Polling Beauty: అప్పుడు పచ్చ చీరలో.. ఇప్పుడు బ్లాక్ టాప్‌లో.. మెరిసిందిలా!

మూడేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో పసుపు రంగు చీరలో మోడ్రన్‌గా ముస్తాబై.. బ్యాలట్ బాక్సుల్ని తీసుకెళ్తూ కెమెరా కంటికి చిక్కిన పోలింగ్‌ బ్యూటీ రీనా ద్వివేది గుర్తుందా..? ఎందుకు గుర్తులేదు.. అంత అందమైన భామను మేమెలా మర్చిపోతాం.. అంటారా? ఆ బ్యూటీ తాజాగా మరోసారి తెరమీదకొచ్చింది..

Updated : 23 Feb 2022 19:13 IST

(Photos: Instagram)

మూడేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో పసుపు రంగు చీరలో మోడ్రన్‌గా ముస్తాబై.. బ్యాలట్ బాక్సుల్ని తీసుకెళ్తూ కెమెరా కంటికి చిక్కిన పోలింగ్‌ బ్యూటీ రీనా ద్వివేది గుర్తుందా..? ఎందుకు గుర్తులేదు.. అంత అందమైన భామను మేమెలా మర్చిపోతాం.. అంటారా? ఆ బ్యూటీ తాజాగా మరోసారి తెరమీదకొచ్చింది.. ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తళుక్కున మెరిశారామె. ఇక ఈసారి ఏకంగా వెస్ట్రన్‌ లుక్‌లో దర్శనమిచ్చి అందరి మనసు కొల్లగొట్టారు. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

రీనా ద్వివేది.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పీడబ్ల్యూడీ ఉద్యోగిని అయిన ఆమె.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒక్కరోజులోనే పాపులరైపోయింది. పసుపు రంగు చీర, స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించిన ఆమె.. లూజ్ హెయిర్‌స్త్టెల్, కూలింగ్ గ్లాసెస్ ధరించి మోడ్రన్‌గా మెరిసిపోయింది. ఇలా తన మోడ్రన్ ఆహార్యానికి తోడు మెడలో ఐడీ కార్డ్, రెండు చేతుల్లో బ్యాలట్ బాక్సులు పట్టుకొని ఎంతో స్త్టెలిష్ లుక్‌లో వెళ్తున్న రీనా ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఒక్కరోజులోనే సెలబ్రిటీగా మారిపోయిన ఆమెను అప్పట్నుంచి ‘ది వుమన్ ఇన్ యెల్లో శారీ’ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు నెటిజన్లు.

ఈసారి పక్కా వెస్ట్రన్‌ లుక్‌లో!

రీనాను చూస్తేనే అర్థమవుతుంది.. ఆమె ఫ్యాషన్‌ లవర్‌ అని! నాడు భారతీయ సంప్రదాయ చీరకట్టులో మోడ్రన్‌గా ముస్తాబైన రీనా.. ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా వెస్ట్రన్‌ లుక్‌లో దర్శనమిచ్చింది. బ్లాక్‌ టాప్‌, బీజ్‌ కలర్‌ ట్రౌజర్‌ ధరించిన ఆమె.. ఓ చేతిలో హ్యాండ్‌బ్యాగ్‌, మరో చేతిలో బ్యాలట్‌ బాక్స్‌ పట్టుకొని విధులకు వెళ్తూ మరోసారి కెమెరా కంటికి చిక్కింది. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆమెతో ఫొటోలు దిగడానికి ఆరాటపడ్డారు. అంతేకాదు.. ఈమె విధులు నిర్వర్తించిన పోలింగ్ కేంద్రంలో సగటు కన్నా ఎక్కువ శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ పోలింగ్‌ బ్యూటీ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇప్పుడూ ఆమె సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. కేవలం ఈసారే కాదు.. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బ్లూ జీన్స్, వైట్ టీస్‌తో ఆకట్టుకుందీ బ్యూటీ.

డ్యాన్స్‌తో ఇరగదీసింది!

ఇలా ఎప్పటికప్పుడు తన స్టైలిష్‌ లుక్స్‌తో కుర్రకారు హృదయాల్ని కొల్లగొడుతోన్న ఈ బ్యూటీ మంచి డ్యాన్సర్‌ కూడా! మొన్నామధ్య ఓ వేడుకలో పాల్గొన్న రీనా.. తన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో ఇరగదీసింది. ఆకుపచ్చ రంగు చీర, నలుపు రంగు స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించిన ఆమె లూజ్ హెయిర్‌తో ఆకట్టుకుంది. ప్రముఖ డ్యాన్సర్-సింగర్ సప్నా ఛౌదరి హర్యాణ్వీ భాషలో (హరియాణా ప్రాంతీయ భాష) పాడిన పాపులర్ పాట ‘తెరి అఖ్యా కా యో కాజల్’ అనే పాటకు తనదైన రీతిలో చక్కటి స్టెప్పులేసింది రీనా. పాటకు తగ్గట్లుగా డ్యాన్స్ చేస్తూ అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్న ఈ లేడీ ఆఫీసర్.. తన డ్యాన్సింగ్ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకోగా అదీ విపరీతంగా వైరలైంది. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ ఆఫీసర్ తన ఫొటోలను, ఇతర వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది కూడా!

లక్షల మంది ఫాలోయర్లు!

* ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ‘పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్’లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తోన్న రీనా ద్వివేది.. లేడీ సింగంగా తనను తాను అభివర్ణించుకుంటుంది.. తన హావభావాలు, ఆహార్యంతో నిండైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తుంటుంది. తాను ఎప్పుడు, ఎక్కడికెళ్లినా నవ్వుతూ.. తన చుట్టూ ఉండే వాళ్లను సంతోషపెట్టడానికి ఇష్టపడతానంటోందీ పోలింగ్‌ బ్యూటీ.

* 2004లో యూపీలోని పీడబ్ల్యూడీ శాఖలో పనిచేసే సంజయ్ ద్వివేదిని వివాహమాడిందామె. ఈ జంటకు అదిత్ ద్వివేది అనే కొడుకున్నాడు. అయితే 2013లో రీనా భర్త సంజయ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు.. దీంతో ఆ ఉద్యోగం రీనాకు అందించింది యూపీ ప్రభుత్వం. అప్పట్నుంచి ఆ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా కొనసాగుతోంది రీనా.

* రీనా ఎంత అందంగా ముస్తాబవుతుందో.. పని పట్ల అంత సిన్సియర్‌గా ఉంటుంది. అంతేకాదు.. మరోవైపు తన కొడుకు ఆలనా పాలనలో అమ్మతనాన్నీ ఆస్వాదిస్తోందీ లవ్లీ మామ్‌.

* ఇలా ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారిన రీనాకు గత కొద్ది రోజులుగా భోజ్‌పురీ సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయట! అయితే వాటి కంటే తనకు తన కొడుకు చదువు, భవిష్యత్తే ముఖ్యమంటోందీ అందాల అమ్మ.

* తన ఆకట్టుకునే ఆహార్యంతో దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటిఫుల్ లేడీ. ఈ క్రమంలో ఇండియాలోనే కాదు.. హంగరీ, న్యూజిలాండ్, జర్మనీ, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, సింగపూర్, ఖతార్, సౌదీ అరేబియా, యూకే.. వంటి చాలా దేశాల్లో సైతం ఆమె గురించి ఇంటర్నెట్‌లో తెగ వెతికారట! ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే రీనాకు దాదాపు రెండున్నర లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉండడం విశేషం.

ఇవే హాబీలు!

* డ్యాన్సింగ్, సింగింగ్, ట్రావెలింగ్.. ఈ ముద్దుగుమ్మ హాబీస్.

* చిన్నతనం నుంచి ఫిట్‌నెస్ అంటే మక్కువ చూపే రీనా.. తన ఫిట్‌నెస్‌కు కారణం రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా చేయడమే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

* అలాగే గుర్రపు స్వారీని కూడా అమితంగా ఇష్టపడతానంటోంది రీనా. ఇందుకు ప్రతిగానే తన హార్స్‌ రైడింగ్‌ ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది కూడా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్