ఒడిశా ‘ప్యాడ్‌ వుమన్’!

సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందుకెళుతున్నా... ఆడవారికి సంబంధించిన కొన్ని మూఢనమ్మకాలు వారిని వెనక్కు లాగుతూనే ఉన్నాయి. అలాంటి విషయాల్లో ‘నెలసరి’ కూడా ఒకటి. మనదేశంలో కొన్ని చోట్ల అయితే ఈ సమయంలో మహిళలపై ఉండే ఆంక్షలకు హద్దే ఉండదు.

Published : 31 Aug 2021 17:17 IST

(Photo: Twitter)

సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందుకెళుతున్నా... ఆడవారికి సంబంధించిన కొన్ని మూఢనమ్మకాలు వారిని వెనక్కు లాగుతూనే ఉన్నాయి. అలాంటి విషయాల్లో ‘నెలసరి’ కూడా ఒకటి. మనదేశంలో కొన్ని చోట్ల అయితే ఈ సమయంలో మహిళలపై ఉండే ఆంక్షలకు హద్దే ఉండదు. అంతేకాదు.. కొన్ని వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలకు నెలసరి సమయంలో పాటించే పరిశుభ్రత గురించి తెలియక ఎన్నో అనారోగ్యాలకు సైతం గురవుతుంటారు. ఇంకొంతమంది మహిళలు శ్యానిటరీ న్యాప్‌కిన్ల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసినా.. వాటిని కొనలేని పరిస్థితుల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో తనచుట్టూ ఉండే మహిళలెవరికీ ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి రాకూడదంటోంది ఒడిశా ‘ప్యాడ్‌వుమన్‌’ అనుశ్రీ దాష్.

69 శాతం మంది వాటినే వాడుతున్నారు!

నెలసరి సమయంలో క్లాత్స్‌, రగ్స్‌... వంటివి వాడడం వల్ల అవి ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే ఈ మాటల్ని పెడచెవిన పెట్టి వాటినే వాడుతున్న ఆడవారు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అలాంటి వాటిలో ఒడిశా కూడా ఒకటి. ఆ రాష్ట్ర మహిళా జనాభా మొత్తంలో సుమారు 69 శాతం మంది ఆడవారు నెలసరి సమయంలో క్లాత్‌, రగ్స్‌నే వాడుతున్నారని ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS)’ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒడిశా మహిళలు నెలసరి విషయంలో ఎంత వెనకబడి ఉన్నారో!. ముఖ్యంగా ఒడిశా పారిశ్రామిక రాజధానిగా చెప్పుకునే రూర్కెలా...దీని చుట్టు పక్కల ప్రాంతాల్లోని మహిళలు పిరియడ్స్‌ను ఇంకా సామాజిక రుగ్మతగానే భావిస్తున్నారు.

‘నెలసరి’ అనేది సహజం!

ఈ క్రమంలో ఒడిశా మహిళల్లో మార్పు తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తోంది అనుశ్రీ. ‘పిరియడ్స్ ఆర్‌ నార్మల్‌’ (నెలసరి అనేది సహజం) అనే ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టి నెలసరిపై అక్కడి మహిళల్లో ఉన్న అపోహలన్నీ తొలగిస్తోంది. అదేవిధంగా ‘ట్రెజర్ బాక్స్‌’ పేరిట పేద మహిళలకు నెలసరి పరిశుభ్రతా కిట్లను ఉచితంగా అందజేస్తోంది. మూడు ప్యాకెట్ల శానిటరీ న్యాప్‌కిన్లు, ఒక జత లోదుస్తులు, ఒక శానిటైజర్‌ బాక్స్‌, ఒక సబ్బు ఈ కిట్‌లో ఉంటాయి. గత ఆరునెలల కాలంలో సుమారు 5వేల మంది మహిళలకు ఈ ‘ట్రెజర్ బాక్స్‌’ కిట్లను పంపిణీ చేసిందీ ప్యాడ్‌ వుమన్.

అందుకే ఈ క్యాంపెయిన్!

బెంగళూరులోని ఓ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ సంస్థకు వ్యవస్థాపకురాలిగా ఉన్న అనుశ్రీ గతేడాదే ఒడిశాకు వచ్చింది. అప్పుడే నెలసరికి సంబంధించి అక్కడి మహిళల్లో ఉన్న అపోహలను గమనించింది. ‘ఇక్కడకు వచ్చిన మొదట్లో మా ఇంట్లో పనిచేయడానికి వచ్చిన మహిళలను గమనించాను. నెలసరి సమయంలో వారందరూ క్లాత్స్‌, రగ్స్‌ వాడుతున్నారని తెలిసింది. అన్ని జీవక్రియల్లాగే పిరియడ్స్ అనేవి కూడా ఒక సహజ ప్రక్రియ. కానీ ఇక్కడి మహిళలు వీటి గురించి మాట్లాడేందుకు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అందుకే ‘పిరియడ్స్ ఆర్ నార్మల్‌’ అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించాను. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు నెలసరి పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, పేద మహిళలకు శానిటరీ కిట్లను అందజేయడమే ఈ క్యాంపెయిన్‌ ముఖ్య ఉద్దేశం’ అని అంటోందీ సూపర్‌ వుమన్.

‘ట్రెజర్ బాక్స్‌’ అన్న పేరు అందుకే!

గత ఆరు నెలల కాలంలో సుమారు 5 వేల మంది మహిళలకు పైగా తన  ‘ట్రెజర్ బాక్స్’ కిట్లను పంపిణీ చేసింది అనుశ్రీ. ఈ కిట్లను ‘ట్రెజర్ బాక్స్’ అని ఎందుకు పిలుస్తున్నారంటే... ‘పిరియడ్స్‌ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు భయపడే మహిళలందరికీ ఈ బాక్స్ ఎంతో ఉపయోగపడుతుంది. నెలసరి సమయంలో వారు అసౌకర్యానికి గురికాకుండా సహకరిస్తుంది. అందుకే దీనికి నేను ‘ట్రెజర్ బాక్స్’ అని పేరు పెట్టాను’ అని చెబుతుంది అనుశ్రీ.

క్యాంపెయిన్‌, శానిటరీ కిట్లకు అవసరమయ్యే మొత్తాన్ని చాలావరకు సొంతంగానే భరిస్తోంది అనుశ్రీ. అయితే మరింతమంది మహిళలకు తన కిట్లను చేరవేసేందుకు క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల సహాయం కోరుతోంది. ఈ క్రమంలో ‘మిలాప్‌’ అనే క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో ‘స్పాన్సర్‌ ఏ గర్ల్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించిందీ ఒడిశా ప్యాడ్‌ వుమన్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్