ఇవి వాడితే.. ఆ కళ్లను అలా చూస్తూ ఉండాల్సిందే
close
Published : 04/02/2022 20:33 IST

ఇవి వాడితే.. ఆ కళ్లను అలా చూస్తూ ఉండాల్సిందే!

ముఖ సౌందర్యంలో కళ్ల పాత్ర తక్కువేం కాదు. చూడగానే ఆకట్టుకునేవి కళ్లే అయితే ఈ క్రమంలో ముఖానికి వేసుకునే మేకప్‌ ఓ ఎత్తైతే.. కళ్లకు వేసుకునే మేకప్‌ మరో ఎత్తు. ఐ-మేకప్‌ని అందంగా తీర్చిదిద్దగలిగితే.. సాధారణ మేకప్‌ కూడా హైలైట్‌ అవుతుందనడంలో సందేహం లేదు. కానీ ఎవరికి వారు స్వయంగా కళ్లకు అంత చక్కగా మేకప్‌ చేసుకోవాలంటే అదంత ఈజీ కాదు. అందుకే చాలామంది బ్యూటీపార్లర్లలోనో లేదా డిఫరెంట్‌ గ్యాడ్జెట్స్‌ని ఉపయోగించో కళ్లకు మేకప్‌ చేసుకుంటారు. ఎంత చక్కగా మేకప్‌ వేసుకున్నా ఒక్కోసారి వాతావరణం వల్లో.. మన అజాగ్రత్త వల్లో చెరిగిపోతుంటుంది. కళ్ల మేకప్‌ చెరిగిపోతే.. ఇక మన లుక్‌ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకుని కళ్లకు మేకప్‌ వేసుకుకోకుండానే అలాంటి లుక్కిచ్చే గ్యాడ్జెట్స్‌ని డిజైన్‌ చేశారు. మరి కళ్ల అందాన్ని ఇనుమడింపజేసే వీటి గురించి తెలుసుకుందామా..

ఐ-లైనర్‌ స్టిక్కర్స్..

కాలేజీ అమ్మాయిల నుండి ఆఫీస్‌కు వెళ్లే యువతుల వరకు ఐ-లైనర్‌ పెట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది. కానీ హడావిడిగా ఉన్న సమయంలో లేదా పార్టీకి వెళ్లాలనుకునే సమయంలో సరిగా పెట్టుకోలేకపోవడం.. మధ్యలో చెరిగిపోతుందేమో అన్న సందేహం ఉండడం కామనే. ఇక నుండి ఇటువంటి సమస్యలేవీ ఎదుర్కోవలసిన పనిలేకుండా ఐ-లైనర్‌ పెట్టుకోకపోయినా.. పెట్టుకున్నట్లుగా లుక్కిచ్చే ‘ఐ-లైనర్‌ స్టిక్కర్స్‌’ మార్కెట్లో లభిస్తున్నాయి. చిత్రంలో చూపించిన విధంగా అచ్చం ఐ-లైనర్‌లా ఉంటాయివి. వీటి వెనకాల భాగంలోని స్టిక్కర్‌ని తొలగించి కంటి పై భాగంలో అచ్చం ఐ-లైనర్‌ పెట్టుకునే విధంగా అతికించుకుంటే సరిపోతుంది. ఇందులో వివిధ రకాల డిజైన్స్‌ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఐ-లైనర్‌ కాకుండా కేవలం వింగ్‌ మాత్రమే కావాలనుకుంటే అలాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. వింగ్‌లో చాలా రకాల డిజైన్స్‌ లభిస్తున్నాయి. ప్లెయిన్‌గా ఉండడం నుంచి పువ్వులు, బొమ్మలు లాంటివి కూడా ఉన్నాయి.


ఫాల్స్‌ ఐబ్రోస్..

ఫాల్స్‌ లాషెస్‌ గురించి మీరు వినే ఉంటారు. కనురెప్పలు ఒత్తుగా కనిపించడానికి ఉపయోగిస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. కనురెప్పలతో పాటు.. కొంతమందికి కనుబొమ్మలు కూడా చాలా పలుచగా ఉంటాయి. అవి ఒత్తుగా కనిపించడానికి చాలామంది కాటుక, ఐ-బ్రో పెన్సిల్‌ లాంటివి వాడుతుంటారు. కానీ అవి అందరికీ నప్పవు. అంతేకాదు.. ఒక్కోసారి కాస్త ఎబ్బెట్టుగా కూడా కనిపిస్తాయి. అందుకోసమే ఫాల్స్‌ లాషెస్‌ లాగానే ‘ఫాల్స్‌ ఐబ్రోస్‌’ కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకొచ్చాయి. ఈ ఫాల్స్‌ ఐబ్రోస్‌ వెనకభాగంలోని స్టిక్కర్‌ని తొలగించి మీ కనుబొమ్మలు కనిపించకుండా అతికించుకోవాలి. దానిపై ఐ-బ్రో పెన్సిల్‌ లాంటివి కూడా వాడవచ్చు. వీటిని మళ్లీ మళ్లీ కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిని ఎంపిక చేసుకునేటప్పుడు ఐ-బ్రో షేప్‌ని బట్టి ఎంచుకోవాలి.


ఐ-షాడో స్టిక్కర్స్..

ఐ-లైనర్‌ తర్వాత అందరూ దృష్టి పెట్టేది ఐ-షాడో మేకప్‌ పైనే.. సింగిల్‌ కలర్‌ అయితే ఎలాగో కష్టపడి వేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం మల్టీకలర్‌, రెయిన్‌ బో కలర్‌.. అంటూ వివిధ రకాల ఐ-షాడో మేకప్స్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వేసుకోవడానికి మనమెంత పర్‌ఫెక్ట్‌ పద్ధతిని పాటించినా అంత ఈజీగా సాధ్యం కాదు.. పైగా దీనివల్ల వేసుకున్న మేకప్‌ చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకోసం ఐ-లిడ్స్‌కి కలరింగ్‌ ఇచ్చే ‘ఐ-షాడో స్టిక్కర్స్‌’ని ఉపయోగిస్తే.. ఇంట్లోనే పార్లర్‌ స్టైల్‌ మేకప్‌తో సిద్ధమవ్వచ్చు. చిత్రంలో చూపించిన విధంగా వివిధ రంగులు అద్దిన స్టిక్కర్స్‌ ఉంటాయి. వీటిని కళ్లపై పెట్టుకుని మెత్తగా ప్రెస్‌ చేసి తొలగిస్తే సరి. టెంపరరీ టాటూలా ప్రింట్‌ పడుతుంది. తొలగించాలనుకున్నప్పుడు కొబ్బరి నూనె లేదా మేకప్‌ రిమూవర్‌ని ఉపయోగించి ఈజీగా తొలగించవచ్చు.


బ్రైడల్‌ ఫోర్‌హెడ్ బిందీ..

పెళ్లి సమయంలో ‘కళ్యాణ తిలకం’ అంటూ బొట్టును చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. పూర్వకాలంలో వివిధ రంగుల తిలకాలను ఉపయోగించి కళ్యాణ తిలకం పెట్టేవారు. ప్రస్తుతం తిలకంతో పనిలేకుండా.. నేరుగా స్టిక్కర్‌లా పెట్టుకునే విధంగా డిజైన్‌ చేశారు. చిత్రంలో చూపించిన విధంగా నుదుటి మధ్య పెట్టుకునే బొట్టుతో పాటు.. కనుబొమ్మలపై పెట్టుకునే స్టిక్కర్స్‌తో కలిపి అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో వివిధ రంగులు కూడా లభిస్తాయి. సంప్రదాయాన్ని బట్టి డిజైన్‌, రంగులను ఎంచుకోవచ్చు. మామూలుగా పెట్టుకునే బొట్టు లాగానే.. వీటికి కూడా వెనక భాగంలో ఉన్న స్టిక్కర్స్‌ని తొలగించి అతికించుకుంటే సరి. ఇవే కాకుండా పార్టీలకు వెళ్లాలనుకునే వారు కళ్ల చుట్టూ వివిధ డిజైన్స్‌ని పెట్టుకునే విధంగా కూడా అందుబాటులో ఉన్నాయి.


ఐ-బ్రో స్టాంప్..

కొందరికి ఐ-బ్రోస్‌ చాలా పలుచగా ఉండడం సహజం. ఫాల్స్‌ ఐ-బ్రోస్‌ లాంటివి అందుబాటులో ఉన్నా కూడా.. నేచురల్‌ లుక్‌కే మా ఓటు అంటారు కొందరు. అలాంటి వారి కోసమే ఈ ‘ఐ-బ్రో స్టాంప్‌’ని డిజైన్‌ చేశారు. చిత్రంలో చూపించిన విధంగా అచ్చం ఐ-బ్రో ఆకారంలో ఉంటుందీ స్టాంప్‌. దీన్ని మనం వాడే ఐ-బ్రో పౌడర్‌పై ఉంచి.. ఆపై ఐ-బ్రో పైన అచ్చు వేసినట్లు వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకున్న తర్వాత బ్రష్‌ని ఉపయోగించి సరిచేసుకోవాలి. ఇందులో ముద్రకి పౌడర్‌ని ఉపయోగించడం వల్ల ఐ-బ్రోపై వేసిన ముద్ర నేచురల్‌ లుక్‌ని సంతరించుకుంటుంది. ఇలా పలుచగా ఉన్న ఐ-బ్రోస్‌ని సహజంగానే ఒత్తుగా కనిపించే విధంగా మార్చుకోవచ్చు.


Advertisement

మరిన్ని