Published : 27/12/2021 19:05 IST

Mrs India Earth: అందమైన మనసుకు అందాల కిరీటం!

‘ఒక మహిళ విద్యావంతురాలైతే కుటుంబం అభివృద్ధి చెందుతుంది..’ అంటుంటారు. కానీ ‘దేశం కూడా అభివృద్ధి చెందుతుంది..’ అంటారు డాక్టర్‌ మోనికా చావ్లా. ఇండియాలోనే పుట్టిపెరిగినా.. వివిధ దేశాల్లో వైద్య వృత్తిలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం అబుదాబీలో స్థిరపడిన ఆమె.. ఐవీఎఫ్‌ స్పెషలిస్ట్‌గా ఎంతోమంది మహిళలకు అమ్మతనాన్ని చేరువ చేస్తున్నారు. ఇలా ఓ వైద్యురాలిగానే కాదు.. అందం, తెలివితేటలకు అద్దం పట్టే ‘మిసెస్‌ ఇండియా ఎర్త్‌ - 2021’ పోటీల్లో ఇటీవలే పాల్గొని విజయం సాధించారామె. ఈ సందర్భంగా విద్య పట్ల మహిళల్లో చైతన్యం కలిగించడమే తన లక్ష్యమంటోన్న ఈ అందాల డాక్టరమ్మ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

దిల్లీలో పుట్టి పెరిగిన డాక్టర్‌ మోనికా చావ్లా.. చిన్నతనం నుంచీ తాను ఇష్టపడే వైద్య విద్యనే ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే యూకే, స్పెయిన్‌, జర్మనీ.. వంటి దేశాల్లో దానికి సంబంధించిన శిక్షణను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం అబుదాబీలో స్థిరపడిన ఆమె.. Consultant Reproductive Endocrinologist and Infertility, IVF నిపుణురాలిగా కొనసాగుతున్నారు.

రెండు దశాబ్దాల వైద్య ప్రస్థానంలో..!

సంతానోత్పత్తి నిపుణురాలిగా మోనికకు 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈ క్రమంలోనే పిల్లల్లేక బాధపడుతోన్న ఎంతోమంది దంపతులకు ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారా ఆ కల నెరవేర్చుతున్నారు. తద్వారా అమ్మ కావాలని తహతహలాడే మహిళలకు ఆ వరాన్ని ప్రసాదిస్తున్నారు. నిజంగా ఇలా ప్రకృతిని, సైన్స్‌ని ముడిపెట్టి ఒక జీవిని సృష్టించడమంటే అదో అద్భుతం అంటారు మోనిక.

‘వైద్య వృత్తి నా ప్రాణం. మనసుకు నచ్చిన పని చేయడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ దొరకదు. సైన్స్‌ని ప్రకృతితో ముడిపెట్టి ఒక జీవిని సృష్టించడం నిజంగా ఓ అద్భుతం! ఇది నాకు అంతులేని ఆనందాన్ని అందిస్తుంది. చిన్నతనం నుంచీ నాకో కోరిక ఉండేది. నా వంతుగా ఈ సమాజానికి ఏదైనా చేయాలని బలంగా అనుకునేదాన్ని. ఒక రకంగా ఐవీఎఫ్‌ ద్వారా ఎంతోమంది దంపతులకు సంతానం కలిగేలా చేయగలుగుతున్నానంటే అది నాకు దక్కిన మహదవకాశంగా భావిస్తున్నా..’ అంటారు మోనిక. ఇలా రెండు దశాబ్దాల వైద్య ప్రస్థానంలో ‘Best Physician in UAE’ అవార్డుతో పాటు మరెన్నో పురస్కారాలు సైతం అందుకున్నారామె. అంతేకాదు.. పునరుత్పత్తికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు/పుస్తకాలు సైతం రాశారామె. ఈ క్రమంలో పలు పురస్కారాలు/ఫెలోషిప్స్‌ ఆమె సొంతమయ్యాయి.


‘అందా’నికి ఆభరణం!

‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే అసలైన అందం’ అంటారు మోనిక. ఇదే ఇతరుల్లో స్ఫూర్తి నింపుతుందని చెబుతుంటారు. తనలోని అంతః సౌందర్యాన్ని బహిర్గతం చేయడానికి, ఈ సమాజానికి తనను తాను కొత్తగా పరిచయం చేసుకోవడానికి అందాల పోటీల్లో పాల్గొన్నానంటున్నారీ డాక్టరమ్మ. ఇటీవలే దిల్లీ వేదికగా జరిగిన ‘మిసెస్‌ ఇండియా ఎర్త్‌ - 2021’ అందాల పోటీల్లో పాల్గొన్నారామె. అడుగడుగునా నిండైన ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఈ అందాల కిరీటం తన సొంతం చేసుకున్నారు. అంతేకాదు.. ఈ పోటీల్లో ‘మిసెస్‌ ట్యాలెంటెడ్‌ - 2021’గానూ నిలిచారు. ఈ సందర్భంగా ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటోన్న సవాళ్ల గురించి ప్రస్తావించారు.

‘దేశంలో మహిళలకు రక్షణ లేదన్న విషయం ఎన్నో గణాంకాలు, అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. స్త్రీని దేవతగా పూజించే మన దేశంలో ఆమెకు తగిన గౌరవమూ దక్కట్లేదు. మరోవైపు అసమానతలు, న్యాయం జరగడంలో జాప్యం.. ఆమెకు అతిపెద్ద అవరోధాలుగా నిలుస్తున్నాయి. అయితే ఇవన్నీ అధిగమించాలంటే మహిళలకు విద్యే ప్రధాన ఆయుధం! అప్పుడు ఆమె కుటుంబమే కాదు.. దేశమూ అభివృద్ధి చెందుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ బాలికా విద్యను ప్రోత్సహించాలి..’ అంటారు మోనిక. ప్రస్తుతం ఇండియాలో ‘బాలికా విద్య-మహిళల ఆరోగ్యా’న్ని ప్రోత్సహించే పలు స్వచ్ఛంద సంస్థలతో మమేకమై పనిచేస్తున్నారామె.


సోలో జర్నీ సో బెటర్‌!

* పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు మోనిక. ఈ క్రమంలో తన దగ్గరికి వచ్చే పేషెంట్స్‌ ఆశీర్వచనాలు, కృతజ్ఞతలే తనకు మరింత ఉత్సాహాన్నిస్తాయంటున్నారు.

* ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లిగా ఇటు ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. అటు వృత్తిగతంగానూ రాణిస్తున్నారీ డాక్టరమ్మ. ఈ నేపథ్యంలోనే పిల్లల్ని సన్మార్గంలో నడిపించడం, వారికి బంగారు భవిష్యత్తునివ్వడం ప్రతి తల్లి బాధ్యత అంటారామె.

* కేవలం ఆస్పత్రిలో పేషెంట్స్‌కి చికిత్సలు చేయడమే కాదు.. సంతాన సమస్యలు-వాటి పరిష్కార మార్గాలు, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలు.. వంటి అంశాలకు సంబంధించిన వీడియోలు రూపొందిస్తూ.. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటారు మోనిక.


* ప్రయాణాలంటే మక్కువ చూపే ఈ డాక్టరమ్మ.. ఎక్కువ శాతం సోలోగా ప్రయాణించడానికే ఇష్టపడతారట! ప్రకృతికి దగ్గరగా ఒంటరిగా గడిపినప్పుడే మనమేంటో మనకు తెలుస్తుందంటారు మోనిక.

* కుటుంబమే తన బలం అంటారామె. సానుకూలతల్ని, ప్రతికూలతల్ని సమానంగా పంచుకున్నప్పుడే బంధాలు వెల్లివిరుస్తాయంటున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని