Updated : 06/04/2022 16:07 IST

కాళ్లే.. చేతులు! ఈ అమ్మ స్ఫూర్తి గాథ విన్నారా?

సాధారణంగా మన మెదడు ఏం చెప్తే చేతులు చకచకా ఆ పనులు చేసేస్తాయ్‌! కానీ బెల్జియంకు చెందిన సారా తల్బి మాత్రం.. ‘తన మెదడుకు కాళ్లకు అవినాభావ సంబంధం ఉందం’టోంది. పుట్టుకతోనే చేతుల్లేకుండా జన్మించిన ఆమె చిన్నతనంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది.. మరెన్నో ఛీత్కారాల్ని భరించింది. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా.. ఎవరిపై ఆధారపడకుండా.. తన పనులన్నీ కాళ్లతోనే చేసుకోవడం అలవాటు చేసుకుంది. ఇక ప్రస్తుతం తన మూడేళ్ల కూతురిని కూడా కాళ్లతోనే లాలిస్తూ, పాలిస్తూ.. అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. అంతేకాదు.. తన రోజువారీ లైఫ్‌స్టైల్‌ని వీడియోలుగా రూపొందిస్తూ.. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ఎంతోమంది ఆదరణ చూరగొంటోందీ బెల్జియం మామ్‌. అవయవ లోపాన్ని జయించి, విధిని ఎదిరించి ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోన్న ఈ మాతృమూర్తి కథ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

జీవితంలో అన్నీ ఉన్నా.. ఇంకా ఏదో వెలితిగా ఫీలవుతుంటారు కొంతమంది. అలాంటి వారు సారా తల్బి కథ చదివితే మాత్రం.. తమ మనసు మార్చుకోవడం ఖాయం. ఎందుకంటే తన జీవితంలో అన్ని ఎత్తుపల్లాల్ని చవి చూసింది సారా. బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో పుట్టిన ఆమెకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. దాంతో డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోయారు.

అవమానాలే ఆత్మవిశ్వాసం నింపాయి!

దీనికి తోడు.. ‘అన్ని పనులు చేసుకోవాల్సిన చేతులే లేవు.. ఇంకేం పని చేతనవుతుంద’న్న సూటిపోటి మాటలు, తోటి విద్యార్థుల హేళనలు ఆమె పసి మనసును గాయపరిచేవి. అయితే ప్రతి ఒక్కరిలో ఉన్న లోపాల్ని అధిగమించడానికి ఏదో ఒక సానుకూలత ఉన్నట్లే.. తన ప్లస్‌ పాయింట్‌ మాత్రం తన కాళ్లే అంటోంది సారా.

‘మనలో లోపాల్ని సృష్టించేది.. వాటిని అధిగమించే శక్తినిచ్చేది ఆ భగవంతుడే! చేతుల్లేకుండా పుట్టించిన నాకు కాళ్లతోనే అన్ని పనులు చేసుకోగలిగే బలాన్నిచ్చాడు. అయితే ఈ అవయవ లోపంతో చిన్నతనంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. స్కూల్లో తోటి విద్యార్థుల బుల్లీయింగ్‌కి గురయ్యా. అయినా వీటన్నింటినీ అధిగమించే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నా. పెరిగి పెద్దయ్యే కొద్దీ తినడం, దుస్తులు వేసుకోవడం, మేకప్‌ చేసుకోవడం, దువ్వుకోవడం, కాయగూరలు తరగడం, పెయింటింగ్‌ వేయడం, పుస్తకాలు చదవడం, కంప్యూటర్‌ ఆపరేట్‌ చేయడం.. ఇలా చేతులతో చేసే పనులన్నీ ఒక్కొక్కటిగా కాళ్లతో చేయడం నేర్చుకున్నా. అయితే ఇన్ని చేసినా రాయడం నేర్చుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఇక ఇప్పుడు ఇవన్నీ నేను క్షణాల్లో పూర్తి చేయగలను.. అందరి విషయంలో మెదడు చెప్పే పనులకు చేతులు స్పందిస్తే.. నా విషయంలో కాళ్లు స్పందిస్తాయి..’ అంటోంది సారా.

పాపను ఎత్తుకోవడానికి భయమేసేది!

ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న సారా మూడేళ్ల కూతురికి తల్లి. అయినా తన అవయవ లోపాన్ని అధిగమించి.. తన చిన్నారిని కంటికి రెప్పలా కాచుకుంటోంది. తన కాళ్లనే చేతులుగా చేసుకొని పాప ఆలనా పాలనా చూసుకుంటోంది.. అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది.
‘నా పాప లిలియా పుట్టినప్పుడు తనను కాళ్లతో ఎత్తుకోవడానికి కాస్త భయమేసేది. కానీ తర్వాత్తర్వాత అలవాటైపోయింది. కాళ్లతోనే పాపను పొత్తిళ్లలోకి తీసుకొని పాలివ్వడం, స్నానం చేయించడం, దుస్తులు వేయడం, తల దువ్వడం.. వంటివన్నీ చేసేదాన్ని. ఇక ఇప్పుడు పాప స్కూలుకెళ్తోంది. దాంతో ఉదయాన్నే లేచి తన లంచ్‌ బాక్స్‌, స్నాక్స్‌ ప్రిపేర్‌ చేయడంతో పాటు ఇతర పనులన్నీ చేసి పెడుతున్నా. ఈ విషయంలో మావారు నాకు చాలా సహాయం చేస్తున్నారు.. రోజువారీ పనుల్లోనూ సహకరిస్తున్నారు..’ అంటూ చెప్పుకొచ్చిందీ బెల్జియం మామ్‌.

అలా కాళ్లతోనే సంపాదిస్తోంది!

కాళ్లతోనే అన్ని పనులు చకచకా పూర్తిచేసే సారా.. మంచి పెయింటర్‌ కూడా! ఈ క్రమంలో చిత్రకళకు సంబంధించిన కోర్సులు నేర్చుకున్న ఆమె.. తన కాళ్లతోనే కాన్వాస్‌పై అందమైన చిత్రాల్ని తీర్చిదిద్దుతోంది. తద్వారా తనలోని చిత్రకళను ప్రదర్శించడమే కాదు.. డబ్బూ ఆర్జిస్తోంది. అంతేకాదు.. మరోవైపు తాను నిత్య జీవితంలో కాళ్లతో చేసే పనులన్నీ వీడియోలుగా రూపొందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. వాటికి లక్షల్లో అభిమానులున్నారు. ప్రస్తుతం ఆమె పేరుతో నిర్వహిస్తోన్న యూట్యూబ్‌ ఛానల్‌కు 2.74 లక్షల సబ్‌స్క్రైబర్లున్నారు. వీరంతా సారా పెట్టే వీడియోలు చూడడమే కాదు.. ‘ఆమె జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం’ అంటూ స్ఫూర్తి పొందుతున్నారు కూడా!

నిజంగా.. సారా కథ చదువుతుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి కదూ! కానీ తాను మాత్రం.. ‘ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది.. దాన్ని అధిగమించినప్పుడే జీవితాన్ని జయించగలం..’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి రగిలిస్తోంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని