Updated : 18/12/2021 21:53 IST

త్రివిక్రముడి సహచర్యంలో.. నృత్య 'సౌజన్యం'!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకనిర్మాతల భార్యలు కెమెరా ముందుకు రావడమే అరుదు! అయితే సెలబ్రిటీ స్టేటస్‌తో సంబంధం లేకుండా.. తమదైన ట్యాలెంట్‌తో గుర్తింపు సంపాదించాలనుకునే స్టార్‌ వైవ్స్‌ లేకపోలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సతీమణి సౌజన్య కూడా ఇందుకు మినహాయింపు కాదు. గృహిణిగా ఇంటి బాధ్యతలు, తల్లిగా ఇద్దరు పిల్లల ఆలనా పాలన చూస్తూనే.. మరోవైపు తన ప్రాణప్రదమైన భరతనాట్యంలోనూ రాణిస్తున్నారామె. ఇందుకు తాజా ఉదాహరణే శిల్పకళా వేదికగా తానిచ్చిన ‘మీనాక్షీ కల్యాణం’ నృత్యరూపకం! తన తపనకు భర్త ప్రోత్సాహం కూడా తోడైతే ప్రతి మహిళా కెరీర్‌లో విజయం సాధించగలదంటోన్న ఆమె తన నాట్య ప్రయాణాన్ని ఓ సందర్భంలో ఇలా పంచుకున్నారు.

నాట్యమంటే మక్కువ!

శాస్త్రీయ నృత్యమంటే నాకు చిన్నతనం నుంచే ఆసక్తి. ఈ క్రమంలోనే స్కూల్లో, కాలేజ్‌లో పలు నృత్య ప్రదర్శనలిచ్చాను. ఇక డిగ్రీ పూర్తయ్యాక పెళ్లవడంతో హైదరాబాద్‌ చేరుకున్నా. ఇక్కడికొచ్చాకా నృత్యాన్ని కొనసాగించాలన్న పట్టుదలతో గురువుల కోసం నెట్‌లో వెతికేదాన్ని. ఈ క్రమంలో మా వారూ నాకు సహాయపడేవారు.

తొలి ప్రదర్శన అప్పుడే!

గురువు పసుమర్తి రామలింగ శాస్త్రి దగ్గర రెండేళ్ల పాటు నృత్యం నేర్చుకున్న తర్వాత వేదికపై ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టా. అలా 2018లో రవీంద్రభారతిలో నా తొలి నృత్య ప్రదర్శన జరిగింది. నృత్య కార్యక్రమం పూర్తయ్యాక మా వారు నా దగ్గరికొచ్చి ‘ప్రౌడ్‌ ఆఫ్‌ యూ’ అనడం, పెదనాన్న (సిరివెన్నెల సీతారామశాస్త్రి) చప్పట్లతో ప్రశంసించడం.. ఇలా వీళ్లిద్దరి అభినందనలు నాకెప్పటికీ ప్రత్యేకమే!

ఆయనే నా ఎనర్జీ బూస్టర్!

ఒకటి, రెండు కాదు.. ప్రతి విషయంలోనూ నాకు మా వారి ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది. మొదట్లో పిల్లలు పెద్దవాళ్లయ్యాక మళ్లీ నృత్యం వైపు వెళ్తే బాగుండదేమోనని సందేహించా. అప్పుడూ మా వారే వెన్నుతట్టారు. ఒక దశలో నాలో ఉన్న స్టేజ్‌ ఫియర్‌ని పోగొట్టిందీ మా ఆయనే! ‘అనుకున్న పని పూర్తిచేయగలను అని మనసులో అనుకో.. తప్పకుండా సాధించగలవు!’ అంటూ నాలో ఆత్మవిశ్వాసం నింపుతుంటారాయన.

ఇంటిని-కెరీర్‌ని అలా బ్యాలన్స్ చేస్తా!

ఇంటి పనులు, పిల్లల బాధ్యత, నృత్య ప్రదర్శనలు.. ఇలా అన్నింటినీ బ్యాలన్స్‌ చేయాలంటే కష్టమే! కానీ ఇక్కడా మా ఆయన సలహాలే పాటిస్తుంటా. ‘పనులన్నీ ఒకేసారి చేయాలనుకోకు. ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేయి. అలాగే ఒకసారి ఒకే లక్ష్యం పెట్టుకో.. సాధించగలుగుతావ్‌!’ అని చెబుతుంటారు. అంతే.. ఎంత హడావిడిలో, ఒత్తిడిలో ఉన్నా రిలాక్సైపోతా!

నా చేతి కాఫీ ఇష్టం!

మాట్లాడితే నాట్యం అంటున్నాననుకోకండి. నేను కాఫీ చాలా బాగా పెడతా. నా చేతి కాఫీ అంటే మా ఆయనకు చాలా ఇష్టం. ఇక తను తీసిన సినిమాలంటే నాకూ ఇష్టమే! అయితే ప్రివ్యూకి మాత్రం వెళ్లను. విడుదలయ్యాక థియేటర్లో జనం మధ్యలో కూర్చొని చూడటానికే ఇష్టపడతా! మేమిద్దరం కలిసి చూసిన మొదటి సినిమా ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’. అది నాకెప్పుడూ ప్రత్యేకమే!

యోగాతో ఫిట్‌నెస్!

ఇక శారీరక ఫిట్‌నెస్‌ కోసం యోగా సాధన చేస్తా. నా అభిమాన నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి. ఎప్పటికైనా ఆ స్థాయికి వెళ్లాలనేదే నా లక్ష్యం. ఇక నేను వేసే కృష్ణుడి వేషం, అభినయం మా వారికి చాలా చాలా ఇష్టం.

అప్పుడు చిన్నపిల్లనైపోతా!

మా వారికి పురాణేతిహాసాలపై మంచి పట్టుంది. అందుకే నాట్య ప్రదర్శనలకు సంబంధించి నేను ఎంచుకునే కాన్సెప్టులు, సందేహాలు ఆయన్నే అడిగి తెలుసుకుంటా. నాకే కాదు.. పిల్లలకూ పురాణ కథలు చెబుతుంటారు. అప్పుడు నేనూ చిన్నపిల్లనై వాళ్లతో కలిసిపోయి వింటుంటా. పిల్లలకు చదువొక్కటే కాదు.. కుటుంబ విలువల్నీ నేర్పాలంటారాయన.Advertisement

మరిన్ని