Couple Equality: భార్య కాళ్లు మొక్కుతాం.. తాళీ కట్టించుకుంటాం!
కొన్ని పెళ్లిళ్లలో భార్య భర్త పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం పరిపాటే! అయితే అన్ని విషయాల్లోనూ భార్యాభర్తలిద్దరూ సమానమైనప్పుడు భర్త కూడా భార్య ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పు లేదంటున్నారు ఈ తరానికి చెందిన కొందరు.....
(Photos: Instagram)
కొన్ని పెళ్లిళ్లలో భార్య భర్త పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం పరిపాటే! అయితే అన్ని విషయాల్లోనూ భార్యాభర్తలిద్దరూ సమానమైనప్పుడు భర్త కూడా భార్య ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పు లేదంటున్నారు ఈ తరానికి చెందిన కొందరు భర్తలు. మాటల్లో చెప్పడం కాదు.. ఆచరించి చూపిస్తున్నారు కూడా! కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ పురుషాధిపత్యం కనిపిస్తున్నా.. చదువు, సంపాదన, తెలివితేటలు.. ఇలా ఎన్నో అంశాల్లో ఇద్దరూ సమానమే అయినప్పుడు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడంలో మాత్రం ఈ అంతరాలెందుకు..? అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. అందుకు తార్కాణమే ఈ మధ్యే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ కొత్త జంట.
నువ్వు చాలా లక్కీ.. ఎందుకంటే..!
అర్నవ్ రాయ్, దితీ గొరాదియా రాయ్‌లు ఈ మధ్యే ప్రేమ వివాహం చేసుకున్నారు. అర్నవ్‌కి ఆడ-మగ అన్న భేదాల్లేకుండా ప్రతి విషయాన్నీ సమాన దృష్టితో చూడడం అలవాటు. దీన్నే తన పెళ్లిలోనూ పాటించాలనుకున్నాడీ హ్యాండ్‌సమ్. ఈ క్రమంలోనే తను తాళి కట్టిన భార్య తన ఆశీర్వాదం తీసుకున్నట్లే.. ఆపై తానూ తన అర్ధాంగి కాళ్లకు నమస్కరించి భార్యాభర్తలిద్దరూ సమానమేనని చాటాడు. ఇలా అర్నవ్ చేసిన పనికి పెళ్లి కూతురే కాదు.. అక్కడున్న అతిథులంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత దీని వెనకున్న అసలు విషయం తెలుసుకొని ఈ లవ్లీ కపుల్‌ని ఆశీర్వదించారు. ఇక ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకున్న దితీ.. ‘అర్నవ్ అలా చేయడం మా పెళ్లి చేసిన పురోహితునికి నచ్చలేదు. అయితే ఈ తంతు ముగిశాక అర్నవ్ నా చెవిలో ఓ మాట చెప్పాడు.. ‘నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకంటే ప్రతి విషయాన్నీ సమానత్వంతో చూసే భర్త నీకు దొరికినందుకు’ అని! ఈ మాటలు నన్ను మరింత ఆనందంలో ముంచెత్తాయి..’ అంటోందీ కొత్త పెళ్లికూతురు. దీంతో ఈ జంట పెళ్లి ముచ్చట్లు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.
ఇదేవిధంగా పెళ్లిలో వివిధ రకాలుగా భార్యాభర్తల సమానత్వాన్ని చాటిన జంటలు గతంలోనూ కొన్నున్నాయి.
ఒకరి ఆశీర్వాదం మరొకరు..!
భార్యాభర్తలిద్దరూ సమానమైనప్పుడు ఇద్దరూ ఒకరి ఆశీర్వాదం మరొకరు తీసుకోవడంలో తప్పు లేదంటోంది ఓ మరాఠీ జంట. పీయూష్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ప్రియురాలితో ఏడడుగులు వేశాడు. అయితే పెళ్లి తంతు అంతా పూర్తయ్యాక.. భార్య తన పాదాలకు నమస్కరిస్తుంటే వారించిన పీయూష్.. ఆపై తాను తన సతీమణి కాళ్లను స్పృశించడానికి ప్రయత్నించాడు. అయితే ఇది చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయి.. తానూ వారించే ప్రయత్నం చేసింది. ఇలా వరుడు చేసిన పనికి వధువే కాదు.. అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోవడంతో పాటు ‘పది కాలాల పాటు ఇలాగే కలిసి మెలిసి ఉండండ’ని ఆశీర్వదించారు. ఇక ఈ తంతునంతా వీడియో రూపంలో బంధించి ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. నెటిజన్లంతా ఈ జంటను ఆశీర్వదిస్తూ.. వరుడు చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పారు..
తను నా ఇంటి గృహలక్ష్మి!
పుట్టింటిని వదిలి మెట్టినింటికి వచ్చిన తన భార్యను సాక్షాత్తూ లక్ష్మీదేవితో పోల్చాడు మరో భర్త. తన వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ఆమెకు జీవితంలోనే కాదు.. గౌరవమర్యాదల్లోనూ సగపాలు పంచుతానని బాస చేశాడు. ఈ నేపథ్యంలోనే పెళ్లి తంతు పూర్తై.. భార్య తన ఆశీర్వాదం తీసుకున్నాక.. తాను కూడా తన భార్య కాళ్లకు నమస్కరించాడు. దాంతో వధువే కాదు.. అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనకున్న అంతరార్థం ఏంటని అడిగితే.. ‘ఆమె నా వంశాన్ని నిలబెట్టడానికి వచ్చింది.. మా ఇంటికొచ్చిన గృహలక్ష్మి.. తన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పేం లేదు..’ అంటూ బదులిచ్చాడీ క్యూట్ హబ్బీ. ఇలా తన చేతలతోనే కాదు.. మాటలతోనూ భార్యపై తనకున్న ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నాడు.
భార్య పేరు చేర్చుకున్నాడు!
సాధారణంగా పెళ్లి తర్వాత భార్యలు తమ పేర్లకు చివర భర్తల పేర్లు చేర్చుకోవడం, ఇంటి పేరు మార్చుకోవడం మనకు తెలిసిందే! అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. భార్య పేరునే తన పేరు చివర చేర్చుకొని దంపతులిద్దరూ సమానమే అన్న మంచి విషయాన్ని చాటాడు అమెరికాకు చెందిన ఒలెగ్ బుల్లర్. మన దేశానికి చెందిన ప్రముఖ ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్ దీపా ఖోస్లాను వివాహం చేసుకున్న బుల్లర్.. పెళ్లి తర్వాత తన పేరును ఒలెగ్ బుల్లర్ ఖోస్లాగా మార్చుకున్నాడు.. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం తన ఇన్‌స్టాగ్రామ్ పేజీనే! అంతేకాదు.. వివాహ సమయంలోనూ తన భార్య కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడీ హ్యాండ్‌సమ్ హబ్బీ. ఈ ఫొటో అప్పట్లో తెగ వైరలైంది. ఇదే ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న దీప.. ఓ సుదీర్ఘ పోస్ట్ రూపంలో తన ఆనందాన్ని పంచుకుంది.
తాళి కట్టించుకున్నారు.. బొట్టు పెట్టించుకున్నారు!
భార్య పాదాలకు నమస్కరించడం, భార్య పేరును తన పేరు చివర చేర్చుకోవడమే కాదు.. ఏకంగా భార్యతో తాళి కట్టించుకొని, ఆమెతో పాపిట్లో సింధూరం దిద్దించుకొని వినూత్నంగా సమానత్వాన్ని చాటారు మరికొందరు భర్తలు.
❀ బాలీవుడ్ క్యూట్ కపుల్ రాజ్‌కుమార్ రావ్, పత్రలేఖ గతేడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే! అయితే ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన వారి పెళ్లిలో మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే.. పత్రలేఖ చేతులతో రాజ్‌కుమార్ తన పాపిట్లో బొట్టు పెట్టించుకోవడం. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసినా.. భార్యాభర్తలిద్దరూ ప్రతి విషయంలోనూ సమానమేనని తమ పెళ్లితో మరోసారి చాటిందీ అందాల జంట.
❀ శార్దూల్ కదమ్, తనూజా పాటిల్.. ముంబయికి చెందిన ఈ జంట తమ పెళ్లితో వార్తల్లోకెక్కారు. ఈ వేడుకలో భార్యతో తాళి కట్టించుకొని అటు భార్యాభర్తల మధ్య సమానత్వాన్ని, ఇటు భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు శార్దూల్. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మంగళసూత్రాన్ని సైతం డిజైన్ చేయించుకున్నాడు. పితృస్వామ్య వ్యవస్థను, ఈ క్రమంలో అందరి మనసుల్లో వేళ్లూనుకుపోయిన ఆలోచనల్ని మార్చడానికే ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు.
❀ కర్ణాటకకు చెందిన అమిత్-ప్రియ, ప్రభురాజ్-అంకితల పెళ్లి ఒకేసారి ఒకే వేదికపై జరిగింది. వీళ్లు కూడా తమ భార్యలతో తాళి కట్టించుకొని సమానత్వాన్ని చాటారు. అంతేకాదు.. తమ పెళ్లిలో కన్యాదానానికి కూడా చోటివ్వలేదీ జంటలు. ‘పెళ్లిళ్ల తీరు మారాలని, వరకట్న భూతం అంతమొందాలన్న సందేశం ఇవ్వడానికే’ తామిలా చేశామంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.