Maye Musk: అప్పుడు నా పిల్లల ఆకలి తీర్చడానికి అష్టకష్టాలు పడ్డా!

‘అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!’ అంటుంటారు. జీవితంలో ఎంత ఎదిగినా తాను తల్లి చాటు బిడ్డనన్న విషయం ఏ కొడుకూ/కూతురూ మర్చిపోరు. అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ కూడా ఇటీవల ఇదే విషయం నిరూపించాడు. తన తల్లి మయే మస్క్‌తో....

Published : 08 May 2022 09:36 IST

(Photos: Instagram)

‘అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!’ అంటుంటారు. జీవితంలో ఎంత ఎదిగినా తాను తల్లి చాటు బిడ్డనన్న విషయం ఏ కొడుకూ/కూతురూ మర్చిపోరు. అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ కూడా ఇటీవల ఇదే విషయం నిరూపించాడు. తన తల్లి మయే మస్క్‌తో కలిసి మెట్‌ గాలాలో సందడి చేశాడు. అమ్మ చేయి పట్టుకొని రెడ్‌ కార్పెట్‌పై ఫొటోలకు పోజులివ్వడమే కాదు.. తన స్టేటస్‌ని కాసేపు పక్కన పెట్టి.. తల్లితో కలిసి నవ్వుతూ, తుళ్లుతూ చిన్న పిల్లాడిలా మారిపోయాడు.

నిజానికి తాను, తన తోబుట్టువులు ఇప్పుడీ స్థాయికి చేరుకోవడానికి అమ్మ పడిన కష్టమే అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు మస్క్. మయే కూడా భర్త తోడు లేకపోయినా ఒంటరి తల్లిగానే తన పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఓ మేటి ఫ్యాషన్‌ మోడల్‌గా మాత్రమే ప్రస్తుతం ఆమె ఈ ప్రపంచానికి తెలుసు.. కానీ తాను, తన పిల్లలు ఈ స్థాయికి చేరుకోవడానికి తెర వెనుక ఆమె పడిన కష్టం తన వాళ్లకు మాత్రమే తెలుసు! ఎన్ని కష్టాలెదురైనా అమ్మగా సక్సెసైన మయే మస్క్‌ గురించి ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

తల్లిదండ్రుల స్ఫూర్తితో..!

కెనడాలోని రెజీనా పట్టణంలో 1948లో జన్మించారు మయే మస్క్‌. తన ఐదుగురు తోబుట్టువుల్లోకెల్లా తన కవల సోదరి కాయేతో ఆమెది ప్రత్యేకమైన బంధం. మయే తల్లిదండ్రులు హెల్త్‌కేర్‌ బిజినెస్‌లో రాణించారు. అంతేకాదు.. వారికి సాహస కృత్యాలంటే ప్రాణం. ఈ మక్కువతోనే పిల్లలతో కలిసి పలు సాహసాలు చేసేవారు.

‘ఓసారి మా తోబుట్టువులం కలిసి అమ్మానాన్నలతో కలహరి ఎడారిలో షికారుకి వెళ్లాం. అక్కడ హైనా జంతువుల బారిన పడకుండా మమ్మల్ని మేం కాపాడుకోవడానికి స్లీపింగ్‌ బ్యాగ్స్‌లో నిద్రించేవాళ్లం..’ అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాల్ని ఓ సందర్భంలో నెమరు వేసుకున్నారు మయే. నిజానికి ఇలా తన తల్లిదండ్రులతో కలిసి చేసిన ఇలాంటి సాహస యాత్రలే తనను ఏదైనా చేయగలిగేంత ధైర్యవంతురాలిగా మార్చాయని చెబుతారామె.

మోడల్‌గా సక్సెసై..!

తల్లిదండ్రుల స్ఫూర్తితో అందిపుచ్చుకున్న ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పదిహేనేళ్ల ప్రాయంలోనే తనకిష్టమైన మోడలింగ్ వైపు అడుగులేశారు మయే. ఈ క్రమంలోనే ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్ల కోసం పని చేశారు. మరోవైపు పలు క్యాటలాగ్‌ ముఖచిత్రాలపై మెరిశారు. టీనేజ్ లోనే ‘మిస్‌ సౌతాఫ్రికా బ్యూటీ కాంపిటీషన్’లో ఫైనలిస్ట్‌గా నిలిచారు. ఇలా ఒక దశలో పాపులర్‌ మోడల్‌గా వెలుగు వెలిగిన మయే.. 1970లో ఎరోల్‌ మస్క్‌తో వివాహమవడంతో కొన్నేళ్ల పాటు మోడలింగ్‌కు దూరమయ్యారు.

వీగిపోయిన వివాహ బంధం!

హైస్కూల్‌లో ఉన్నప్పుడే ఎరోల్‌ను కలుసుకున్నారు మయే. అతనో ఇంజినీర్‌. కాలక్రమేణా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో.. 1970లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట తొమ్మిదేళ్ల ప్రేమకు గుర్తుగా ఎలన్‌, కింబల్‌.. అనే ఇద్దరు కొడుకులతో పాటు టోస్కా అనే కూతురు పుట్టింది. అయితే వివిధ కారణాల వల్ల 1979లో ఈ జంట విడిపోయింది. అప్పుడు మయే వయసు 42 ఏళ్లు. ఆ సమయంలో తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని టొరంటో చేరుకున్నారామె. నాటి నుంచి నేటి దాకా సింగిల్‌ మదర్‌గానే తన పిల్లల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారీ ఫ్యాషన్‌ మామ్.

ఆకలి తీర్చడానికి.. అష్టకష్టాలు!

నేటి అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ తల్లి ఒకప్పుడు తన పిల్లల ఆకలి తీర్చడానికి అష్టకష్టాలు పడిందంటే ఎవరైనా నమ్మగలరా? కానీ అదే నిజం.. భర్తతో విడిపోయి ఒంటరి తల్లిగా ముగ్గురు పిల్లల బాధ్యతను తన వేసుకున్నారామె. తన టీనేజ్‌ దశలో మోడల్‌గా ఓ వెలుగు వెలిగినా.. విడాకుల తర్వాత ఎన్నో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు.

‘ఎరోల్‌తో విడాకుల తర్వాత నా పిల్లల్ని తీసుకొని టొరంటోకు వచ్చేశా. ఆ రోజులు నా జీవితంలోనే అత్యంత క్లిష్టమైనవి. పిల్లల్ని పోషించడానికి ఏ ఉద్యోగమూ లేదు.. కనీసం వాళ్ల ఆకలి తీర్చుదామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎలాగైనా ఈ పరిస్థితి దాటాలనుకున్నా.. తిరిగి మోడలింగ్‌ కెరీర్‌ మొదలుపెట్టా.. మరోవైపు టొరంటో యూనివర్సిటీలో రీసెర్చ్‌ ఆఫీసర్‌గా విధుల్లో చేరా. అదే యూనివర్సిటీలో న్యూట్రిషనల్‌ సైన్స్‌ విభాగంలో మాస్టర్స్‌ పూర్తి చేశా. నా తొలి సంపాదనతో ఇంట్లోకి కార్పెట్‌, ఎలన్‌కి కంప్యూటర్‌ కొన్న జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను..’ అంటూ తన జీవితంలోని గడ్డు రోజుల్ని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు మయే.

పిల్లలు ప్రయోజకులయ్యారు.. అది చాలు!

ఎంత కష్టపడ్డా.. పిల్లలు ప్రయోజకులైతే ఆ కష్టాన్ని క్షణాల్లో మర్చిపోతారు తల్లిదండ్రులు. తాను కూడా అంతే అంటున్నారు మయే. తాను పడ్డ కష్టానికి ప్రతిఫలంగా తన ముగ్గురు పిల్లలు ఉన్నత స్థాయుల్లో స్థిరపడ్డారు. వ్యాపారంలో తనకు సాటి మరెవరూ లేరన్నట్లుగా ఎలన్‌ మస్క్‌ దూసుకుపోతున్నారు. మరోవైపు ఆయన సోదరుడు కింబల్‌ ‘ది కిచెన్‌ కమ్యూనిటీ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. పాఠశాలల్లో గార్డెన్స్‌ని ఏర్పాటుచేసి.. అందులోని విద్యార్థులకు ఆహారం-ఆరోగ్యంపై అవగాహన పెంచడమే దీని ముఖ్యోద్దేశం. ఇక మయే కూతురు టోస్కా లాస్‌ ఏంజెల్స్‌లో ఫిల్మ్‌మేకర్‌గా స్థిరపడింది.

‘మమ్మల్ని మా పేరెంట్స్‌ ఎలా పెంచారో.. నేనూ నా పిల్లల్ని అలాగే పెంచాలనుకున్నా. స్వేచ్ఛ, స్వతంత్రత, దయ, నిజాయతీ, కష్టపడే తత్వం, మర్యాదపూర్వకంగా మెలగడం.. ఇవన్నీ నేను నా పేరెంట్స్‌ నుంచి అలవర్చుకున్నా.. వాటినే నా పిల్లలకూ అందించా. వాళ్లను ఎప్పుడూ గారాబం చేయలేదు.. అలాగని వాళ్లపై అరవలేదు.. ఇది చదువు, అది చదువు అని ఒత్తిడి చేయలేదు. వాళ్లకు నచ్చిన సబ్జెక్ట్‌ ఎంచుకునే స్వేచ్ఛనిచ్చా. ఏనాడూ వాళ్ల హోమ్‌వర్క్‌ చెక్‌ చేసింది లేదు.. ఎందుకంటే అది వాళ్ల బాధ్యత.. వాళ్లే పూర్తి చేసేలా ప్రోత్సహించేదాన్ని.. ఇప్పటికీ వాళ్ల నిర్ణయాలను వాళ్లకే వదిలేస్తున్నా. పిల్లలపై ఒత్తిడి పెట్టకుండా వారికి నచ్చిన అంశాల్లో ప్రోత్సహిస్తేనే కదా.. వాళ్లు సక్సెసవుతారు..’ అంటారు మయే.

డైటీషియన్‌గా.. మోడల్‌గా..!

‘పిల్లలు ప్రయోజకులయ్యారు.. ఇక నేను కష్టపడింది చాలు..’ అని ఏనాడూ అనుకోలేదు మయే. నేటికీ 74 ఏళ్ల వయసులో సైతం తన డైటీషియన్‌ వృత్తిని, మోడలింగ్‌ కెరీర్‌నీ కొనసాగిస్తున్నారామె. ఇప్పటికీ పలు ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్ల ముఖ చిత్రాలపై మెరుస్తున్నారు. 2017లో తన 69 ఏళ్ల వయసులో కవర్‌ గర్ల్‌ పత్రిక ‘ఓల్డెస్ట్‌ స్పోక్స్ మోడల్‌’గా పాపులరయ్యారు.

మరోవైపు మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందని చెప్పే మయే.. ప్రపంచవ్యాప్తంగా పలు సదస్సులు, సమావేశాల్లో పాల్గొని ఆహారం-ప్రాముఖ్యంపై ప్రసంగాలు, ప్రజెంటేషన్స్‌ ఇస్తుంటారు. తన జీవితంలోని ఒడిదొడుకుల్ని ప్రస్తావిస్తూ.. 2019లో ‘A Woman Makes a Plan: Advice for a Lifetime of Adventure, Beauty, and Success’ అనే పుస్తకం రాశారు.

తన రక్తాన్నే పాలుగా మార్చి బిడ్డ ఆకలి తీర్చే అమ్మ.. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్ని కష్టాలనైనా ఇష్టంగా ఓర్చుకుంటుంది. మయే మస్క్‌ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ! ఇలాంటి మాతృమూర్తులందరికీ శిరసాభివందనాలు!

హ్యాపీ మదర్స్‌ డే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్