. కానీ అజ్మీర్‌కు చెందిన సూఫియా ఖాన్‌ మాత్రం ఏకధాటిగా రోజుల తరబడి పరిగెడుతూనే ఉంటుంది. కొండ-కోనలు, రాళ్లూ-రప్పలు, మంచు పర్వతాలు, మైనస్‌ డిగ్రీ ఉష్ణోగ్రతలు.. ఇవన్నీ దాటుకుంటూ ఇప్పటికే దేశాన్ని......

Published : 31 Mar 2022 16:13 IST

(Photos: Instagram)

కాస్త దూరం పరిగెడితేనే అలసిపోతాం.. కాళ్లు నొప్పులు పుడుతున్నాయంటూ ఆపసోపాలు పడుతుంటాం.. కానీ అజ్మీర్‌కు చెందిన సూఫియా ఖాన్‌ మాత్రం ఏకధాటిగా రోజుల తరబడి పరిగెడుతూనే ఉంటుంది. కొండ-కోనలు, రాళ్లూ-రప్పలు, మంచు పర్వతాలు, మైనస్‌ డిగ్రీ ఉష్ణోగ్రతలు.. ఇవన్నీ దాటుకుంటూ ఇప్పటికే దేశాన్ని చుట్టేసింది.. ప్రపంచ రికార్డులు ఒడిసిపట్టింది. ఇక, ‘Indian Golden Quadrilateral Road’ (ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై.. వంటి నాలుగు ప్రధాన నగరాల్ని కలిపే రహదారి)ని చుట్టేసి.. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మహిళగా గిన్నిస్‌ పుటల్లోకీ ఎక్కింది. గతేడాది ఈ అరుదైన ఫీట్‌ పూర్తిచేసిన ఆమె.. తాజాగా దానికి సంబంధించిన రికార్డు పత్రాన్ని అందుకుంది. ఈ హ్యాపీ మూమెంట్‌ని సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుంటూ మురిసిపోయింది సూఫియా. పరుగు కోసం ఉద్యోగాన్నే తృణప్రాయంగా వదులుకొని.. ప్రపంచ యాత్రకు సిద్ధపడుతోన్న ఈ పరుగుల రాణి కథేంటో తెలుసుకుందాం రండి..

మనసులో వేరే లక్ష్యమున్నప్పుడు చేసే ఉద్యోగంపై దృష్టి పెట్టలేం. జాబ్‌ వదులుకొనైనా తపనను నెరవేర్చుకునే దిశగా ముందుకు సాగుతాం. సూఫియా ఖాన్‌ చేసింది కూడా ఇదే! ఇష్టంతోనే మొదట ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగంలో చేరినప్పటికీ.. పలు కారణాల రీత్యా కొన్నేళ్లకే దాన్నుంచి బయటికి వచ్చేసింది. అయితే ముందు నుంచీ ఫిట్‌నెస్‌పై మక్కువ చూపే ఆమె.. ఉద్యోగం చేస్తోన్న క్రమంలో దాన్నే కోల్పోతున్నానన్న విషయం గ్రహించింది. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళనల్ని కూడా ఎదుర్కొంది. అయితే ఈ సమస్యల్ని అధిగమించడానికి రోజుకో పావుగంట పాటు పరిగెత్తడం అలవాటు చేసుకుంది సూఫియా.

పరుగే ఊపిరైంది!

ఈ జీవనశైలే తనలోని శారీరక, మానసిక ఒత్తిళ్లను దూరం చేసిందని చెప్పే ఆమె.. ఆ తర్వాత దీన్నే తన కెరీర్‌గా మార్చుకున్నానంటోంది. ‘నా పదహారో ఏటే నాన్న చనిపోయాడు. దాంతో కుటుంబ భారమంతా అమ్మ మీదే పడింది. నేను కూడా అమ్మకు ఎంతో కొంత సాయంగా ఉండాలని చదువు పూర్తికాగానే నాకిష్టమైన ఏవియేషన్‌ రంగంలో చేరాను. అయితే నాకు ముందు నుంచీ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువ. కానీ ఉద్యోగంలో వివిధ షిఫ్టుల్లో పనిచేయాల్సి రావడంతో వాటిపై ప్రతికూల ప్రభావం పడింది. శారీరకంగా ఫిట్‌నెస్‌ని కోల్పోయాను.. మానసికంగా ఒత్తిడి, ఆందోళనల్ని ఎదుర్కొన్నా. అందుకే ఆ తర్వాత కొన్నేళ్లకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. ఆరోగ్యం-ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. ఈ క్రమంలోనే పరుగును నా ఊపిరిగా భావించా. ఈ వ్యాయామమే నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందనిపిస్తోంది..’ అంటోంది సూఫియా.

మూడేళ్ల ప్రయాణంలో..!

పరుగునే తన ఆరోప్రాణంగా భావించిన ఈ మహిళా మారథానర్‌.. 2018లో తన పరుగు ప్రస్థానాన్ని ప్రారంభించింది. అదే ఏడాది మార్చిలో 16 రోజుల్లోనే 720 కిలోమీటర్ల దూరం పరిగెత్తి ‘గోల్డెన్‌ ట్రయాంగిల్‌’ ఫీట్‌ (దిల్లీ, ఆగ్రా, జైపూర్‌లను కలిపే త్రిభుజాకారపు పర్యటక వలయం)ను పూర్తి చేసింది. తద్వారా జాతీయ రికార్డును బద్దలుకొట్టడంతో పాటు ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించిందామె. ఇక గతేడాది మనాలీ నుంచి లేహ్‌ వరకు సుమారు 430 కిలోమీటర్ల దూరాన్ని 6 రోజుల 12 గంటల 10 నిమిషాల్లో పూర్తి చేసి.. ఈ ఘనత సాధించిన తొలి మహిళా అల్ట్రా మారథానర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించిందీ పరుగుల రాణి. ఈ ప్రయాణంలో రాళ్లు-రప్పలు, ఎత్తు-పల్లాలు.. వంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని దాటుకుంటూ ముందుకు సాగానని చెప్పుకొచ్చింది సూఫియా.

‘ఈ ప్రదేశం సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడం వల్ల క్రమంగా ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతాయి. అంతేకాదు.. ఒక్కోసారి ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోవచ్చు కూడా! వీటితో పాటు రాళ్లు-రప్పలు, ఎత్తు-పల్లాలుండే కొండలెక్కుతూ పరుగు సాగించడం సవాలే! ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి శారీరకంగా, మానసికంగా ముందే సన్నద్ధమయ్యా.. కాబట్టే విజయం సాధించా. ఏ పని చేయడానికైనా శరీరాన్ని, మనసును ముందే సన్నద్ధం చేసుకుంటే దాదాపు 80 శాతం పని పూర్తయినట్లే!’ అంటూ తన సక్సెస్‌ సీక్రెట్‌ని పంచుకుందీ రన్నింగ్‌ క్వీన్.

గిన్నిస్‌ బుక్‌లో చోటు!

సూఫియా రన్నింగ్‌ కెరీర్‌లో రెండు గిన్నిస్‌ రికార్డులు కూడా ఉన్నాయి. 2019లో ‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి’ వరకు (సుమారు 4 వేల కిలోమీటర్ల దూరాన్ని) వేగంగా పరిగెత్తిన మహిళా రన్నర్‌గా మొదటి గిన్నిస్‌ రికార్డును తన పేరిట లిఖించుకుంది సూఫియా. ఇక గతేడాది రెండోసారి గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కిందామె. ఇందులో భాగంగా .. ‘Indian Golden Quadrilateral Road’ (ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై.. వంటి నాలుగు ప్రధాన నగరాల్ని కలిపే రహదారి)ని చుట్టేసింది. సుమారు 6002 కిలోమీటర్లు పొడవైన ఈ రహదారిని 110 రోజుల 23 గంటల 24 నిమిషాల్లో పరిగెత్తి.. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మహిళగా గిన్నిస్‌ పుటల్లోకీ ఎక్కింది సూఫియా. అయితే గతేడాదే ఈ అరుదైన ఫీట్‌ పూర్తిచేసిన ఆమె.. తాజాగా దానికి సంబంధించిన రికార్డు పత్రాన్ని అందుకుంది. గిన్నిస్‌ ప్రశంసాపత్రంతో దిగిన ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఆమె.. ‘ఈ రికార్డు అందుకోవడం నాకెంతో గర్వంగా అనిపిస్తోంది.. నా ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు!’ అంటూ తన ఆనందాన్ని అందరితో పంచుకుందీ రన్నింగ్‌ క్వీన్‌. వీటితో పాటు ఎన్నో మారథాన్లు, పరుగు పందేల్లో సైతం పాల్గొని సత్తా చాటుతోంది సూఫియా.

ప్రపంచాన్ని చుట్టేస్తా!

ప్రతి మారథాన్‌ను ఓ స్ఫూర్తిదాయక సందేశంతో మొదలుపెట్టడం సూఫియాకు అలవాటు! ఇలా తను ఎంచుకునే థీమ్‌లు/సందేశాలతో మహిళా ఔత్సాహికుల్లో స్ఫూర్తి నింపుతుంటుందీ పరుగుల రాణి. ‘నేను పాల్గొనే ప్రతి మారథాన్‌/పరుగు పందేల్లో నా భర్త వికాస్‌, నా తల్లి ప్రోత్సాహం ఎంతో ఉంటుంది. వాళ్ల మద్దతుతోనే నేను ఇన్ని విజయాలు సాధించగలిగాను.. ఇక నా ముందున్న లక్ష్యమల్లా.. పరుగుతో ప్రపంచాన్ని చుట్టేయడమే! ప్రస్తుతం అందుకోసమే సన్నద్ధమవుతున్నా..’ అంటోంది సూఫియా.

మరి, ఈ పరుగుల రాణి భవిష్యత్‌ లక్ష్యం నెరవేరాలని మనమూ మనసారా కోరుకుందాం..!

ఆల్‌ ది బెస్ట్‌ సూఫియా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్