Published : 28/02/2022 21:02 IST

SEBI: బ్యాంకర్‌ నుంచి ఛైర్‌పర్సన్‌గా ఎదిగారు!

(Photo: Twitter)

ఓ సాధారణ ఉద్యోగిగా కెరీర్‌ ప్రారంభించి.. తమ ప్రతిభ-నైపుణ్యాలతో అంచెలంచెలుగా ఎదిగి.. ఓ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టడమంటే మాటలు కాదు. అలాంటి అరుదైన అవకాశాలు అతి కొద్దిమందికే దక్కుతాయి. ముంబయికి చెందిన మాధవీ పూరీ బుచ్‌ కూడా తాజాగా అలాంటి ఘనతనే అందుకున్నారు. భారత మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తొలి మహిళా ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారామె. గతంలో నాలుగేళ్ల పాటు ఈ సంస్థలో హోల్‌ టైమ్‌ మెంబర్‌గా కొనసాగిన మాధవి.. తాజా పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మాజీ బ్యాంకర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

2017-2021 వరకు సెబీకి తొలి మహిళా హోల్‌ టైమ్‌ మెంబర్‌గా కొనసాగారు మాధవి. ఈ క్రమంలో మార్కెట్‌ నియంత్రణతో పాటు సంస్థకు సంబంధించిన పలు కీలక వ్యవహారాల్లో ముఖ్య భూమిక పోషించారు. అలాగే సెబీ ఏర్పాటు చేసిన ఓ కొత్త సాంకేతిక కమిటీకి అధ్యక్షురాలిగా నామినేట్‌ అయ్యారు. ఇక తాజాగా భారత ఆర్థిక శాఖ ఆమెను ఈ సంస్థ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న 1984 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అజయ్‌ త్యాగి పదవీ కాలం నేటితో (ఫిబ్రవరి 28) ముగియడంతో ఆయన స్థానంలో మాధవి బాధ్యతలు చేపట్టనున్నారు.

బ్యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించి..!

ముంబయి, దిల్లీల్లో పాఠశాల విద్య పూర్తి చేసిన మాధవి.. అహ్మదాబాద్‌ ఐఐఎంలో మేనేజ్‌మెంట్‌ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక 1989లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ అనలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించారు. ఈ సంస్థలో తన పన్నెండేళ్ల సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించిన ఆమె.. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, బ్రాండ్‌ మార్కెటింగ్‌ హెడ్‌గా.. ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. రెండేళ్ల పాటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌కు సీఈఓగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై మరో రెండేళ్ల పాటు సింగపూర్‌లోని ‘గ్రేటర్‌ పసిఫిక్‌ క్యాపిటల్‌ ఎల్‌ఎల్‌పీ’ సంస్థలో వ్యాపార అభివృద్ధి హెడ్‌గా పనిచేశారు. షాంఘైలోని న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌లో మూడేళ్ల పాటు పనిచేసిన అనుభవం కూడా మాధవికి ఉంది. ‘అగోరా అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్‌’ సంస్థను నెలకొల్పిన ఆమె.. ప్రస్తుతం ఆ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తాజాగా సెబీ ఛైర్‌పర్సన్‌గా ఎంపికై మార్చి 2న బాధ్యతలు చేపట్టనున్న ఆమె.. ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.

విద్యే అభివృద్ధికి మూలం!

తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అత్యున్నత పదవులు అందుకున్న మాధురి.. చదువే మన అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ‘తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులైతే.. దాని ప్రభావం పిల్లల పైనా పడుతుంది. మా నాన్న కార్పొరేట్‌ సెక్టార్‌లో పనిచేశారు. అమ్మ పొలిటికల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఇలాంటి క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో పెరిగిన నాకు చిన్నతనం నుంచే చదువు పట్ల మక్కువ పెరిగింది. అంతేకాదు.. స్కూలింగ్‌ దశ నుంచే చాలా దృఢంగా, స్వతంత్రంగా ఉండడం అలవాటు చేసుకున్నా. నాకు పుస్తకాలు చదవడమన్నా చాలా ఇష్టం. ఇక చదువు సంగతి కాసేపు పక్కన పెడితే.. వివిధ అంశాలపై చర్చించడంపై ఎక్కువ శ్రద్ధ చూపేదాన్ని. దీని ద్వారా ఆయా అంశాల గురించి బోలెడంత అవగాహన పెరుగుతుందన్నది నా అభిప్రాయం..’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు మాధవి.

సింప్లిసిటీకి మారుపేరు!

సందర్భమేదైనా, కెరీర్ లో ఎన్ని ప్రతిష్ఠాత్మక పదవుల్ని అలంకరించినా చూడ్డానికి ఎంతో సింపుల్‌గా కనిపిస్తారు మాధవి. ఈ క్రమంలో భారతీయ సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోయే ఆమె.. చీరలకూ పెద్దగా ఖర్చు పెట్టనంటున్నారు. ‘నాకు చీరకట్టంటే ఇష్టం. అలాగని వీటికి భారీగా ఖర్చు పెట్టను. నా దగ్గరున్న చీరల రేంజ్‌ రూ. 700 నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది. ఇక ఒకసారి కట్టుకున్న చీర మరోసారి రిపీట్‌ చేయడానికీ వెనకాడను. కాస్త వైవిధ్యంగా కనిపించాలనుకుంటే వీటినే మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ చేసి కట్టుకుంటా..’ అంటూ మరో సందర్భంలో తన సింప్లిసిటీ గురించి చెప్పుకొచ్చారామె. మాధవి భర్త ప్రస్తుతం లండన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే తామిద్దరూ వృత్తి రీత్యా దూరంగా ఉండాల్సి వచ్చినా.. పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. కలిసి గడపడానికీ తగిన సమయం కేటాయిస్తామంటూ తన రిలేషన్‌షిప్‌ సీక్రెట్‌ను పంచుకున్నారీ సూపర్‌ ఉమన్.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని