Updated : 07/12/2021 19:55 IST

బీబీసీ మెచ్చిన మహిళలు!


(Photo: instagram/twitter)

సమస్య ఎక్కడో పుట్టదు.. మన చుట్టే వై-ఫైలా తిరుగుతుంటుంది.. అయితే దాన్ని పసిగట్టి పరిష్కార మార్గం కనుక్కున్న వారే ఈ సమాజానికి మార్గనిర్దేశనం చేయగలుగుతారు. ఇదే విషయం నిరూపిస్తున్నారు ఈ ఇద్దరు మహిళలు. ఈ సమాజంలో వేళ్లూనుకుపోయిన వివక్షలను, అసమానతల్ని తొలగిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తున్నారు. అందుకే వారి సేవల్ని గుర్తించిన బీబీసీ ఈ ఏడాది విడుదల చేసిన ‘వంద మంది స్ఫూర్తిదాయక, ప్రభావవంతమైన మహిళల జాబితా’లో వారికి చోటిచ్చి గౌరవించింది. మరి, వాళ్లెవరు? వాళ్లు చేస్తోన్న సేవలేంటో తెలుసుకుందాం రండి..

మంజులా ప్రదీప్‌, మానవ హక్కుల కార్యకర్త-లాయర్‌

వెనకబడిన కులాలు, తెగలంటే ఈ సమాజంలో ఎప్పటికీ చిన్నచూపే! చాలామంది వాళ్లను అంటరాని వారిగా పరిగణిస్తుంటారు. వాళ్లను తాకితే ఏదో పాపం చుట్టుకుంటుందన్న భ్రమలో ఉంటారు. ఇక స్కూల్లో పిల్లలైతే కులం పేరుతో తోటి విద్యార్థుల బుల్లీయింగ్‌కి గురవుతుంటారు. ఓ దళిత మహిళగా చిన్నతనం నుంచి తానూ ఇలాంటి ఎన్నో అవమానాలు, అవహేళనలు భరించానంటోంది గుజరాత్‌కు చెందిన మంజులా ప్రదీప్‌. ఇంటా, బయట ఎదురయ్యే ఇలాంటి సమస్యలు, సవాళ్లే తనను యాక్టివిస్ట్‌గా మార్చాయని చెబుతోంది.
‘గుజరాత్‌లోని వదోదరలో ఓ దళిత కుటుంబంలో పుట్టాను నేను. పుట్టుకతోనే నాన్న నుంచి తొలి వివక్షను ఎదుర్కొన్నా. ఎందుకంటే నా బదులు (రెండో సంతానంగా) కొడుకును ఎందుకు కనలేదని అమ్మను హింసించేవాడు. ఆ తర్వాత అతని నుంచి శారీరక, మానసిక హింస పెరిగిపోయింది. ఇక కుల వివక్ష కారణంగా స్కూల్లోనూ తోటి పిల్లల బుల్లీయింగ్‌కి గురయ్యాను. పిల్లలంతా ‘ABC’ అని పిలుస్తూ పదే పదే నా కులాన్ని ఎత్తిచూపేవారు.. నన్ను చూసి నవ్వుకునే వారు. ఇదంతా ఒక ఎత్తైతే.. చిన్నతనంలో లైంగిక హింసకు గురవడం నా మనసును తీవ్రంగా గాయపర్చింది. ఇలా ఇంటా, బయటా వివక్షతో విసుగెత్తిపోయిన నేను.. వాటికి ఎదురుతిరగాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే నా చదువును కొనసాగించా. బరోడాలోని ఓ యూనివర్సిటీలో సోషల్‌ వర్క్‌లో మాస్టర్స్‌ చేసిన నేను.. గుజరాత్‌ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నా. ఓ లాయర్‌గా దళిత మహిళలకు సంబంధించిన పలు కేసుల్ని వాదించా..’ అంటూ తన జీవితంలోని ఆటుపోట్ల గురించి పంచుకున్నారామె.

అత్యాచార బాధితులకు అండగా..!

2004 నుంచి ‘Navsarjan Trust’లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన మంజుల.. ఈ క్రమంలో కుల, లింగ వివక్షపై పోరాటం సాగించారు. దళిత మహిళల్ని విద్య, ఉపాధి దిశగా ప్రోత్సహించారు. శారీరక, మానసిక, లైంగిక హింస.. వంటి విషయాల్లో అవగాహన పెంచేందుకు పలు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు మంజుల. దళిత మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల గురించి వివిధ వేదికలపై తన గళాన్ని వినిపించారు. అంతేకాదు.. 2008లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ దళిత అమ్మాయి అత్యాచార కేసును టేకప్‌ చేసి.. దోషులకు శిక్షపడేలా చేయడంలో తనదైన పాత్ర పోషించారీ డేరింగ్‌ లేడీ. ఇలా ఆమె హయాంలోనే ఈ ట్రస్ట్‌ 2013లో ‘అడ్వొకసీ అండ్‌ ఎంపవర్‌మెంట్‌’ విభాగంలో ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సోషల్‌ ఇంపాక్ట్‌ అవార్డు’ గెలుచుకోవడం విశేషం.
ఆ తర్వాత ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ విమెన్‌ లీడర్స్‌’, ‘Wise Act of Youth Visioning and Engagement’.. వంటి సంస్థల్ని నెలకొల్పి.. వీటి ద్వారా అట్టడుగు వర్గాలకు చెందిన యువతను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారామె. మరోవైపు ‘International Dalit Solidarity Network’లో సభ్యురాలిగా కొనసాగుతోన్న మంజుల.. అంతర్జాతీయ వేదికల పైనా దళితుల హక్కులపై తన గళాన్ని వినిపిస్తున్నారు. ఇలా తన సేవలకు గుర్తింపుగా ‘ఉమన్‌ పీస్‌ మేకర్‌ అవార్డు’తో పాటు పలు పురస్కారాలు సైతం అందుకున్నారామె.

ముగ్ధా కల్రా, ఆటిజం యాక్టివిస్ట్‌

పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా తల్లులు తట్టుకోలేరు.. వాటిని అంగీకరించలేరు.. తర్వాత ఏం చేయాలన్న విషయంలోనూ ఓ స్పష్టత ఉండదు. నిజానికి ఇవన్నీ తల్లీబిడ్డలిద్దరికీ సవాళ్లేనని, వీటిని స్వీకరించినప్పుడే అసలైన పరిష్కారం దొరుకుతుందంటోంది ముగ్ధా కల్రా. తన పదకొండేళ్ల కొడుకు ఆటిజంతో బాధపడుతున్నాడన్న విషయం తెలుసుకొని ముందు బాధపడినా.. ఆ తర్వాత దీనికో పరిష్కారం కనుక్కోవాలన్న నిర్ణయానికొచ్చిందామె. ఈ క్రమంలోనే ‘Not That Different’ అనే ఉద్యమానికి తెరతీశారు. దీని ద్వారా ఆటిజం, న్యూరోడైవర్సిటీ (మెదడు పనితీరులోని వైవిధ్యం, దాన్ని బట్టి ప్రవర్తించే విధానం).. వంటి అంశాలపై పిల్లల్లో, తల్లుల్లో అవగాహన కల్పిస్తున్నారామె.

‘పిల్లలకేదైనా సమస్య వస్తే తల్లికి ప్రతిదీ సవాలుగానే కనిపిస్తుంది. ఉదాహరణకు.. ఆటిజం నిర్ధారణ అయితే.. దాన్ని అంగీకరించడం, దీని గురించి కుటుంబ సభ్యులు-స్నేహితులకు అర్థం చేయించడం, పిల్లల్ని థెరపిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లాలా లేదంటే సాధారణ వైద్యులకు చూపించాలా.. పిల్లల చదువు దెబ్బతింటుందేమో, మన కెరీర్‌ పాడవుతుందేమో.. ఇలా వీటన్నింటి గురించి ఓ నిర్ణయానికి రావడమంటే సవాలే అని చెప్పాలి. నా కొడుకు మాధవ్‌కి ఆటిజం నిర్ధారణ అయినప్పుడు నా పరిస్థితీ ఇదే! కానీ ఈ సమయంలో నేను నా కొడుకు వైపే మొగ్గు చూపాను. వాడు దీన్ని ఎదుర్కొని నలుగురిలో కలిసిపోవాలనే నా పూర్తి సమయాన్ని నా కొడుక్కే కేటాయించా.

నలుగురితో కలవనివ్వాలి!

ఈ క్రమంలో వాడితో ఎక్కువ సమయం గడపడం, నా ఫ్రెండ్స్‌-ఇతర కుటుంబ సభ్యులనూ వాడితో మాట్లాడడం/ఆడుకోమనడం వంటివి చేసేదాన్ని. మానసిక సమస్య ఉందన్న నెపంతో ఇంటికే పరిమితం చేయకుండా.. షాపింగ్‌/కాయగూరల మార్కెట్‌/థియేటర్స్‌.. ఇలా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లేదాన్ని. వివిధ రకాల థెరపీలు ఇప్పించా. నిజానికి ఆటిజం/ఇతర మానసిక సమస్యలతో బాధపడుతోన్న పిల్లలు ఇలా అందరితో కలుపుగోలుగా ఉంటే.. వాళ్ల మానసిక స్థితి మరింత మెరుగుపడుతుంది. అందుకే ఇలా నేను అనుసరించిన ఈ విషయాలన్నీ ఇలాంటి సమస్యలున్న పిల్లల తల్లులకు తెలియజేయాలనే ‘Not That Different’ పేరుతో పిల్లల నాయకత్వంలో ఉద్యమాన్ని ప్రారంభించా. ఇదే పేరుతో ఓ కామిక్‌ పుస్తకాన్ని సైతం విడుదల చేశా. మరోవైపు ఆయా అంశాలపై నా వెబ్‌సైట్‌/బ్లాగ్‌లోనూ వ్యాసాలు రాస్తుంటా..’ అంటూ తన జర్నీ గురించి పంచుకుందీ బ్రేవ్‌ మామ్‌.

సుమారు రెండు దశాబ్దాలుగా బ్రాడ్‌క్యాస్టింగ్‌ రంగంలో పనిచేస్తోన్న ముగ్ధ.. ఈ క్రమంలో టీవీ ప్రజెంటర్‌గా, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ రైటర్‌గా.. కొనసాగుతోంది. మరోవైపు Bakstage అనే లైవ్‌స్ట్రీమింగ్‌ యాప్‌కు చీఫ్‌ కంటెంట్‌ స్ట్రాటజిస్ట్‌గానూ వ్యవహరిస్తోంది.

వీరితో పాటు మలాలా యూసఫ్‌జాయ్‌, మెలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌.. వంటి ప్రముఖులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక వంద మందితో కూడిన ఈ లిస్టులో దాదాపు సగం మంది దాకా అఫ్ఘానిస్తాన్‌కు చెందిన అమ్మాయిలు/మహిళలు చోటు దక్కించుకోవడంతో వారి ప్రతిభాపాటవాలు, శక్తియుక్తులు మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని