షుగర్‌ఫ్రీ స్వీట్స్‌తో లక్షలు సంపాదిస్తోంది!

ఒక్కోసారి మన చిన్న చిన్న ఆసక్తులు, అభిరుచులే మన లక్ష్యానికి దారులు చూపుతాయి. జీవితంలో గొప్ప విజయానికి బాటలు వేస్తాయి. కశ్మీర్‌కు

Updated : 17 Aug 2021 12:32 IST

ఒక్కోసారి మన చిన్న చిన్న ఆసక్తులు, అభిరుచులే మన లక్ష్యానికి దారులు చూపుతాయి. జీవితంలో గొప్ప విజయానికి బాటలు వేస్తాయి. కశ్మీర్‌కు చెందిన రిదా సాజద్‌ది ఇలాంటి కథే. చిన్నప్పటి నుంచి కుకింగ్‌పై ఆసక్తిపై ఉన్న ఆమె ఒకసారి తన ఇంట్లో సరదాగా చక్కెర ఉపయోగించకుండా డ్రై ఫ్రూట్‌ ఖీర్‌ చేసింది. పిల్లలతో పాటు కుటుంబ సభ్యులందరూ ఇష్టపడి తిన్నారు. ఇది కాస్తా బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారికి తెలిసిపోయింది. ఆ తర్వాత కశ్మీర్‌లోయ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎంతలా అంటే... అదే స్వీట్ల వ్యాపారంతో నెలకు లక్ష రూపాయల లాభం సంపాదించేలా..!

ఆన్‌లైన్‌లో స్వీట్ల వ్యాపారం!

కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు చెందిన రిదా బెంగళూరులోని ఆక్స్‌ఫర్డ్‌ కాలేజీలో ఫిజియోథెరపీలో బీఎస్సీ పూర్తి చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. పెళ్లయిన తర్వాత ఇంటికే పరిమితమైంది రిదా. అయితే కుకింగ్‌లో ప్రావీణ్యం ఉండడంతో ఆన్‌లైన్‌ వేదికగా డ్రై ఫ్రూట్‌ స్వీట్ల బిజినెస్‌ను ప్రారంభించింది. ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఆమె... చక్కెర, ఎటువంటి రసాయనాలు కలపకుండా వీటిని తయారుచేయడం విశేషం. అందుకే కరోనా కాలంలో ఆమె స్వీట్లకు మంచి గిరాకీ ఏర్పడింది.

ఖాళీ గిన్నెలు పంపిస్తే బాగుండదని!

‘నా ఇద్దరు పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లంటే చాలా ఇష్టం. అయితే చక్కెర పదార్థాలు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో చిన్నపిల్లలైన వారికింకా తెలియదు. అందుకే గత ఏడాది ఏప్రిల్‌లో రంజాన్‌ సందర్భంగా డ్రై ఫ్రూట్స్‌ ఖీర్‌ను తయారుచేశాను. అందులో చక్కెరకు బదులు ఖర్జూరం, బాదం పప్పులు రెండింటినీ మెత్తగా గ్రైండ్‌ చేసి వాడాను. నా పిల్లలతో పాటు ఇంట్లో వారందరూ ఇష్టపడి తిన్నారు. ఆ తర్వాత ఒకసారి మా ఇంటి పక్కన ఉండే ఒకామె వారి పండగను పురస్కరించుకుని స్వీట్లు పంపించారు. ఖాళీ గిన్నెలు తిరిగి అందిస్తే బాగుండదని నేను కూడా కొన్ని స్వీట్లను నింపి ఇచ్చాను. కొద్ది రోజుల తర్వాత ఆమె మా ఇంటికొచ్చి ‘ఈ స్వీట్లు చాలా బాగున్నాయి...ఎక్కడి నుంచి తెప్పించారు?’ అని అడిగింది. దీంతో అవి నేను తయారుచేసినవే అని చెప్పాను. ఆమె మొదట నమ్మలేదు... కానీ వాటి తయారీ గురించి వివరిస్తుంటే దీపావళికి మరికొన్ని స్వీట్లు కావాలని రిక్వెస్ట్‌ చేసింది. ఆ తర్వాత ఆర్డర్లపై ఆర్డర్లు వచ్చాయి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో స్వీట్ల ఆర్డర్ల కోసం ప్రత్యేక పేజీలు కూడా క్రియేట్‌ చేశాం.’

అవేవీ నా వంటగదిలో ఉండవు!

‘ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. ఈ క్రమంలో - చక్కెర లేని పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే చక్కెరకు ప్రత్యామ్నాయంగా  కృత్రిమ రంగులు, స్వీటెనర్స్‌ కలిపిన పదార్థాలను తీసుకుంటున్నారు. ఇవి కూడా ఆరోగ్యానికి హానికరమే. వీటితో పాటు షుగర్‌ సిరప్‌లు, తేనె, బెల్లం...ఇవేవీ నా వంటగదిలో ఉండవు. డ్రై ఫ్రూట్స్‌, ఆప్రికాట్‌, నట్స్ అండ్‌ సీడ్స్‌, నెయ్యి, కుంకుమ పువ్వు, ఖర్జూరాలు, రాగులు, సజ్జలు, జొన్నలు...ఇలా ఆరోగ్యకరమైన పదార్థాలతోనే నేను స్వీట్లు తయారుచేస్తాను. తియ్యదనం కోసం ఖర్జూరాలు, ఆప్రికాట్‌, అంజీర్‌ పండ్లను ఎండబెట్టి పొడి చేస్తాను. వాటిని డ్రై ఫ్రూట్స్‌తో మిక్స్‌ చేసి వాడితే స్వీట్లకు చక్కెర ఫ్లేవర్ వస్తుంది. నేను తయారుచేసిన స్వీట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇంకా ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ కారణంతోనే మధుమేహం, రక్తపోటు బాధితులు ఎక్కువగా నా స్వీట్ల కోసం ఆర్డర్‌ చేస్తున్నారు’..

నెలకు లక్ష రూపాయల లాభం!

‘స్వీట్ల తయారీకి వినియోగించే సామగ్రి షాపింగ్‌ అంతా స్వయంగా నేనే చేస్తాను. అంతేకాదు.. తయారీలో ఎలాంటి యంత్రాలు కూడా ఉపయోగించను. అయితే ఇంట్లో వాళ్లందరూ కొన్ని పనులు పంచుకుంటారు. మా వారు రిజిస్ట్రేషన్‌, ఉత్పత్తుల నాణ్యతను చెక్‌ చేస్తే... నా ఇద్దరు కుమారులు స్వీట్‌ ప్యాకెట్లపై లేబుల్స్‌ అంటిస్తారు. ఇక డ్రై ఫ్రూట్స్‌ను దంచుతూ మా అత్తమ్మ కూడా నాకు తోడుగా నిలుస్తోంది. చివరగా ప్యాక్‌ చేసిన ఐటమ్స్‌ను కొరియర్‌ కంపెనీల ద్వారా కస్టమర్లకు చేరుస్తున్నాం. మా కుటుంబ సభ్యుల సహకారంతోనే నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. మాకు రోజుకు కనీసం 7-8 ఆర్డర్లైనా వస్తాయి. 15కు మించి ఆర్డర్లు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఖర్చులన్నీ పోను నెలకు సుమారు లక్ష రూపాయలకు పైగా లాభం వస్తోంది. ప్రస్తుతం మేం నోయిడా కేంద్రంగా ఈ వ్యాపారం నిర్వహిస్తున్నాం. అయితే మాకు కశ్మీర్‌ నుంచే 80 శాతం ఆర్డర్లు వస్తున్నాయి. అందుకే త్వరలోనే అక్కడ ఒక స్టోర్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం’ అని తన సక్సెట్‌ సీక్రెట్‌ను పంచుకుంది రిదా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్