Alia-Ranbir Wedding : ఆలియా చీరకట్టు వెనుక ఆమె!

తమ పెళ్లికి ఖరీదైన చీరలు, లెహెంగాలు ఎంచుకోవడమే కాదు.. వాటిని కట్టే విధానంలోనూ వైవిధ్యం చూపించడానికి ఆరాటపడుతున్నారు ఈతరం అమ్మాయిలు. కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తన ఫ్యాషన్‌ సెన్స్‌ని, భారతీయ సంప్రదాయాన్ని రంగరించి తాను ఎంచుకున్న బ్రైడల్‌ చీరలో ఏంజెల్‌లా.....

Updated : 14 Dec 2022 11:03 IST

(Photos: Instagram)

తమ పెళ్లికి ఖరీదైన చీరలు, లెహెంగాలు ఎంచుకోవడమే కాదు.. వాటిని కట్టే విధానంలోనూ వైవిధ్యం చూపించడానికి ఆరాటపడుతున్నారు ఈతరం అమ్మాయిలు. కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తన ఫ్యాషన్‌ సెన్స్‌ని, భారతీయ సంప్రదాయాన్ని రంగరించి తాను ఎంచుకున్న బ్రైడల్‌ చీరలో ఏంజెల్‌లా మెరిసిపోయిందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఆమె చీరకట్టిన విధానం తన క్యూట్‌నెస్‌ని మరింతగా పెంచిందని ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. మరి, తన బ్రైడల్‌ శారీని అంత వైవిధ్యంగా, స్టైలిష్‌గా కట్టింది ఎవరో తెలుసా? సెలబ్రిటీ శారీ డ్రేప్‌ ఆర్టిస్ట్‌ డాలీ జైన్‌. చీర/దుపట్టాను విభిన్న రకాలుగా అలంకరించడంలో ఆమె దిట్ట. అందుకే సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా తమ వివాహాల్లో డాలీ ఉంటే చాలంటారు చాలామంది. నిజానికి ఒక సాధారణ గృహిణి అయిన ఆమె.. సెలబ్రిటీ ఆర్టిస్ట్‌గా ఎలా ఎదిగింది? చీరకట్టుకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఎలా మారింది? రండి.. తెలుసుకుందాం..!

ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లు.. తన డ్రీమ్‌ వెడ్డింగ్‌ కోసం ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి రూపొందించిన ఐవరీ కలర్‌ హెవీ ఎంబ్రాయిడరీ ఆర్గంజా చీరలో తళుక్కుమంది ఆలియా. దీనికి చేత్తో రూపొందించిన టిష్యూ వెయిల్‌ను జతచేసింది. అంతేకాదు.. చీర కొంగును కుడి చేతి చివర టై చేసి మరింత స్టైలిష్‌గా మెరిసిపోయిందీ చక్కనమ్మ. ఇలా ఆమె చీరకట్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

సెలబ్రిటీల వివాహాల్లో ఆమె ఉండాల్సిందే!

నిజానికి ఇలా స్టైలిష్‌ చీరకట్టులో ఆలియాను అలంకరించింది ప్రముఖ సెలబ్రిటీ శారీ డ్రేప్‌ ఆర్టిస్ట్‌ డాలీ జైన్‌. కోల్‌కతాకు చెందిన ఆమె.. సెలబ్రిటీ పెళ్లిళ్లలో వధువులకు, ఇతర కుటుంబ సభ్యులకు వైవిధ్యంగా చీరను, దుపట్టాను అలంకరించడంలో దిట్ట. తాజా వివాహంలో ఆలియాకే కాదు.. ఆమె అత్తగారు నీతూ కపూర్‌కీ దుపట్టాను స్టైలిష్‌గా డ్రేప్‌ చేశారామె. ఇక గతంలో అంబానీ ఇంట్లో వివాహాలకు, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, సోనమ్‌ కపూర్‌ పెళ్లిళ్లలో వధువులకు అందంగా చీరను/లెహెంగాలను అలంకరించి ఆకట్టుకున్నారు. ఇతర కార్యక్రమాల్లోనూ సెలబ్రిటీలకు చీరల్ని స్టైలిష్‌గా కడుతుంటారామె. అంతెందుకు.. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ఓ సందర్భంలో కాంజీవరం చీరను నీట్‌గా, అందంగా కట్టి ఆమె మనసు దోచుకున్నారు. మరో సందర్భంలో అతిలోక సుందరి శ్రీదేవిని బెంగాలీ స్టైల్‌ చీరకట్టులో అందంగా ముస్తాబు చేసి తనదైన మార్క్‌ను ప్రదర్శించారు. ఇలా చెప్పుకుంటూ పోతే డాలీ సెలబ్రిటీ క్లైంట్స్‌ లిస్ట్‌ చాలా పెద్దదే అని చెప్పచ్చు.

తనలోని తపన తెలుసుకొని..!

ఒక్కోసారి మనలో నిగూఢమైన నైపుణ్యాలు ఇతరులు గ్రహించి చెప్తే తప్ప మనకు తెలియవు. డాలీ విషయంలోనూ ఇదే జరిగింది. ఒకానొక దశలో ఓ సాధారణ గృహిణిగా జీవనం సాగిస్తోన్న ఆమె.. సందర్భాన్ని బట్టి తన వైవిధ్యమైన చీరకట్టుతో అందరినీ ఆకట్టుకునేది. ‘చీరకట్టు భలే స్టైలిష్‌గా ఉందే..!’ అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మన్ననలందుకునేది. దీంతో వాళ్లు కూడా తమ ఇళ్లలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు డాలీతోనే చీర కట్టించుకునేవారు. అలా ఆమె చీరకట్టు నైపుణ్యాలు ఆనోటా, ఈనోటా పాకి డిజైనర్‌ ద్వయం అబుజానీ సందీప్‌ ఖోస్లాను చేరాయి. ఆపై వారి ప్రోత్సాహంతోనే చీరకట్టును పూర్తిస్థాయి కెరీర్‌గా మార్చుకున్నానని చెబుతున్నారు డాలీ.

‘ఓ పెళ్లిలో వధువుకు అబుజానీ సందీప్‌ ఖోస్లా డిజైన్‌ చేసిన భారీ దుపట్టాను నాకొచ్చిన స్టైల్‌లో విభిన్నంగా అలంకరించా. అది ఆ డిజైనర్‌ ద్వయానికి చాలా నచ్చింది. ఆ తర్వాత వాళ్లే నన్ను సెలబ్రిటీ పెళ్లిళ్లకు సిఫార్సు చేయడం మొదలుపెట్టారు. అలా ఒక్కో అవకాశం తలుపు తట్టడం ప్రారంభమైంది. ఇక మరో సందర్భంలో శ్రీదేవికి బెంగాలీ చీరను అక్కడి సంప్రదాయ స్టైల్‌లో అలంకరించి ఆమె ప్రశంసలందుకున్నా. ఈ ప్రోత్సాహమే నన్ను పూర్తిస్థాయి చీరకట్టు నిపుణురాలిగా మారేలా చేసింది..’ అంటారు డాలీ.

అదో అద్భుతమైన కళ!

దాదాపు 19 ఏళ్ల నుంచి శారీ డ్రేప్‌ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోన్న డాలీ.. చీరకట్టు విషయంలో తన నైపుణ్యాలతో పాటు అమ్మాయిల అభిరుచులకూ ప్రాధాన్యమిస్తానంటున్నారు. ‘చీరకట్టు మన సంప్రదాయం. దాన్ని విభిన్న రకాలుగా అలంకరించుకోవడం ఓ కళ. చీరకట్టు విషయంలో నా సహాయం తీసుకున్న ప్రతి అమ్మాయీ నా వద్ద నుంచి మెలకువలు నేర్చుకోవడానికి ఆరాటపడుతుంది. అయితే చీరకట్టు పర్‌ఫెక్ట్‌గా రావడంలో శరీరాకృతి, దుస్తుల మెటీరియల్‌.. వంటివీ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే ఒక్కొక్కరికీ ఒక్కోలా చీరను అలంకరించుకోవాలన్న తాపత్రయం ఉంటుంది.. పైగా ఆ స్టైల్‌ వారికి నప్పేలా అలంకరించడం, అమ్మాయిల అభిరుచులకు ప్రాధాన్యమివ్వడం.. వంటి విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెడతా. తద్వారా వాళ్లూ సంతోషపడతారు.. నాకూ పనిలో సంతృప్తి దొరుకుతుంది..’ అంటున్నారీ శారీ డ్రేపర్‌.

నిత్య విద్యార్థిని!

చీరకట్టులో ఎంత పర్‌ఫెక్ట్‌ అయినా రోజూ ఉదయం లేవగానే ఓసారి సాధన చేయనిదే ఏ పనీ మొదలుపెట్టనంటున్నారు డాలీ. ‘నేను రోజూ ఉదయం లేవగానే చేసే మొదటి పని.. మ్యానికిన్‌కి విభిన్న రకాలుగా చీరకడుతూ సాధన చేయడం. ఇలా నిత్య విద్యార్థిగా ఉండడం వల్ల నా నైపుణ్యాల్ని మరింతగా పెంచుకోవచ్చు.. కొత్త స్టైల్స్‌ని కనుక్కోవచ్చు. ఏ తరహా చీరకట్టైనా సరే కేవలం 18.5 సెకన్లలో తీర్చిదిద్దడం నాకు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాదు.. 365 రకాలుగా చీర కట్టుకోవడం గురించి ఓ పుస్తకం కూడా రాశాను. అంటే.. సంవత్సరంలో రోజుకో స్టైల్‌ చొప్పున కట్టుకొని మెరిసిపోవచ్చన్నమాట!’ అంటూ తన పనితనం గురించి ఓ సందర్భంలో పంచుకున్నారు డాలీ. ఇక తన శారీ స్టైలింగ్‌తో రెండుసార్లు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటుదక్కించుకున్నారామె. తొలుత 125 రకాలుగా చీరను కట్టి, ఆపై మరోసారి 325 రకాలుగా శారీ డ్రేప్‌ చేసి.. తన రికార్డును తానే తిరగ రాసుకున్నారీ శారీ లవర్‌.

మనలోని తపనేంటో తెలుసుకొని దాన్నే కెరీర్‌గా మార్చుకుంటే.. ఇక మనకు తిరుగుండదని తన ప్రతిభతో నిరూపిస్తున్నారు డాలీ. ప్రస్తుతం శారీ డ్రేప్‌ స్టైలిస్ట్‌గానే కాదు.. దీనికి సంబంధించిన మెలకువల్ని ఔత్సాహిక మహిళలకు నేర్పుతూ వారినీ ఇందులో నిపుణులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ క్లాసులు నిర్వహించడంతో పాటు తన శారీ డ్రేపింగ్‌ స్టైల్స్‌కి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు డాలీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్