Published : 08/02/2022 20:59 IST

IOCL Director: అలా గ్లాస్ సీలింగ్‌ను బద్దలుకొట్టింది..!

(Photo: Twitter)

మహిళలు కేవలం వంటింటికే పరిమితం అనే రోజులు మారుతున్నాయి. స్త్రీలు ఉద్యోగం చేయడమే కాకుండా పలు కంపెనీలకు అధిపతులుగానూ వ్యవహరిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పురుషాధిపత్యంలో ఉన్న పలు సంస్థల్లో గ్లాస్‌సీలింగ్‌ని బద్దలుకొడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇటీవలే ఓఎన్‌జీసీ సంస్థకు అల్కా మిత్తల్ సీఎండీగా, నిన్న జేఎన్‌యూకి శాంతిశ్రీ ధూళిపూడి ఉపకులపతిగా ఎంపికవ్వడమే ఇందుకు నిదర్శనం. దానికి కొనసాగింపుగా దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి మరియు ఇంధన రిటైలర్ సంస్థైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)కి శుక్లా మిస్త్రీ (58) మొదటి మహిళా డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీకోసం...

‘ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్ బోర్డ్‌లో మొదటి మహిళా డైరెక్టర్‌ అయిన శ్రీమతి శుక్లా మిస్త్రీకి ఇండియన్‌ ఆయిల్‌ స్వాగతం పలుకుతోంది. రిఫైనింగ్‌, పెట్రోకెమికల్స్‌లో 35 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన మిస్త్రీ దేశంలోనే అతి పెద్ద రిఫైనరీ సంస్థలో డైరెక్టర్గా (రిఫైనరీస్) బాధ్యతలు చేపట్టారు’ అంటూ ఈ విషయాన్ని ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్ ట్విట్టర్‌లో పంచుకుంది.

* మిస్త్రీ పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బర్న్‌ అనే ప్రాంతంలో ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు.

* ఆమె హౌరాలోని బెంగాల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు.

* ఇంజినీరింగ్ పూర్తైన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివే అవకాశం దక్కించుకున్నారు. కానీ, కుటుంబం, తోబుట్టువుల చదువుల కోసం దానిని త్యాగం చేసి 1986లో IOCLకి చెందిన హల్దియా రిఫైనరీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత 1987లో ఇన్‌స్పెక్షన్‌ ఇంజినీర్‌గా ప్రమోషన్ పొందారు.

* ఆమె ICFAI నుంచి అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్‌ కూడా పూర్తి చేశారు.

* 35 ఏళ్ల అనుభవం కలిగిన మిస్త్రీ ఆ సంస్థలోని పలు రిఫైనరీల్లో 15000 కోట్ల విలువ కలిగిన గ్రీన్‌ఫీల్డ్‌, బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుల బాధ్యతలను తీసుకుని వాటిని సమర్థంగా నిర్వహించారు.

* దాదాపు 60 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థకు ఇంతవరకు ఒక్క మహిళ కూడా డైరెక్టర్‌ కాలేకపోయారు. తాజాగా రిఫైనరీస్‌ విభాగానికి డైరెక్టర్‌గా ఎంపికవ్వడంతో ఈ ఘనత సాధించిన మొదటి మహిళగా మిస్త్రీ నిలిచారు.

* మిస్త్రీ BS-VI రకం ఇంధనాలను, ఇథనాల్‌ మిశ్రిత పెట్రోల్‌ని గడువు కంటే ముందే విడుదల చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పాటుగా దేశంలో ప్రముఖమైన బరౌని (బిహార్‌), హల్దియా (పశ్చిమ బెంగాల్‌), పానిపట్ (న్యూ దిల్లీ), దిగ్‌బోయ్ (అస్సాం) రిఫైనరీలకు కూడా అధిపతిగా వ్యవహరించారు.

* మిస్త్రీ CPCL (చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్), RRPCL (రత్నగిరి రిఫైనరీ, పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌), IHBL సంస్థలకు కూడా డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

* ప్రస్తుత పదవిలో ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్కు సంబంధించిన 9 రిఫైనరీల కార్యకలాపాలను ఆమె పర్యవేక్షిస్తారు.

* మిస్త్రీ 2001లో ఆన్‌సైట్‌ అసైన్‌మెంట్‌లో భాగంగా దుబాయ్‌లోని ఎమిరేట్స్ నేషనల్ ఆయిల్ కంపెనీ (ENOC) రిఫైనరీకి ఇన్‌స్పెక్షన్‌ ఇంజినీర్‌గా వెళ్లారు. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా నిలిచారు.

* శుక్లా మిస్త్రీ తన మూడు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ET ప్రైమ్ ఉమెన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ & ఆపరేషనల్ లీడర్‌షిప్ అవార్డు (2021), స్కోప్‌ అవార్డ్‌ ఫర్‌ అవుట్‌స్టాండింగ్‌ ఉమన్‌ మేనేజర్ (2016-17), పెట్రోటెక్ ఓజస్విని అవార్డు (2016), పెట్రోఫెడ్ బెస్ట్ ఉమన్ ఎగ్జిక్యూటివ్ (2009).. వంటి పురస్కారాలెన్నో ఆమెను వరించాయి. 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని