Updated : 14/02/2022 18:30 IST

సునీతా-కేజ్రీవాల్.. ఈ క్రేజీ లవ్‌స్టోరీ విన్నారా?

(Photos: Twitter)

‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది’ ఉన్నట్లే తన విజయం వెనుక తన భార్య సునీతా కేజ్రీవాల్‌ ఉందని చెబుతుంటారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. ‘ఆమె లేకుంటే అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తికి గుర్తింపే లేదు.. నా భార్యే నా విజయ రహస్యం..’ అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా తన ఇష్టసఖిని ఆకాశానికెత్తేస్తుంటారు.

ఇక సునీత కూడా.. సహధర్మచారిణిగా తన ప్రతి బాధ్యతను నెరవేర్చుతూ, ఎల్లప్పుడూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ నిజమైన అర్ధాంగికి సిసలైన అర్థం చెబుతుంటారు. పార్టీ అధినేతగా, ప్రజా సేవకుడిగా తన భర్త ప్రజలకు సేవ చేస్తుంటే మురిసిపోతుంటారు. ఇక ఇప్పుడు పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయదుందుభి మోగించాలని తన కూతురితో కలిసి ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారామె. ఇలా తన భర్త వేసే ప్రతి అడుగులోనూ అడుగు కలిపే ఆమె.. కేజ్రీని తొలిచూపులోనే ప్రేమించారన్న విషయం మీకు తెలుసా? మరి, ఆ తర్వాత ఏం జరిగింది? ఈ పొలిటికల్‌ కపుల్‌ ముచ్చటైన ప్రేమకథేంటో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

‘తొలి’ పరిచయం అలా..

అరవింద్‌తో తన తొలి పరిచయం ఇప్పటికీ ఒక కలలాగే అనిపిస్తుందంటారు సునీత. ‘1994లో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాక ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌లో(ఐఆర్ఎస్) చేరాను. ఇందులో చేరిన వారికి ముస్సోరిలోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’లో శిక్షణనిస్తారు. అదే సంవత్సరం అరవింద్ కూడా ఐఆర్ఎస్‌లో చేరడం వల్ల ఆయన కూడా శిక్షణ నిమిత్తం అకాడమీకి వచ్చారు. అక్కడే తనని మొదటిసారి చూశాను. అందరిలా కాకుండా అరవింద్ చాలా ప్రత్యేకంగా కనిపించేవారు. ఏ విషయమైనా సూటిగా మాట్లాడేవారు. ముఖ్యంగా.. శిక్షణలో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని ధైర్యసాహసాలతో ఎదుర్కొనేవారు. ఆయన ప్రవర్తన, నడవడిక అన్నీ ఆకట్టుకునే విధంగా ఉండేవి. ఆయనతో జీవితం పంచుకుంటే జీవితాంతం గౌరవ మర్యాదలతో బతగ్గలననే నమ్మకం అప్పుడే నాకు ఏర్పడింది.

మేమిద్దరం పరస్పరం మా భావాలు పంచుకున్నాక మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పాం. మొదట్లో వ్యతిరేకించినా ఆ తర్వాత పెద్దలు మా వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1994 ఆగస్టులో మా ఇద్దరికీ నిశ్చితార్థమైంది. అదే ఏడాది నవంబర్‌లో మా వివాహం జరిగింది. వివాహం తరువాత 1995లో మేము శిక్షణ పూర్తి చేశాం. ఆ తర్వాత మా ఇద్దరు పిల్లలు హర్షిత, పులకిత్ మా జీవితాల్లోకి వచ్చి మా కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తారు’ అంటూ తన లవ్‌స్టోరీ గురించి ఓ సందర్భంలో పంచుకున్నారు సునీత.

నిజాయతీలో లేడీ కేజ్రీవాల్!

2009లో సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన సునీతా కేజ్రీవాల్ తన విధుల్లో నిజాయతీగా ఉంటూ, పారదర్శకతను ప్రదర్శించేవారు. అందుకే అధికారులు ఆమెను ఐఐపీఏ-దిల్లీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రత్యేక శిక్షణకు ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వ పన్నుల శాఖలో, ఆ తర్వాత కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం’ (ఎస్ఎఫ్ఐఓ) లో సైతం పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు సునీత. ఆమె ప్రతిభకు ముచ్చటపడ్డ అధికారులు ఎస్ఎఫ్ఐఓలో ఆమె పదవీకాలాన్ని పొడిగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. అయితే అదే సమయంలో పన్నుల శాఖలో ఉద్యోగుల సంఖ్య తగ్గడంతో సునీతా కేజ్రీవాల్‌కు ప్రత్యేక విధుల అధికారి హోదాను కల్పిస్తూ తిరిగి ఆ శాఖకు మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఏ హోదాలో ఉన్నా, ఎటువంటి బాధ్యతలు అప్పగించినా.. ఇచ్చిన పనిని శ్రద్ధగా, నిజాయతీగా పూర్తి చేయడంలో సునీత మంచి పేరు సంపాదించారు. 2016లో తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ (వాలంటరీ రిటైర్మెంట్‌) చేసిన ఈ లేడీ కేజ్రీవాల్‌.. అప్పటి నుంచి తన భర్తకు పూర్తి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. 2020 ఎన్నికల్లో తన భర్త మూడోసారి దిల్లీ సీఎం పీఠాన్ని అధిష్టించడంలో కీలక పాత్ర పోషించారు సునీత. ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఆమె.. ఇప్పుడు పంజాబ్‌ సీఎం అభ్యర్థి (ఆప్‌ పార్టీ) భగవంత్‌ మన్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆప్‌ను ఎందుకు గెలిపించాలో ఓటర్లకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు.

భర్తకు వెన్నుదన్నుగా..

అరవింద్ కేజ్రీవాల్ 2006లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాల పైన దృష్టి సారించారు. ఆ సమయంలో కుటుంబ పోషణ, అత్తమామల బాధ్యత, పిల్లల చదువు.. వంటి విషయాలు అరవింద్ వరకు వెళ్లకుండా తానే చూసుకునే వారు సునీత. అరవింద్‌కు మధుమేహం ఉన్నందున ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు భోజనం మాత్రం తప్పకుండా ఇంటి నుంచే పంపేవారు. రోజూ రాత్రి డైనింగ్ టేబుల్ వద్ద తన భర్త ప్రస్తావించే రాజకీయ విషయాలను శ్రద్ధగా విని.. ఒక సాధారణ పౌరురాలిగా సలహాలు, సూచనలు అందిస్తుంటారామె. ఇలా ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని సునీతా కేజ్రీవాల్ పరోక్షంగా నిరూపించారు.

‘ఎంత పెద్ద పదవిలో ఉన్నా నేనో భారతీయ మహిళను.. అంతకన్నా ముఖ్యంగా కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చే శ్రీమతిని. నా కుటుంబానికి సంబంధించిన ఏ బాధ్యతనూ నేను విస్మరించను’ అంటారామె. భర్త రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఒక ఉన్నత ఉద్యోగిగా అటు కెరీర్‌ను.. తల్లిగా, కోడలిగా ఇటు కుటుంబాన్ని బాలన్స్‌ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు సునీత.

సింప్లిసిటీకి మారుపేరు!

తన భర్త ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా కూడా నిరాడంబరత, అణకువ, క్రమశిక్షణతో కూడిన జీవితాన్నే కొనసాగిస్తుంటారు సునీత. ఒక భార్యగా, ప్రభుత్వ సేవకురాలిగా, సాధారణ గృహిణిగా తన కర్తవ్యాలను నెరవేర్చుతూ ఇంటినీ, ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి.. స్త్రీ శక్తిసామర్థ్యాలను చాటారు. ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటేనే ఏ పురుషుడైనా లోకాన్ని జయించగలడని ఆమె తన భర్త ద్వారా నిరూపించారు. ‘మన కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్నీ నువ్వే చూసుకున్నావు.. నీ రుణం ఎలా తీర్చుకోగలను’ అంటూ తన శ్రీమతి త్యాగాలను ప్రశంసిస్తుంటారు కేజ్రీ.

ఇంటిని చక్కదిద్దే ఇల్లాలిగా, అరవింద్‌ విజయం వెనకున్న మహిళా శక్తిగా.. ఇలా రెండు రకాలుగా సక్సెస్‌ సాధించి అసలు సిసలైన అర్ధాంగిగా అందరికీ ఆదర్శంగా నిలిచారు సునీత.

బాబాయి కోసం తానూ..!

ప్రస్తుతం పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో తన తల్లితో కూడా పాల్గొంటోంది హర్షితా కేజ్రీవాల్‌. ఐఐటీ దిల్లీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఆమె.. 2020 మేలో తన స్నేహితులతో కలిసి ‘BASIL’ అనే సంస్థను స్థాపించింది. వివిధ రకాల వంటకాల ద్వారా ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను అందరికీ చేరువ చేసే బ్రాండ్‌ ఇది. 2020లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ప్రచారంలో పాల్గొంది హర్షిత. ఇక ఇప్పుడు తన చిన్నాన్న భగవంత్‌ మన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి చూడమంటూ పంజాబ్‌లో ప్రచారం చేస్తోంది. తన తండ్రి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే.. ‘పంజాబ్‌ చిన్నారుల భవిష్యత్తుపై ఆప్‌ ఆందోళన చెందుతోంది.. ఇక్కడి చిన్నారులకు మంచి స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు ఎంతో అవసరం..’ అంటూ పరోక్షంగా తమ పార్టీని గెలిపించాలని కోరుతోందీ యంగ్‌ యాక్టివిస్ట్.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని