ఫ్రీజర్‌లో ఐస్‌ పేరుకుపోతోందా?

తరచూ డీఫ్రాస్ట్‌ చేసినా ఫ్రీజర్‌లో ఐస్‌ పేరుకుపోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇక దాన్ని తొలగించడం పెద్ద పని. మరి దాన్ని అలాగే వదిలేస్తే అందులో భద్రపరిచే ఆహార పదార్థాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలే ఎక్కువంటున్నారు నిపుణులు.

Published : 27 Oct 2021 18:44 IST

తరచూ డీఫ్రాస్ట్‌ చేసినా ఫ్రీజర్‌లో ఐస్‌ పేరుకుపోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇక దాన్ని తొలగించడం పెద్ద పని. మరి దాన్ని అలాగే వదిలేస్తే అందులో భద్రపరిచే ఆహార పదార్థాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలే ఎక్కువంటున్నారు నిపుణులు. అందుకే కొన్ని చిట్కాలు పాటించి ఫ్రీజర్‌లో ఐస్‌ పేరుకుపోకుండా జాగ్రత్తపడడంతో పాటు ఫ్రిజ్‌నూ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

గాలిలోని తేమ ఫ్రిజ్‌లో ఉండే కాయిల్స్‌తో కలవడం వల్ల ఐస్‌ తయారవుతుంది. ఇది క్రమంగా పెరగడం వల్ల ఫ్రీజర్‌లో స్థలం వృథా అవడంతో పాటు కొన్నాళ్ల తర్వాత అందులో నుంచి దుర్వాసనలు వచ్చే ప్రమాదమూ ఉందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇది ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహార పదార్థాల పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పదార్థాల్లోని తేమను తొలగించి.. వాటిని పొడిగా, గట్టిగా, అవి రంగు-రుచి కోల్పోయేలా చేస్తుంది. దీన్నే ‘Freezer Burn’ అంటారు.

ఇలా చేస్తే ఐస్‌ పేరుకుపోదు!

ఇలా ఫ్రిజ్‌ పరిశుభ్రతను దెబ్బతీస్తూ, అందులో నిల్వ చేసిన ఆహార పదార్థాలు తాజాదనాన్ని కోల్పోయేలా చేసే ఈ సమస్యను నివారించుకోవడం మన చేతుల్లోనే ఉందంటున్నారు నిపుణులు. అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు.

పదే పదే తీయద్దు!

మాటిమాటికీ ఫ్రిజ్‌ డోర్‌ తీయడం చాలామందికి అలవాటు. ఇక ఇంట్లో ఉండే చిన్న పిల్లలైతే ఆటలంటూ అదే పనిగా డోర్‌ తీసి పెడుతుంటారు. దీనివల్ల ఫ్రిజ్‌లోని చల్లటి గాలి బయటికి వెళ్లిపోయి.. తేమతో కూడిన గాలి లోపలికి ప్రవేశిస్తుంది. ఇది ఐస్‌గా మారుతుంది. అంతేకాదు.. పదే పదే ఫ్రిజ్‌ డోర్‌ తెరవడం వల్ల ఫ్రిజ్‌ లోపలి ఉష్ణోగ్రతలు పెరిగిపోయి దాని పనితీరు క్రమంగా తగ్గే అవకాశాలూ లేకపోలేదంటున్నారు నిపుణులు. అందుకే ఈ అలవాటు మానుకోవడం మంచిదంటున్నారు. ఈ క్రమంలో అవసరమున్న వస్తువులన్నీ ఒకేసారి తీసుకోవడం, తిరిగి ఒకేసారి అందులో పెట్టుకోవడం వల్ల సమస్యను కొంత వరకు తగ్గించుకోవచ్చు. అలాగే ఫ్రిజ్‌ డోర్‌ తీశాక ఎక్కడ ఏది పెట్టామో చెక్‌ చేసుకోవడం కంటే.. ముందే ఓ క్రమపద్ధతిలో పదార్థాల్ని అమర్చుకోవడం మంచిది.

ఖాళీగా ఉంచినా.. నింపేసినా..!

ఫ్రీజర్‌లో కొంతమంది కొన్ని పదార్థాలే పెడుతుంటారు.. మరికొందరు అందులో ఖాళీ లేకుండా నింపేస్తుంటారు. ఐస్‌ పేరుకుపోవడానికి ఈ రెండూ కారణమే అంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకొని.. అందులో నిల్వ చేసే పదార్థాలు మరీ ఎక్కువగా, మరీ తక్కువగా కాకుండా చూసుకోవడం ముఖ్యం. అలాగే వేడిగా/గోరువెచ్చగా ఉన్న పదార్థాలు కూడా ఫ్రీజర్‌లో పెట్టకూడదు. ఎందుకంటే వాటిలోని వేడి/హ్యుమిడిటీ వల్ల ఐస్‌ పేరుకుపోతుంది. కాబట్టి అవి గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చే దాకా బయటే ఉంచి.. ఆ తర్వాత సాధారణ ఫ్రిజ్‌లో కాసేపు పెట్టి.. అప్పుడు ఫ్రీజర్లో పెట్టాల్సి ఉంటుంది.

పూర్తిగా ఆరాకే..!

పాల ప్యాకెట్‌, కాయగూరలు, ఇతర ప్యాకేజ్‌డ్‌ ఫుడ్స్‌.. వీటిని కొని ఇంటికి తెచ్చాక నీటితో కడగడం మనకు అలవాటే! అయితే కడిగిన వెంటనే తడిగా ఉండగానే వీటిని ఫ్రీజర్‌లో అమర్చుతుంటారు కొందరు. దీనివల్ల ఆ తేమ ఐస్‌గా మారుతుంది. ఇదే క్రమంగా ఎక్కువై పేరుకుపోతుంది. అందుకే వీటిని పూర్తిగా ఆరిన తర్వాతే ఫ్రీజర్‌లో పెట్టమంటున్నారు నిపుణులు. ఒకవేళ వెంటనే పెట్టాలనుకుంటే మాత్రం పొడి వస్త్రంతో తుడిచి ఆపై అందులో అమర్చడం మంచిది.


ఇవి కూడా!

* ఫ్రిజ్‌లో మనం సెట్‌ చేసుకునే ఉష్ణోగ్రతను బట్టి కూడా ఫ్రీజర్‌లో ఐస్‌ పేరుకుపోకుండా నివారించచ్చు. ఈ క్రమంలో ఏ కాలంలోనైనా ఫ్రీజర్‌ ఉష్ణోగ్రతను 0 డిగ్రీల ఫారన్‌ హీట్‌ (-18 డిగ్రీల సెంటీగ్రేడ్‌)గా, అలాగే మెయిన్ ఫ్రిజ్‌లో 37-40 డిగ్రీల ఫారన్‌ హీట్‌ (3-4 డిగ్రీల సెంటీగ్రేడ్‌)గా ఉండేలా సెట్‌ చేసుకోవాలి.

* ఫ్రీజర్లో నిల్వ చేసే పదార్థాల కోసం గాలి చొరబడని స్టోరేజ్‌ కంటెయినర్‌ బ్యాగ్స్‌ని ఎంచుకోవడం మంచిది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్రీజర్‌ బ్యాగ్స్‌/స్టోరేజ్‌ బ్యాగ్స్‌/కంటెయినర్స్‌ మార్కెట్లో దొరుకుతాయి. అలాగే పదార్థం పరిమాణాన్ని బట్టి వీటిని ఎంచుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే కొంచెం పదార్థానికి పెద్ద బ్యాగ్‌ ఉపయోగించినా.. మిగతా భాగమంతా ఖాళీగా, గాలితో నిండి ఉండే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఐస్‌ తయారవడానికి కారణం కావచ్చు.

మరి, ఫ్రీజర్‌లో ఐస్‌ పేరుకుపోకుండా మీరేం చేస్తున్నారు? మీరు పాటించే ఆ చిట్కాలేవో మాతో పంచుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్