అరటి పిండితో గులాబ్‌జామ్.. వాళ్ల జీవితాలనూ మార్చేసింది!

ఈ సృష్టిలో ఏదీ నిరుపయోగం కాదు... మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతీది మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. సరిగ్గా ఇలాగే ఆలోచించింది కర్ణాటకకు చెందిన 43 ఏళ్ల నయన ఆనంద్‌. గిట్టుబాటు ధరల్లేక రైతులు పంచిపెట్టిన అరటికాయలతో రుచికరమైన వంటకాలు, స్వీట్లు తయారుచేసింది. ఒకరోజు తనకెంతో ఇష్టమైన గులాబ్‌జామ్‌ కూడా ప్రయత్నించింది.

Updated : 04 Aug 2021 18:05 IST

(Image for Representation)

ఈ సృష్టిలో ఏదీ నిరుపయోగం కాదు... మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతీది మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. సరిగ్గా ఇలాగే ఆలోచించింది కర్ణాటకకు చెందిన 43 ఏళ్ల నయన ఆనంద్‌. గిట్టుబాటు ధరల్లేక రైతులు పంచిపెట్టిన అరటికాయలతో రుచికరమైన వంటకాలు, స్వీట్లు తయారుచేసింది. ఒకరోజు తనకెంతో ఇష్టమైన గులాబ్‌జామ్‌ కూడా ప్రయత్నించింది. అంతే.. అందరికీ నోట్లో నీళ్లూరాయి.. ఎంతలా అంటే తిరుచిరాపల్లిలోని జాతీయ అరటి పరిశోధనా కేంద్రమే ఆమె ఆలోచనను ప్రశంసించేంతలా!

గిట్టుబాటు ధరల్లేక..

సాధారణంగా కర్ణాటక, కేరళలోని రైతులకు కొబ్బరి పంటే ప్రధాన ఆదాయ వనరు. అయితే అదనపు ఆదాయం కోసం చాలామంది ఈ మధ్యన అరటిని కూడా సాగు చేస్తున్నారు. అలా ఈ ఏడాది కూడా పోటీపడి మరీ అరటిని పండించారు. అయితే దురదృష్టవశాత్తూ మార్కెట్లో అరటి ధర బాగా పడిపోయింది. దీంతో రైతులు పూర్తిగా అయోమయంలో పడిపోయారు. కొందరు తక్కువ ధరకే తమ పంటను అమ్ముకుంటే మరికొందరు పశువుల మేతగా వినియోగించుకున్నారు. ఇంకొందరు తమ బంధువులు, స్నేహితులకు అరటికాయలను పంచిపెట్టారు. అలా కర్టాటకలోని తుమకూరు జిల్లా అత్తికట్టె గ్రామానికి చెందిన నయన రైతుల నుంచి పెద్ద మొత్తంలో అరటి కాయలను అందుకుంది.

వృథా కాకూడదని!

అరటి కాయలను వృథా చేయకూడదని భావించిన నయన... మొదట వాటితో రుచికరమైన వడలు, స్వీట్లు తయారుచేసింది. అయితే ఇంట్లో పెద్ద మొత్తంలో నిల్వ ఉండిపోయిన ఇతర అరటికాయలు పాడవ్వకుండా ఇంకా ఏదైనా ట్రై చేయాలనుకుంది. అప్పుడే ఆమెకు కేరళలోని పనస పండ్ల రైతులు గుర్తుకొచ్చారు. మిగిలిపోయిన పనస పండ్లను ఎండబెట్టి పిండి చేయడం, వాటితో రకరకాల ఉత్పత్తులు తయారుచేయడం నయనను బాగా ఆకట్టుకుంది.

అయితే మార్కెట్‌లో అరటికాయ పిండి దొరుకుతున్నా దాని తయారీపై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఆ దిశగా అధ్యయనం ప్రారంభించింది.  ఇందులో భాగంగా - అలెప్పీలోని కృషి విజ్ఞాన కేంద్రం పరిశోధకుల సహాయంతో అరటి పిండి తయారీ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది.

వారం రోజుల్లో...

‘800 మిల్లీ లీటర్ల నీరు, 200 మిల్లీ లీటర్ల రైస్ వాటర్‌ (బియ్యం కడిగిన నీరు) కలిపి ఓ ద్రావణంలా తయారుచేసుకోవాలి. ఇందులోకి 10 గ్రాముల ఉప్పును కలపాలి. ఆ తర్వాత తొక్క తీసిన అరటి కాయలను ఈ మిశ్రమంలో గంటసేపు నానబెట్టాలి. అనంతరం బయటకు తీసి చిన్న చిన్న స్లైసుల్లా కట్‌ చేసుకోవాలి. వీటిని రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. వాతావరణం చల్లగా ఉంటే అదనంగా మరో రోజు పొడిగించుకోవచ్చు. ఆపై మిక్సీ/బ్లెండర్‌ సహాయంతో పిండి చేసుకోవాలి. దీనిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. ఈ పిండిని ఆరు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు’ అని బనానా ఫ్లోర్‌ తయారీ గురించి చెప్పుకొచ్చిన నయన ఈ పిండితో చపాతీలు, కట్లెట్స్‌, బిస్కట్లు, వివిధ రకాల స్వీట్లు తయారు చేసింది.

అరటి పిండితో గులాబ్‌జామ్!

మొదట గోధుమ/మైదా పిండి వంటకాల్లో అరటి పిండిని జత చేసిన ఆమె ఆ తర్వాత కేవలం అరటి పిండితోనే వంటకాలు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో తనకు ఎంతో ఇష్టమైన గులాబ్‌జామ్‌ కూడా ప్రయత్నించింది. ‘గులాబ్‌జామ్‌లు తయారుచేసేందుకు నేను మొదట అరటి పిండి, పాలపొడిని మిక్స్‌ చేశాను. ఆ తర్వాత నీరు, పాలు కలిపి చిన్న చిన్న ఉండల్లా తయారుచేసుకున్నాను. వీటిని నెయ్యిలో వేయించి ఆపై చక్కెర పాకంలో ముంచాను. చివరిగా కొబ్బరి తురుము మిశ్రమంలో రోల్‌ చేస్తే సరి’ అని అంటూ తన రుచికరమైన రెసిపీ తయారీ గురించి పంచుకుంది నయన.

ఆలోచన బాగుంది!

ప్రస్తుతం అరటి పిండి వంటకాలు, ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి విక్రయించే ప్రయత్నాల్లో ఉంది నయన. ఈ నేపథ్యంలో ఆమెకు తట్టిన అరటి పిండి ఆలోచన అక్కడి రైతుల జీవితాలను మార్చేసింది. ఆమె తరహాలోనే రైతులు కూడా తమ వద్ద మిగిలిపోయిన అరటి కాయలను వృథా కాకుండా పిండిగా మార్చుకుని నిల్వ చేసుకుంటున్నారు. కొందరు ఈ పిండిని సంచుల్లో ప్యాక్ చేసి డైరెక్ట్‌గా విక్రయిస్తుంటే మరికొందరు రకరకాల వంటకాలు తయారుచేసి అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో నయన అరటి పిండి ఆలోచన తిరుచిరాపల్లిలోని జాతీయ అరటి పరిశోధన కేంద్రం నిర్వాహకులను కూడా మెప్పించింది. ఆ సంస్థ డైరెక్టర్ నయనను ప్రశంసిస్తూ ఓ అభినందన పత్రం కూడా పంపించడం విశేషం.
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్