చలికాలంలో చిక్కటి పెరుగు ఇలా..!

సాధారణంగా మిగతా సమయాలతో పోలిస్తే శీతాకాలంలో పెరుగు అంత తొందరగా తోడుకోదు. ఒకవేళ తోడుకున్నా ఒక్కోసారి అడుగున పాలలానే ఉంటుంది. చలిగాలుల వల్ల వాతావరణంలో తగ్గే ఉష్ణోగ్రతే దీనికి కారణం. ఈ క్రమంలో- చలికాలంలో కూడా పెరుగు గట్టిగా తోడుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి చిట్కాలు పాటించాలి?? తెలుసుకుందాం రండి..!

Published : 05 Dec 2021 16:54 IST

సాధారణంగా మిగతా సమయాలతో పోలిస్తే శీతాకాలంలో పెరుగు అంత తొందరగా తోడుకోదు. ఒకవేళ తోడుకున్నా ఒక్కోసారి అడుగున పాలలానే ఉంటుంది. చలిగాలుల వల్ల వాతావరణంలో తగ్గే ఉష్ణోగ్రతే దీనికి కారణం. ఈ క్రమంలో- చలికాలంలో కూడా పెరుగు గట్టిగా తోడుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి చిట్కాలు పాటించాలి?? తెలుసుకుందాం రండి..!

పెరుగు తయారీ ఇలా..!

ఒక పాత్రలోకి పాలను తీసుకుని బాగా మరిగించాలి. కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో రెండు స్పూన్ల పెరుగు వేసి కలపాలి. ఈ పాత్రను కదపకుండా అలాగే 5 నుంచి 6గంటలు పక్కన ఉంచితే పెరుగు సిద్ధమైపోతుంది. సాధారణంగా అయితే ఈ పద్ధతిలో సులభంగానే పెరుగు తయారైపోతుంది కానీ చలికాలంలో ఒక్కోసారి ఇలా జరగకపోవచ్చు.

గట్టిగా తోడుకోవాలంటే..

* పెరుగు గట్టిగా, చిక్కగా, కమ్మగా ఉండాలంటే మనం తోడుకు ఉపయోగించే పెరుగు కూడా అలాగే ఉండాలి.

* అలాగే పెరుగు తోడుపెట్టడానికి ఉపయోగించే పాలు కూడా నాణ్యమైనవై ఉండాలి. అంటే నీటి శాతం ఎక్కువగా ఉండి పలుచగా ఉంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది గట్టిగా తోడుకోకపోవచ్చు.

* పాలల్లో పెరుగు వేసే ముందు అవి గోరువెచ్చగా ఉన్నాయో, లేదో చెక్‌ చేసుకోవాలి. ఎందుకంటే మరీ వేడిగా ఉన్న పాలల్లో పెరుగు వేస్తే అది అంత చిక్కగా, కమ్మగా ఉండకపోవచ్చు. అంతేకాకుండా పెరుగు కాస్త జిగురుగా, నీళ్లలా కూడా అనిపించే అవకాశం ఉంటుంది.

పరిసరాలు బాగా చల్లగా ఉంటే..

* సాధారణంగా పెరుగు తోడుకోవాలంటే గది ఉష్ణోగ్రత 37 నుంచి 45 డిగ్రీల మధ్య ఉండాలి. కానీ చలికాలంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావు. అందుకే ఆ వెచ్చదనాన్ని కలిగించడానికి మనమే బయటి నుంచి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

* పెరుగు తోడుపెట్టిన తర్వాత ఆ పాత్రని ఒక దళసరి లేదా వూలు వస్త్రంతో చుట్టేయాలి. గాలి లోపలికి చొరబడకుండా మూత పెట్టాలి.

* చలిగాలులు తగిలే చోట పెట్టకుండా కాస్త వెచ్చగా ఉండే ప్రదేశంలో ఆ పాత్రని ఉంచాలి. అప్పుడే పెరుగు గట్టిగా తోడుకునే అవకాశం ఉంటుంది.

* మీ ఇంట్లో ఒవెన్ ఉందా?? అయితే దాన్ని ఒక రెండు నిమిషాల పాటు 180డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి కట్టేయండి. ఇప్పుడు అందులో పెరుగు తోడుపెట్టిన పాత్రను ఉంచి 6 నుంచి 7 గంటలు లేదా రాత్రంతా అలా వదిలేస్తే ఉదయానికి పెరుగు గట్టిగా తోడుకుంటుంది.

* వంటగదిలో బియ్యం డబ్బాలో కూడా ఈ పాత్రను ఉంచితే వెచ్చగా ఉండటంతో పాటు పెరుగు గట్టిగా తోడుకుంటుంది. కానీ పాత్రని జాగ్రత్తగా కవర్ చేయడం మాత్రం మరవద్దు.

* ఇదేవిధంగా పెరుగు తోడుపెట్టిన పాత్రని థర్మాకోల్‌తో చేసిన బాక్సులో పెట్టినా కాస్త వెచ్చగా ఉంటుంది. కాబట్టి పెరుగు గట్టిగా తోడుకుంటుంది. లేదా ఇన్సులేటెడ్ పాత్రలు/హాట్‌ పాట్‌లో పెరుగు తోడుపెట్టడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్