అందుకే ఈ గొంతుకు అంత క్రేజ్!

‘మాణికే మాగే హితే’... ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోన్న పాట. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్, యూట్యూబ్‌ షార్ట్స్‌...ఇలా ఎక్కడ చూసినా ఈ పాట అనుకరణలు, కవర్‌ సాంగ్‌లే దర్శనమిస్తున్నాయి. పాటలోని లిరిక్స్, భావం అసలేం అర్థం కాకపోయినా ఒక అమ్మాయి హస్కీ వాయిస్‌ మాత్రం మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది.

Updated : 06 Sep 2021 17:41 IST

(Photo: Screengrab)

‘మాణికే మాగే హితే’... ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోన్న పాట. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్, యూట్యూబ్‌ షార్ట్స్‌...ఇలా ఎక్కడ చూసినా ఈ పాట అనుకరణలు, కవర్‌ సాంగ్‌లే దర్శనమిస్తున్నాయి. పాటలోని లిరిక్స్, భావం అసలేం అర్థం కాకపోయినా ఒక అమ్మాయి హస్కీ వాయిస్‌ మాత్రం మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది. ఇలా తన శ్రావ్యమైన గొంతుతో అలరిస్తోన్న ఆ గాయని పేరు యొహానీ డిలోకా డిసిల్వా.

శ్రీలంక టు ఇండియా!

‘మాణికే మాగే హితే’ పాటను యొహానీ సింహళ భాషలో పాడింది.  అందుకే ఆ పాట అందరికీ అర్థం కాదు. కానీ యొహానీ గొంతు, పాటలో ఆమె పలికించిన ఎక్స్‌ప్రెషన్స్ కారణంగా దేశ సరిహద్దులు దాటి ఆదరణ దక్కించుకుంటోందీ పాట. యూట్యూబ్‌లో ఇప్పటివరకు 9 కోట్ల మందికి పైగా ఈ పాటను వీక్షించారంటే దీనికున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియాలో అయితే ఈ పాట మార్మోగిపోతోంది. హిందీ, తమిళ, పంజాబీ, మలయాళ సంగీత కళాకారులు తమ భాషల్లోకి రీమిక్స్‌ చేసి మరీ ఈ పాటను ఆస్వాదిస్తున్నారు. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ పాటకు ఫిదా అయ్యారు. ఇందులో భాగంగా తన సినిమాలోని ఓ పాటను ఈ సాంగ్‌తో మిక్స్ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

శ్రీలంక ‘ర్యాప్‌ ప్రిన్సెస్’గా!

ఇలా ఒకే ఒక్క పాటతో ఇంటర్నేషనల్‌ స్టార్‌గా మారిపోయింది 28 ఏళ్ల యొహానీ. శ్రీలంక రాజధాని కొలంబో ఆమె స్వస్థలం. తండ్రి ప్రసన్న డిసిల్వా ఆర్మీలో మేజర్‌ జనరల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. తల్లి దినితి డిసిల్వా శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. యొహానీకి షవింద్రి అని ఓ చెల్లి కూడా ఉంది. తండ్రి ఉద్యోగం కారణంగా చిన్నప్పుడే శ్రీలంకలోని పలు ప్రాంతాలను చుట్టేసింది యొహానీ. అదే సమయంలో సంగీతంపై ఆసక్తి పెంచుకుంది. తల్లి కూడా తనను ప్రోత్సహించడంతో అందులోనే తన జీవితాన్ని వెతుక్కుంది. మొదట యూట్యూబర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ‘దేవియాంగే బేర్‌’ అనే ర్యాప్‌ సాంగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇవే కాదు...తను పాడిన కవర్‌ సాంగ్స్‌ కూడా జనాల్లోకి బాగా వెళ్లాయి. ఈ క్రమంలోనే శ్రీలంక ‘ర్యాప్‌ ప్రిన్సెస్‌’ అని ఆమెకు బిరుదు కూడా ఇచ్చారు.

బహుముఖ ప్రతిభాశాలి!

యొహానీ పాడిన పాటలకు అభినందనలతో పాటు పలు అవార్డులు, పురస్కారాలు వస్తున్నాయి. యొహానీ సాంగ్స్‌లో ఒకటి రాయగమ్‌ సోమ్‌ అవార్డు వేడుకలో ‘ఉత్తమ వీడియో రీమేక్‌’ పురస్కారం కూడా గెల్చుకోవడం విశేషం. ఇక గతేడాది తన ‘ఆయే’ పాటతో మరోసారి తన గాన ప్రతిభను ప్రపంచానికి చాటిందీ సింగింగ్‌ సెన్సేషన్‌. ఈ పాట తన సొంత స్టూడియోలో, తన నిర్మాణ సారథ్యంలో రూపు దిద్దుకోవడం విశేషం. ఇక ఈ ఏడాది విడుదలైన ‘మాణికే మాగే హితే’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తోందో గమనిస్తూనే ఉన్నాం. ప్రస్తుతం సింహళ భాషలో 12 పాటలతో ఓ ఆల్బమ్‌ రూపొందించే పనిలో ఉందీ యువ గాయని. ఈ ఏడాది చివరలో లైవ్‌ కన్సర్ట్‌ను ఏర్పాటుచేసి ఈ ఆల్బమ్‌ను విడుదల చేయనుంది.

యొహానీ గురించి మరికొన్ని!

* యొహానీ కేవలం సింగరే కాదు.. పాటలు రాయగలదు, మంచి ర్యాపర్‌, మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌, బిజినెస్‌ వుమన్‌ కూడా.

* సంగీతంపై ప్రేమతో చదువును నిర్లక్ష్యం చేయలేదీ యువ గాయని. కొలంబోలోని జనరల్‌ సర్‌ జాన్‌ కొటేలావాలా డిఫెన్స్ యూనివర్సిటీలో లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ అకౌంటింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా యూనివర్సిటీ నుంచి అకౌంటింగ్‌లో మాస్టర్స్ పట్టా అందుకుంది.

* యొహానీ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలకు మిలియన్లలో వ్యూస్‌ వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె యూట్యూబ్‌ ఛానల్‌కు 1.97 మిలియన్ల మందికి పైగా సబ్స్ర్కైబర్లు ఉన్నారు.

* శ్రీలంకలో ఒక మిలియన్‌కు పైగా సబ్స్ర్కైబర్లు ఉన్న ఏకైక మహిళా గాయని యొహానీనే కావడం విశేషం.

* సింగిల్ గానే కాదు...పలువురు ప్రముఖ గాయకులతో కూడా కలిసి గొంతు కలుపుతోందీ సింగింగ్‌ సెన్సేషన్‌. వీటికి కూడా మిలియన్లకు పైగా వ్యూస్‌ వస్తున్నాయి.

* యొహానీకి చిన్నప్పుడు సంగీతంతో పాటు స్పోర్ట్స్‌పై కూడా ఆసక్తి ఉండేదట. స్విమ్మింగ్, వాటర్‌ పోలో ఆమెకు ఇష్టమైన క్రీడలు.

* అలరించే గొంతుతో పాటు ఆకట్టుకునే అందం యొహానీ సొంతం. అందుకే పలు సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోందీ యంగ్‌ సెన్సేషన్.

* ఇక యొహానీ సోదరి షవింద్రి ప్రస్తుతం మెడిసిన్‌ చేస్తోంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్