IKEA: తొలి మహిళా సారథి!

మహిళలు ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఒంటి చేత్తో కంపెనీల్ని నడిపే స్థాయికి ఎదుగుతున్నారు. దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. తొలి మహిళలుగా కీర్తి గడిస్తున్నారు. సుసానే పుల్వెరర్‌ కూడా తాజాగా ఇలాంటి అరుదైన ఘనతే అందుకుంది. ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా ఇండియాకు తొలి మహిళా సీఈఓగా నియమితురాలైందామె.

Published : 25 Feb 2022 20:14 IST

(Photo: LinkedIn)

మహిళలు ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఒంటి చేత్తో కంపెనీల్ని నడిపే స్థాయికి ఎదుగుతున్నారు. దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. తొలి మహిళలుగా కీర్తి గడిస్తున్నారు. సుసానే పుల్వెరర్‌ కూడా తాజాగా ఇలాంటి అరుదైన ఘనతే అందుకుంది. ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా ఇండియాకు తొలి మహిళా సీఈఓగా నియమితురాలైందామె. ఛీఫ్‌ సస్టెయినబుల్‌ ఆఫీసర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించనుంది. ఈ సరికొత్త బాధ్యతతో ఎంతోమంది రోజువారీ జీవితాలను మరింత మెరుగ్గా మార్చే అద్భుత అవకాశం దొరికిందంటోన్న ఈ కొత్త సీఈఓ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

స్వీడన్‌కు చెందిన ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా గురించి తెలియని వారుండరు. 2018లో ఈ కంపెనీ భారత్‌లో తమ తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో తెరిచింది. ఆ తర్వాత తమ సేవల్ని నవీ ముంబయి, ముంబయి.. వంటి మెట్రో నగరాలకూ విస్తరించింది. అయితే భారత్‌లో తమ కార్యకలాపాలను చూసుకోవడానికి తాజాగా సుసానే పుల్వెరర్‌ను సీఈఓగా నియమించింది ఐకియా ఇండియా. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న పీటర్‌ బెజెల్‌ స్థానంలో ఆమె నియమితులయ్యారు. దీంతో ఈ ఘనత వహించిన తొలి మహిళగా కీర్తి గడించారు సుసానే. అంతేకాదు.. ఛీఫ్ సస్టెయినబుల్‌ ఆఫీసర్‌గానూ ఆమె అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

సంస్థతో పాతికేళ్ల అనుబంధం!

నాయకత్వం, వ్యూహరచన విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన సుసానేకు ఐకియా సంస్థతో పాతికేళ్ల అనుబంధం ఉంది. 1997లోనే ఆమె ఈ కంపెనీలో చేరారు. నెదర్లాండ్స్‌కు చెందిన Ingka Group అనుబంధ సంస్థ అయిన ఐకియాలో వివిధ విభాగాల్లో పనిచేశారు సుసానే. ఈ క్రమంలోనే ఎన్విరాన్‌మెంటల్ మేనేజర్గా ఐకియాతో తన అనుబంధాన్ని ఆరంభించిన సుసానే.. 2011-16 వరకు స్వీడన్‌ శాఖలో కంపెనీ కమ్యూనికేషన్స్‌ ఎండీగా పనిచేశారు. ఆపై 2017-19 వరకు బెంగళూరులో.. ఐకియా ఇండియా స్థానిక కమ్యూనిటీ లీడర్‌గా సేవలందించారు. ఇక ఆ తర్వాత నెదర్లాండ్స్‌ వెళ్లిపోయిన ఆమె.. Ingka Group బిజినెస్‌ రిస్క్, కంప్లయెన్స్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఈ సంస్థ (ఐకియా ఇండియా)కు సీఈఓగా, సీఎస్‌ఓగా సరికొత్త బాధ్యతలు అందుకున్న ఆమె.. తన విధుల రీత్యా మరోసారి భారత్‌లో కాలుమోపనున్నారు. ఇలా ఈ సంస్థ భారత శాఖ కార్యకలాపాల్లో భాగం పంచుకోవడం ఆమెకిది మూడోసారి.

అదే లక్ష్యంతో ముందుకు సాగుతా!

‘గతంలోనూ భారత్‌లో పనిచేసిన అనుభవం నాకుంది. ఈసారీ ఈ సరికొత్త బాధ్యతను అందుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నా. Ingka గ్రూప్‌ కూడా తమ విపణిని విస్తరించడానికి భారతే సరైన వేదిక అని భావిస్తోంది. ఆరంభం నుంచి ఇప్పటిదాకా కంపెనీ లక్ష్యం ఒక్కటే.. తాము తయారుచేసే ప్రతి వస్తువు/ఉత్పత్తిని తిరిగి ఉపయోగించుకునే లేదా రీసైక్లింగ్‌ చేసుకునే విధంగా రూపొందించాలని! నేటికీ ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తోంది కూడా! తద్వారా ఎంతోమంది రోజువారీ జీవితాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో కంపెనీ ఈ సరికొత్త బాధ్యతను నాకు అప్పగించడం చాలా సంతోషంగా ఉంది..’ అంటూ చెప్పుకొచ్చారు సుసానే. ఇప్పటికే హైదరాబాద్‌, ముంబయిల్లో ఐకియా స్టోర్లు తెరుచుకోగా.. సుసానే ఆధ్వర్యంలో త్వరలోనే బెంగళూరులోనూ మరో స్టోర్‌ని ప్రారంభించే యోచనలో ఉందీ సంస్థ. మరోవైపు.. ముంబయి, హైదరాబాద్‌తో పాటు పుణే, గుజరాత్‌, బెంగళూరులో ఆన్‌లైన్‌ వేదికగా తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తోందీ సంస్థ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని