AIతో దూసుకుపోతూ.. బిజినెస్‌లో రాణిస్తూ..!

మనిషి చేసే పనిని మెషీన్లు చేయడమే కృత్రిమ మేధ. ఇప్పటికే చాలా రంగాల్లో అడుగుపెట్టిన ఈ సాంకేతికత ఎన్నో పనుల్ని ఆటోమేషన్‌ చేసేస్తోంది. ఇక ఇదే సాంకేతికతను వినియోగించుకుంటూ కొత్త వ్యాపారాలకు తెరతీస్తున్నారు కొందరు మహిళలు.

Updated : 16 Mar 2024 15:13 IST

(Photos: LinkedIn)

మనిషి చేసే పనిని మెషీన్లు చేయడమే కృత్రిమ మేధ. ఇప్పటికే చాలా రంగాల్లో అడుగుపెట్టిన ఈ సాంకేతికత ఎన్నో పనుల్ని ఆటోమేషన్‌ చేసేస్తోంది. ఇక ఇదే సాంకేతికతను వినియోగించుకుంటూ కొత్త వ్యాపారాలకు తెరతీస్తున్నారు కొందరు మహిళలు. కృత్రిమ మేధను నలుగురికీ పంచుతూ.. ఈ సాంకేతికతో కలిసి పనిచేసేలా నేటి యువతను సంసిద్ధం చేస్తున్నారు మరికొందరు అతివలు. మరి, నేటి సాంకేతిక రంగంలో ఏఐతో సరికొత్త ఒరవడి సృష్టిస్తోన్న అలాంటి కొందరు మహిళా టెకీల గురించి తెలుసుకుందాం..!

టెక్ట్స్‌ని వీడియోగా మార్చే ‘క్రూప్’!

సినిమాలు, సీరియల్స్‌, ఇతర వినోద కార్యక్రమాల్ని ఒక భాష నుంచి మరో భాషలోకి డబ్బింగ్‌ చేయడం తెలిసిందే! అయితే ఈ క్రమంలో కొన్ని డైలాగ్స్‌, పాటలు లిప్‌ సింక్‌ కాకపోవడం మనం గమనిస్తుంటాం. మరి, మనమైతే కనీసం మన మాతృభాషలో డైలాగ్స్‌ వినైనా అర్థం చేసుకోగలుగుతాం.. అదే బధిరుల విషయానికొస్తే.. కచ్చితత్వంతో కూడిన లిప్‌ సింక్‌ వీడియో అయితేనే వాళ్లు అర్థం చేసుకోగలుగుతారు. లిప్‌ సింక్‌కు సంబంధించిన ఈ లోపాన్ని కృత్రిమ మేధతో పూడ్చాలనుకుంది డాక్టర్‌ జ్యోతి జోషి. ఈ ఆలోచనతోనే ‘Kroop AI’ పేరుతో ఓ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిందామె. ఈ వేదికగా తెరపై కదిలే బొమ్మల పెదాల కదలికల్ని బట్టి కచ్చితత్వంతో కూడిన లిప్‌ సింక్‌ వీడియోలు రూపొందించడంతో పాటు మరికొన్ని సేవల్ని సైతం అందిస్తోందామె. ఇందులో భాగంగా.. వినియోగదారులు తమ అవసరాల్ని బట్టి వ్యక్తిగత వీడియోలు రూపొందించుకోవచ్చు.. ఇక సంస్థలు తమ ఉత్పత్తుల్ని మార్కెటింగ్‌ చేసుకోవడానికి తగిన ట్యుటోరియల్‌ వీడియోలు సైతం రూపొందించుకోవచ్చు. ఇక చిన్నారులకు ఆయా పాఠాల్ని బోధించే వీడియోల్ని క్రియేట్‌ చేసుకోవడంతో పాటు.. డిజిటల్‌ న్యూస్‌ యాంకర్ సేవల్ని సైతం అందిస్తోందామె. కేవలం టెక్ట్స్‌, ఆడియోను ఇన్‌పుట్‌గా అందిస్తే చాలు.. తమ వద్ద ఉన్న 50కి పైగా విభిన్న అవతార్‌ల సహాయంతో, దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 భాషలకు పైగా నాణ్యమైన వీడియోలు రూపొందించుకోవచ్చని చెబుతోందామె. అంతేకాదు.. డీప్‌ఫేక్‌ వీడియోల్ని పసిగట్టేందుకు తన ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఓ ఆన్‌లైన్‌ ‘డీప్‌ఫేక్‌ డిటెక్టర్‌’ని కూడా అందుబాటులో ఉంచింది జ్యోతి. ఆస్ట్రేలియాలోని క్యాన్‌బెర్రా యూనివర్సిటీలో ‘కంప్యూటర్‌ విజన్‌ - స్పీచ్‌ అనాలిసిస్‌’ విభాగంలో పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆమె.. గతంలో పలు యూనివర్సిటీల్లో మానసిక ఆరోగ్య విశ్లేషకురాలిగానూ పనిచేసింది.


క్రీడా నైపుణ్యాల్ని విశ్లేషించేలా..!

ఏ రంగంలోనైనా మన పనితీరును, నైపుణ్యాల్ని విశ్లేషించుకుంటూ.. వెనకబడిన అంశాలపై దృష్టి సారించినప్పుడే సక్సెసవుతాం. క్రీడా రంగానికీ ఇది వర్తిస్తుంది. ఈ క్రమంలోనే క్రీడాకారులు ఎప్పటికప్పుడు తమ క్రీడా నైపుణ్యాల్ని విశ్లేషించుకుంటూ, మెరుగుపరచుకోవాల్సిన అంశాల్ని గుర్తించి.. తగిన శిక్షణ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ‘స్తూపా స్పోర్ట్స్ అనలిటిక్స్‌’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించింది దిల్లీకి చెందిన మేఘా గంభీర్‌. ప్రస్తుతం ఈ వేదికగా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాల్ని అభివృద్ధి చేసుకునేందుకు కృత్రిమ మేధ సహాయంతో వారి కోసం కొన్ని ఉత్పత్తుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ఒకటి యాప్‌. క్రీడాకారులు తమ మ్యాచుల్ని ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేసుకొని.. తమ ఆట తీరుని విశ్లేషించుకోవచ్చు. ఈ క్రమంలోనే తాము ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అంశాలేంటో కూడా ఫీడ్‌బ్యాక్ పొందచ్చు. తద్వారా ఆయా అంశాలపై దృష్టి సారించచ్చు. మరోవైపు ‘స్తూపా ఈవెంట్స్‌’ పేరుతో పలు జాతీయ, అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్స్‌తో మమేకమైన మేఘ.. వాళ్లు నిర్వహించే రోజువారీ ఈవెంట్స్‌ని మేనేజ్‌ చేసే బాధ్యత తీసుకుంది. అలాగే తమ ఏఐ ప్లాట్‌ఫామ్‌ వేదికగా ఆటలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించే బాధ్యతనూ నిర్వర్తిస్తోందామె. ప్రస్తుతం టీటీ క్రీడకే పరిమితమైన తన టెక్నాలజీని భవిష్యత్తులో బ్యాడ్మింటన్‌, స్క్వాష్‌, లాన్‌ టెన్నిస్‌.. వంటి క్రీడలకూ విస్తరించనున్నట్లు చెబుతోందామె. ‘పంజాబ్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ’ నుంచి ఎంసీఏ పూర్తిచేసిన ఈ స్పోర్ట్స్‌ లవర్‌.. గతంలో కొన్నేళ్ల పాటు పలు ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేసింది.


ఏఐ నైపుణ్యాల్ని పంచుతూ..!

భవిష్యత్తంతా ఏఐతోనే ముడిపడి ఉంది. అందుకే ఎదిగే పిల్లల్ని కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతికతల్లో నిష్ణాతుల్ని చేయడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే ‘Youcode Intelligence Solutions’ అనే సంస్థను ప్రారంభించింది చెన్నైకి చెందిన సూర్య ప్రభ. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్నారులకు కోడింగ్‌, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, శాస్త్రసాంకేతిక రంగాల్లో నైపుణ్యాలు అందించడం ఈ సంస్థ లక్ష్యం. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, వర్క్‌షాప్స్‌ వంటివి నిర్వహించడంతో పాటు ఆన్‌లైన్‌ వేదికగానూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఆయా నైపుణ్యాల్ని వారికి నేర్పిస్తోందామె. కొడైకెనాల్‌లోని మదర్‌ థెరిసా మహిళా విశ్వవిద్యాలయం నుంచి మైక్రోబయాలజీలో డిగ్రీ పూర్తిచేసిన ప్రభ.. క్రియేటివ్‌ గ్రాఫిక్ డిజైనర్‌గా కొన్నేళ్ల పాటు పనిచేసింది. ఆపై కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతికతలపై పట్టు పెంచుకొని.. ఈ తరం పిల్లల్ని ఈ దిశగా ప్రోత్సహిస్తోంది. వారి బంగారు భవితకు బాటలు వేస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్