Published : 16/11/2021 19:37 IST

అంతరిక్షంలో నడిచి చరిత్ర సృష్టించింది..!

నేటి తరం మహిళలు అవరోధాల్ని దాటుతూ తమదైన ప్రతిభతో దూసుకుపోతున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తూ తమ శక్తియుక్తుల్ని ప్రపంచానికి చాటుతున్నారు. చైనాకు చెందిన వాంగ్‌ యాపింగ్‌ చేసింది కూడా ఇదే! ఇటీవలే ఆరున్నర గంటలపాటు అంతరిక్షంలో నడిచి.. ఈ ఘనత సాధించిన మొదటి చైనా మహిళగా రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

అంతరిక్షంలో ఆరున్నర గంటలు...

చైనా సొంతంగా ‘టియాంగాంగ్’ అనే అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే ఆ దేశం ‘షెంఝౌ-13’ అనే వ్యోమనౌక ద్వారా ‘టియాన్‌ హే మాడ్యూల్-2’ని అక్టోబర్‌ 16న ప్రయోగించింది. ఈ వ్యోమనౌకలో వాంగ్‌ యాపింగ్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు ఉన్నారు. చైనా తరఫున అంతరిక్షంలో ఎక్కువ రోజులు కొనసాగనున్న మానవసహిత మిషన్‌ కూడా ఇదే కావడం విశేషం. ఇందులో భాగంగా వీరు ఆరు నెలల పాటు అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో పాలు పంచుకోనున్నారు. ఈ క్రమంలో వాంగ్‌ తన తోటి వ్యోమగామి జాయ్‌ జిగాంగ్‌తో కలిసి ఇటీవలే ఆరున్నర గంటల పాటు స్పేస్‌ వాక్‌ చేసి.. కొన్ని పరికరాలను అమర్చారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి చైనా మహిళగా చరిత్ర సృష్టించారు వాంగ్‌. ‘ఒక మహిళ స్పేస్‌వాక్‌లో పాల్గొనడం చైనా అంతరిక్ష చరిత్రలో ఇదే మొదటిసారి..’ అని చైనా అంతరిక్ష సంస్థ తెలిపింది.

ఆర్మీ నుంచి అంతరిక్షం దాకా..

చైనాలోని షాండాంగ్‌ ప్రావిన్స్‌లో పుట్టిపెరిగిన వాంగ్‌ యాపింగ్‌.. తన 17వ ఏటే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆపై 1997లో ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఎయిర్‌ ఫోర్స్‌’లో చేశారు. అక్కడ ‘డిప్యూటీ స్క్వాడ్రాన్‌ కమాండర్’గా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో ‘వూహాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బృందం’లో పైలట్‌గా పలు కార్యక్రమాల్లో భాగమయ్యారు. భూకంప సహాయక చర్యలు, ఇతర ప్రకృతి విపత్తుల సహాయక కార్యక్రమాలు, యుద్ధ విన్యాసాల్లో పాల్గొని తన వృత్తి నైపుణ్యాల్ని చాటుకున్నారు. అలాగే 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ సమయంలో వర్షాల వల్ల క్రీడలకు అంతరాయం కలగకుండా.. మబ్బుల్ని విచ్ఛిన్నం చేసే పనుల్లో (Cloud Seeding, Weather Modification) పాలు పంచుకున్నారు. తన ప్రతిభకు గుర్తుగా ‘ఎయిర్‌ ఫోర్స్‌ క్లాస్‌ - 2 పైలట్‌’గానూ పేరు సంపాదించారు.

ఆరు కోట్ల మంది విద్యార్థులకు ఉపన్యాసం..

ఆ తర్వాత 2010లో చైనా అంతరిక్ష సంస్థలో చేరారు. 2012లో ‘షెంఝౌ-9’ మిషన్‌ బ్యాకప్‌ బృంద సభ్యురాలిగా వ్యవహరించారు. తద్వారా చైనా తరఫున రెండో మహిళా వ్యోమగామిగా నిలిచారు. 2013లో ‘షెంఝౌ-10’ మిషన్‌ ప్రధాన బృందంలో భాగమయ్యారు. ఈ సమయంలోనే దాదాపు ఆరు కోట్ల మంది చైనా విద్యార్థులకు తొలి అంతరిక్ష ఆధారిత ఉపన్యాసం ఇచ్చారామె. ఇక ప్రస్తుత స్పేస్‌మిషన్‌ (షెంఝౌ-13)లో అంతరిక్షంలోకి వెళ్లిన ముగ్గురు వ్యోమగాముల్లో వాంగ్‌ ఒకరు. ఈ క్రమంలోనే ఆరున్నర గంటల పాటు అంతరిక్షంలో నడిచి.. ఈ ఘనత సాధించిన తొలి చైనా మహిళా వ్యోమగామిగా చరిత్రకెక్కారు. 41 ఏళ్ల వాంగ్‌ యాపింగ్‌కి 5 ఏళ్ల పాప ఉంది.

అంతరిక్షంలో మహిళలు స్పేస్‌వాక్‌ చేయడం 1984నుంచి ప్రారంభమైంది. ఆ సంవత్సరం రష్యాకు చెందిన Svetlana Savitskaya మొదటిసారి స్పేస్‌వాక్‌ చేసింది. ఇప్పటివరకు మొత్తంగా 43 మంది స్పేస్‌వాక్‌ చేయగా.. వారిలో 16 మంది మహిళలు కావడం విశేషం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని