అందుకే వీళ్లెంతో పవర్‌ఫుల్‌!

‘తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ల’న్నట్లుగా మూఢ నమ్మకాలతో సహజీవనం చేసే గ్రామీణ మహిళల్లో చైతన్యం కలిగిస్తోన్న వారు ఒకరు..తన పోలీస్‌ పవర్‌తో నకిలీ వార్తల వ్యవస్థను సమూలంగా అంతమొందించాలని కంకణం కట్టుకున్న వారు మరొకరు..పెట్టుబడి కోసం కొట్టుమిట్టాడే చిన్న పరిశ్రమలకు రుణాలిస్తూ, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోన్న విశాల హృదయం ఇంకొకరి సొంతం..

Updated : 30 Nov 2021 15:11 IST

(Photo: Twitter)

‘తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ల’న్నట్లుగా మూఢ నమ్మకాలతో సహజీవనం చేసే గ్రామీణ మహిళల్లో చైతన్యం కలిగిస్తోన్న వారు ఒకరు..

తన పోలీస్‌ పవర్‌తో నకిలీ వార్తల వ్యవస్థను సమూలంగా అంతమొందించాలని కంకణం కట్టుకున్న వారు మరొకరు..

పెట్టుబడి కోసం కొట్టుమిట్టాడే చిన్న పరిశ్రమలకు రుణాలిస్తూ, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోన్న విశాల హృదయం ఇంకొకరి సొంతం..

‘నా మట్టుకు నేను బాగుంటే చాలు’ అన్న స్వార్థపూరిత ధోరణిని పక్కన పెట్టి వీరంతా నలుగురి మంచి కోసం నడుం బిగించారు. వాళ్లు చేసే వృత్తి ఉద్యోగాలతోనే ఎంతోమందిలో చైతన్యం తీసుకొస్తున్నారు. ఇలాంటి 21 మంది మహిళల నిస్వార్థ సేవల్ని కొనియాడుతూ ‘ఫోర్బ్స్‌ ఇండియా విమెన్‌ పవర్‌ 2021’ జాబితాలో వారికి ఇటీవలే చోటు కల్పించింది ఫోర్బ్స్‌. మరి, ఇంతకీ ఎవరా పవర్‌ఫుల్‌ విమెన్‌? తెలుసుకుందాం రండి..

చేతబడిని చాచికొట్టి..

దేశం సాంకేతికంగా ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో మూఢ నమ్మకాలే రాజ్యమేలుతున్నాయి. దీంతో అక్కడి వారు తమకు తెలిసిందే వేదం అన్న భ్రమలో ఉంటారు. ఇతరులు అవగాహనతో ఏ విషయం చెప్పినా విని అర్థం చేసుకునే స్థితిలో వాళ్లుండరు. ముఖ్యంగా చేతబడి, క్షుద్ర పూజలతోనే అనారోగ్యాలు నయమవుతాయన్న గుడ్డి నమ్మకంతో ఉంటారు. తద్వారా లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుంటారు. ఇదిగో ఇలా మొండిగా వాదించే మహిళల ఆలోచనల్ని మార్చే ప్రయత్నం చేస్తోంది ఒడిశాకు చెందిన ఆశా కార్యకర్త మటిల్డా కుల్లు. అక్కడి గర్గద్‌బాహల్‌ అనే పల్లెలో విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. ఆ గ్రామ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఏళ్లుగా కృషి చేస్తోంది.

‘ఏ అనారోగ్యానికైనా చేతబడి, క్షుద్ర పూజలే వైద్యంగా భావిస్తుంటారు ఇక్కడి ప్రజలు. నిజానికి వాటివల్ల ఫలితం లేకపోగా.. ఇతర సమస్యలు దానికి తోడవుతాయి. ఈ విషయం ఇక్కడి వాళ్లకు అర్థం చేయించడం కత్తి మీద సవాలే! మొదట్లో నేను చెప్పిన ఈ విషయాలు వినకపోగా.. జోకులంటూ నవ్వుకునేవారు. కానీ ఇప్పుడిప్పుడే ఆ ఆలోచనల్లో నుంచి బయటికొస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. అనారోగ్యాలుంటే ఆస్పత్రికి పరుగు పెడుతున్నారు. ఓ ఆశా కార్యకర్తగా ఇక్కడి మహిళల ఆరోగ్యం, గర్భిణులు/పాలిచ్చే తల్లులకు తరచూ పరీక్షలు చేయడం, చంటి పిల్లలకు వ్యాక్సిన్లు ఇవ్వడం, యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు నెలసరి పరిశుభ్రత-ఇతర అంశాలపై అవగాహన కల్పించడం, సర్వేలు నిర్వహించడం, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కలిగించడం.. ఇవే నా విధులు!’ అంటోంది మటిల్డా. అటు ఇంటిని చక్కదిద్దుకుంటూ.. ఇటు సమాజాన్నీ సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తోన్న ఈ సూపర్ ఉమన్.. రోజూ తన విధులకు సైకిల్ పైనే వచ్చి వెళ్తోంది. ఆమె కృషిని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇటీవలే ట్విట్టర్‌ వేదికగా కొనియాడారు. 

 

హామీ లేకుండా రుణాలిస్తోంది!

వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి.. కాస్త డబ్బున్నోళ్లు లేదంటే అందుకోసం ముందు నుంచి డబ్బు దాచుకున్న వాళ్లకు ఈ విషయంలో అంత ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కానీ డబ్బు లేకపోతే మాత్రం రుణం కోసం బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే! అయితే ఆ అవసరం లేదంటోంది హార్దికా షా. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు హామీ లేని రుణాలు అందిస్తూ ఎంతోమంది స్త్రీల వ్యాపార కలల్ని నిజం చేస్తోంది. ఇందుకోసం ‘కినారా క్యాపిటల్స్‌’ పేరుతో ఓ కంపెనీని నెలకొల్పిందామె. ఎలాంటి హామీ లేకుండా కేవలం 24 గంటల్లో లక్ష నుంచి 30 లక్షల దాకా వ్యాపార రుణాల్ని అందించడం దీని ప్రత్యేకత! ఈ క్రమంలో నగదు లావాదేవీలన్నీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్ ఆధారంగానే నిర్వర్తిస్తోంది.

‘మధ్య తరగతి కుటుంబాల్లో ఆర్థిక కష్టాలు ఎలా ఉంటాయో తెలిసిన దాన్ని. ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాలంటే చదువే అందుకు పరిష్కారం అని తెలుసుకున్నా. ఎంబీఏ పూర్తి చేశాక 20 ఏళ్ల పాటు యాక్సెంచర్‌, ఇతర అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేశా. నా ప్రతిభకు, పనితీరుకు పలు అవార్డులు కూడా వరించాయి. నిజానికి అవేవీ ఇవ్వలేని తృప్తి కినారా క్యాపిటల్‌ ద్వారా నాకు దక్కుతోంది. సామాన్య మహిళలు తమ కలల్ని నెరవేర్చుకునే దిశగా సహాయం చేస్తున్నానన్న సంతోషం ముందు ఏదైనా దిగదుడుపే..’ అంటోంది షా.

 

తప్పుడు వార్తల భరతం పడుతోంది!

అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో కొన్ని తప్పుడు వార్తలూ ప్రచారమవుతుంటాయి. నిజమెంతో తెలుసుకోకుండా వీటిని నమ్మడం, ఇతరులతో పంచుకోవడం, ఆ తర్వాత బాధపడడం.. ఎలా చూసినా వీటి వల్ల నష్టమే! ఇలాంటి నకిలీ వార్తలను కట్టడి చేయడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు మహబూబ్‌నగర్‌ జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి. ఈ క్రమంలోనే అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారామె.

‘సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, సందేశాల గురించి గ్రామాల్లో ఉండే ప్రజలకు సరైన అవగాహన ఉండదు. అందుకే ఇలాంటి వార్తల్ని కనిపెట్టడానికి గ్రామ సర్పంచ్‌, ఇతర పెద్దలు అడ్మిన్‌గా ఉన్న వాట్సప్‌ గ్రూపుల్లో ఓ పోలీస్‌ అధికారిని కూడా చేర్చుతున్నాం. అలాగే ‘పోలీస్ కళా బంధం’ పేరుతో మరో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా గ్రామాల్లో ఉండే జానపద కళాకారులు తమ కళల ద్వారా ఈ విషయంపై అవగాహన కల్పించేలా వారికి శిక్షణ ఇస్తున్నాం. మరోవైపు జిల్లా ప్రధాన కార్యాలయంలో సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేసి ఇలాంటి వార్తలపై నిఘా పెట్టాం. ఇందుకోసం కొంతమంది పోలీస్‌ ఆఫీసర్లకు సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాం. ఈ కార్యక్రమాలన్నీ నకిలీ వార్తలపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి..’ అంటారు రెమా.

 

ఇది ‘వైర్‌లెస్’ స్టార్టప్!

రాబోయేదంతా వైర్‌లెస్‌ యుగమేనని, ఈ క్రమంలో నెట్‌వర్క్‌/డేటా కమ్యూనికేషన్‌ లోపాలు లేకుండా చేయడమే తన లక్ష్యమంటోంది నేహా సతక్‌. ఈ క్రమంలోనే ‘ఆస్ట్రోమ్’ పేరుతో ఓ స్టార్టప్‌ని సైతం ప్రారంభించిందామె. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న 4జీ నెట్‌వర్క్‌ అనుసంధాన లోపాల్ని సవరిస్తూ.. 5జీకి మార్గం సుగమం చేయడం కోసం ‘గిగామెష్‌’ పేరుతో ఓ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌కి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడే ఫైబర్‌ పరిధిని విస్తరించేందుకు కూడా గిగామెష్‌ అనువైనదని చెబుతోందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్.

వీళ్లతో పాటు.. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇండియా అధినేత అపర్ణా పురోహిత్‌, సేల్స్‌ఫోర్స్‌ ఇండియా ఛైర్‌పర్సన్‌-సీఈవో అరుంధతీ భట్టాచార్య, పర్యావరణ ప్రేమికురాలు దిశా రవి, అథ్లెట్లు అవనీ లేఖ్రా-భవీనా పటేల్‌-రాణీ రాంపాల్‌, నటీమణులు రసికా దుగ్గల్‌-సన్యా మల్హోత్రా.. తదితరులు సైతం ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్