Updated : 08/01/2022 19:49 IST

వాళ్ల కోసం చిప్స్ ప్యాకెట్లతో దుప్పట్లు తయారుచేస్తోంది!

(Photos: Facebook)

రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌పై పడుకొనే నిరుపేదలు చలికి తట్టుకోలేక ఫ్లెక్సీలు, కవర్లు కప్పుకొని పడుకోవడం చూసి చలించిపోతాం. అలాంటి వారికి వెంటనే ఓ దుప్పటి కొనిస్తాం. లేదంటే  తోచినంత డబ్బిస్తాం. యూకేకు చెందిన అలిస్సా డీన్ కూడా ఇలాగే దుప్పట్లు పంచిపెడుతోంది. అయితే అందులో కొత్తేముంది.. అని ఆలోచిస్తున్నారా? నిజానికి అవి బయట మార్కెట్లో కొనుగోలు చేసినవి కాదు.. తానే చేత్తో స్వయంగా తయారుచేసినవి! అందులోనూ ఖాళీ చిప్స్‌ ప్యాకెట్స్‌ని సేకరించి మరీ అలిస్సా ఈ బ్లాంకెట్స్‌ని తయారుచేయడం గమనార్హం. మరి, ఈ యంగ్‌ గర్ల్‌కి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి..

అలిస్సా డీన్‌.. 11 ఏళ్ల ఈ అమ్మాయి యూకేలోని Prestatynలో నివసిస్తుంటుంది. తనకు పర్యావరణమంటే ఎనలేని ప్రేమ. మరోవైపు సమాజ సేవ చేయడమన్నా మక్కువే! అయితే స్కూలుకెళ్లేటప్పుడు, ఇతర పనుల రీత్యా బయటికి వెళ్లే క్రమంలో రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై చలికి వణుకుతూ బతుకీడుస్తోన్న నిరాశ్రయుల్ని చూసి చలించిపోయిందామె. వాళ్ల కోసం తన వంతుగా ఏదైనా సహాయం చేయాలని నిర్ణయించుకుంది.

పర్యావరణహితంగా సేవ!

ఇలా ఆలోచిస్తోన్న క్రమంలోనే చిప్స్‌ ప్యాకెట్స్‌ని బ్లాంకెట్స్‌గా మలచాలన్న ఆలోచన వచ్చింది అలిస్సాకు. ఇలా చేస్తే పర్యావరణానికీ మేలు జరుగుతుందని భావించిన ఆమె.. అనుకున్నదే తడవుగా తన ఐడియాకు కార్యరూపమిచ్చింది. అయితే ఇందుకోసం ముందుగా ఖాళీ చిప్స్‌ ప్యాకెట్స్‌ని సేకరించడం మొదలుపెట్టింది. ఆపై వీటిని ఇస్త్రీ చేసి.. ఒకదానికొకటి కలిపి కుట్టి బ్లాంకెట్‌లా తయారుచేస్తోంది అలిస్సా. ఇలా ఒక బ్లాంకెట్‌ తయారుచేయడానికి సుమారు 44 చిప్స్‌ ప్యాకెట్స్‌ అవసరమవుతున్నాయని చెబుతోందీ ఎకో లవర్.

‘నాకు పర్యావరణమంటే చిన్నప్పట్నుంచీ ఎంతో ఇష్టం. పేదలకు సేవ చేయడానికి ప్రస్తుతం నేను ఎంచుకున్న ఈ మార్గం కూడా పర్యావరణహితమైనదే కావడంతో మరింత హ్యాపీగా ఉంది. నేను తయారుచేస్తోన్న బ్లాంకెట్స్‌ ఒక్కో దానికి 44 చిప్స్‌ ప్యాకెట్స్‌ అవసరమవుతున్నాయి.. ఇందుకు సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఇవి ఎలాంటి వాతావరణం నుంచైనా రక్షణ కల్పించగలవు..’ అంటోంది అలిస్సా.

‘కేర్‌ ప్యాకేజ్‌’లో ఏమున్నాయంటే..!

ఇలా తయారుచేసిన బ్లాంకెట్స్‌ని నేరుగా ఇవ్వడం కాకుండా.. చలికి తట్టుకునేలా మరిన్ని వస్తువులు దీనికి జోడించి ఆకర్షణీయంగా ప్యాక్‌ చేసి మరీ అందిస్తోందీ యూకే టీన్‌. బ్లాంకెట్‌తో పాటు హ్యాట్స్‌, గ్లోవ్స్, సాక్స్‌లు, చాక్లెట్‌.. వంటివన్నీ కలిపి ‘కేర్‌ ప్యాకేజ్‌’లా ప్యాక్‌ చేసి అందిస్తోంది. ఇక బ్లాంకెట్స్‌ తయారీ, ప్యాకింగ్‌ విషయాల్లో తన తల్లి, స్నేహితుల సహకారం కూడా ఉందంటోంది. తొలుత పార్శిల్‌ ప్యాకింగ్‌ కోసం తన పాకెట్‌ మనీనే ఉపయోగించిన అలిస్సా.. ప్రస్తుతం తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా నిధులు సమీకరిస్తోంది. కేవలం ఇదనే కాదు.. తన పాత దుస్తులు, వస్తువుల్ని కూడా అప్పుడప్పుడూ పేదలకు విరాళంగా అందించడం ఈ అమ్మాయికి అలవాటే!

ఇలా తన సేవతోనే కాదు.. తన క్యూట్‌ లుక్స్‌తోనూ అందరినీ కట్టిపడేస్తోంది అలిస్సా. ఈ క్రమంలోనే ‘మిస్‌ నార్త్‌ వేల్స్‌ ప్రిటీన్‌’ అందాల కిరీటం కూడా గెలుచుకుంది.

మరి, ఇంత చిన్న వయసులోనే పెద్ద మనసుతో సమాజం కోసం ఆలోచిస్తూ అలిస్సా చేస్తోన్న పని ఎంతోమందికి ఆదర్శం కదూ!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని