నిండు గర్భంతోనే కర్రసాము విన్యాసాలు..!

గర్భిణిగా ఉన్నప్పుడు చిన్న చిన్న బరువులెత్తడానికే ఇబ్బంది పడిపోతుంటాం.. ఇక నెలలు నిండే కొద్దీ ఆయాసంతో కాలు కూడా కదపలేం. కానీ కొంతమంది ఈ సమయంలోనూ కఠిన వ్యాయామాలు చేస్తూ, బరువులెత్తుతూ, వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. తమిళనాడులోని అనైక్కడు గ్రామానికి చెందిన షీలాదాస్‌ ఇందుకు తాజా....

Updated : 12 Mar 2022 20:23 IST

గర్భిణిగా ఉన్నప్పుడు చిన్న చిన్న బరువులెత్తడానికే ఇబ్బంది పడిపోతుంటాం.. ఇక నెలలు నిండే కొద్దీ ఆయాసంతో కాలు కూడా కదపలేం. కానీ కొంతమంది ఈ సమయంలోనూ కఠిన వ్యాయామాలు చేస్తూ, బరువులెత్తుతూ, వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. తమిళనాడులోని అనైక్కడు గ్రామానికి చెందిన షీలాదాస్‌ ఇందుకు తాజా ఉదాహరణ. తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన ఆమె.. ఆరుగంటల పాటు విడవకుండా కర్రసాము విన్యాసాలు చేసింది. తద్వారా ‘నోబెల్ వరల్డ్‌ రికార్డ్స్‌’లో తన పేరును నమోదు చేసుకుంది. మరి, రేపో మాపో ప్రసవానికి సిద్ధంగా ఉన్న ఆమెకు అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? రండి.. తెలుసుకుందాం..!

షీలాదాస్‌కు చిన్నతనం నుంచే ఆటలంటే ఆసక్తి. ఈ ఇష్టంతోనే కర్రసాము, బాక్సింగ్‌, కరాఠే.. వంటి విద్యలు నేర్చుకుందామె. స్కూల్లో చదువుకుంటోన్న క్రమంలోనే వివిధ పోటీల్లో పాల్గొని బోలెడన్ని బహుమతులు గెలుచుకుంది. ఇక పెళ్లయ్యాకా తన భర్త ప్రోత్సాహంతో ఈ మార్షల్‌ ఆర్ట్స్‌ని కొనసాగించింది షీల.

‘రికార్డు’ విన్యాసాలు!

కరాటేలో బ్లాక్‌ బ్యాడ్జ్‌ సంపాదించిన షీల.. ప్రస్తుతం ఈ యుద్ధకళల్లో ఔత్సాహికులకు శిక్షణ ఇస్తోంది. గతంలో నిర్వహించిన ఓ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలో భాగంగా ‘ఐరన్‌ ఉమన్‌’ టైటిల్‌తో పాటు జాతీయ రికార్డునూ తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన షీల.. ఇటీవలే ‘అనైక్కడు సిలంబం అసోసియేషన్‌’ వారు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈ వేదికగా ఆరు గంటల పాటు విడవకుండా కర్రసాము విన్యాసాలు చేసింది. తొలుత మూడు గంటలు ఒక కర్రతో, మరో మూడు గంటలు రెండు కర్రలతో విన్యాసాలు ప్రదర్శించి అందరినీ ఔరా అనిపించింది. ఇలా ఆమె కర్రసాముకు ముగ్ధులైన ‘నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ వారు ఆమెకు బహుమతితో పాటు సంబంధిత ధ్రువపత్రాన్ని అందజేశారు.

మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చా!

నిజానికి నిండు గర్భంతో ఇలాంటి సాహస కృత్యాలు చేయడమంటే మాటలు కాదు. అయితే తనకు చిన్నతనం నుంచి ఈ యుద్ధ కళలపై మక్కువ, సాధన ఉండడం వల్లే ఒకరకంగా ఇది సాధ్యమైందంటోంది షీల. ‘ఏడేళ్లున్నప్పట్నుంచే నాకు మార్షల్‌ ఆర్ట్స్‌పై మక్కువ ఏర్పడింది. అందుకే వీటిపై పట్టు సాధించా. ఆ తర్వాత పలు పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా గెలుచుకున్నా. అయితే గర్భిణిగా ఉన్నప్పుడు నా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికీ అధిక ప్రాధాన్యమిచ్చా. ఈ యుద్ధ విద్యల వల్ల అది సాధ్యమైంది. మానసికంగా దృఢంగా ఉండడం వల్ల ఇప్పుడీ రికార్డు సొంతమైంది.. అయితే ఈ పోటీలో పాల్గొనడానికి ముందే నిపుణులతో సంబంధిత పరీక్షలన్నీ చేయించుకున్నా.. వారి అంగీకారం మేరకే నిర్విరామంగా, ఎలాంటి అంతరాయం లేకుండా ఫీట్‌ పూర్తిచేయగలిగా..’ అంటూ చెప్పుకొచ్చింది షీల. ఇలా తన విన్యాసాలతో.. గర్భం ధరించడానికి, మనం చేసే పనులకు సంబంధం లేదని; ప్రెగ్నెన్సీ అనారోగ్యం కాదని నిరూపించింది.

అయితే తనకు ముందు నుంచీ ఆయా యుద్ధ కళల్లో పట్టుంది కాబట్టే నిండు గర్భంతోనూ ఈ అరుదైన ఫీట్‌ చేయగలిగింది.. కాబట్టి సంబంధిత అంశంలో ప్రావీణ్యంతో పాటు, నిపుణుల అనుమతి లేకుండా గర్భిణులు ఇలాంటి పోటీల్లో పాల్గొనడం/కఠినమైన వ్యాయామాలు సాధన చేయడం మంచిది కాదన్నది గుర్తుపెట్టుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్