డైటింగ్ చేయకుండానే బరువు తగ్గాలంటే..!

చక్కటి శరీరాకృతి అంటే కొన్ని కొలతల ప్రకారం ఇలాగే ఉండాలి అనుకుంటారు. ఉదాహరణకు లావుగా ఉండేవారు సన్నగా, నాజూగ్గా ఉండాలన్న కోరికతో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు విపరీతమైన వర్కవుట్లు...

Published : 06 May 2023 18:28 IST

చక్కటి శరీరాకృతి అంటే కొన్ని కొలతల ప్రకారం ఇలాగే ఉండాలి అనుకుంటారు. ఉదాహరణకు లావుగా ఉండేవారు సన్నగా, నాజూగ్గా ఉండాలన్న కోరికతో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు విపరీతమైన వర్కవుట్లు మొదలుపెడితే.. మరికొందరు తమ ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకుంటుంటారు.. ఇంకొందరైతే డైటింగ్ పేరుతో పూర్తిగా నోరు కట్టేసుకుంటుంటారు. అయితే ఎలా ఉన్నా సరే మనల్ని మనం ప్రేమించుకోవాలి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.. తినేది పూర్తిగా మనసు పెట్టి తినాలి.. అప్పుడే అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం.. ఈ భావనను పెంపొందించే లక్ష్యంతోనే ఏటా మే ౬న ‘నో డైట్ డే’ నిర్వహిస్తారు. ఈ క్రమంలో మరి డైటింగ్‌తో పనిలేకుండా బరువు తగ్గి, ఆరోగ్యంగా ఉండడమెలాగో తెలుసుకుందాం రండి...

చక్కెర తగ్గించండి..

బరువు తగ్గాలనుకొనేవారు చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండే పానీయాలు, ఆహార పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే చక్కెర శరీరంలోకి చేరుతుంది. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కెర వేయకుండా తయారు చేసిన నిమ్మరసం, పండ్ల రసాలు, నీరు ఎక్కువగా తీసుకోవడం మంచిది. దీనివల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండచ్చు.

కూరగాయలెక్కువ..

డైటింగ్ చేయకుండానే బరువు తగ్గాలనుకునే వారు రోజువారీ ఆహారంలో భాగంగా కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి. వీటిని సలాడ్స్ రూపంలో లేదంటే ఉడికించుకుని కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా తినాలనిపించకపోతే వాటిపై కాస్త నిమ్మరసం పిండుకుంటే రుచిగా ఉండడంతో పాటు బరువు కూడా తగ్గుతుంది.

విశ్రాంతి ఎక్కువగా..

నిద్రలేమితో బాధపడే వారికి ఎదురయ్యే సాధారణ సమస్య బరువు పెరగడం. కాబట్టి రాత్రుళ్లు కనీసం ఏడెనిమిది గంటల పాటు హాయిగా.. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నిద్ర పోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే ఖాళీగా ఉన్నప్పుడు అనవసరమైన పనులతో సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రశాంతంగా నిద్రపోవాలి. దీంతో శరీరానికి, మనసుకు విశ్రాంతి లభించి తద్వారా బరువు కూడా అదుపులో ఉంటుంది.

గ్రీన్ టీతో..

బరువు తగ్గడానికి ఎక్కువమంది నిపుణులు సూచించే పానీయం గ్రీన్ టీ. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు త్వరగా కరుగుతాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి డైటింగ్ అవసరం లేకుండా బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీని రోజువారీ మెనూలో భాగం చేసుకోవడం మంచిది.

క్యాలరీలు తక్కువగా..

డైటింగ్ చేయకుండా బరువు తగ్గాలనుకోవడం మంచిదే. అయితే అలాంటి వారు తీసుకునే ఆహారంలో క్యాలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం ఓట్స్, బ్రౌన్ రైస్, బార్లీ.. వంటి క్యాలరీలు తక్కువగా ఉండే పదార్థాల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే క్యాలరీలు, కొవ్వులు తక్కువగా ఉండే వెజిటబుల్, టమాటా.. వంటి సూప్‌లను కూడా మెనూలో చేర్చుకుంటే మరీ మంచిది.

యోగాతో..

రోజూ యోగా చేయడం వల్ల కూడా డైటింగ్‌తో పనిలేకుండా అధిక బరువు నుంచి విముక్తి పొందచ్చు. ఎవరైతే రోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తారో వారు.. యోగా చేయని వారితో పోలిస్తే తక్కువ బరువుంటారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అలాగే యోగా వల్ల ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా మానసిక ప్రశాంతత లభించి ఎక్కువ తినే అలవాటు దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజూ కనీసం పావుగంట యోగా, పది నిమిషాల చొప్పున నడక, జాగింగ్.. వంటివి వ్యాయామంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాల్ని పొందచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్