పిల్లల్లో దొంగతనం అలవాటును మాన్పించాలంటే...

'బుద్ధి లేదు.. నిన్నేగా నీకు కొత్త పెన్సిల్ కొనిచ్చాను. మళ్లీ పక్కవాడి పెన్సిల్ తెచ్చుకోవాల్సిన అవసరమేమొచ్చింది నీకు..?' అంటూ పిల్లాణ్ని తిడుతోంది స్రవంతి. ఇలాంటి సంఘటనలు మనందరి ఇళ్లల్లోనూ ఎప్పుడో ఓసారి జరుగుతూనే ఉంటాయి. అది తప్పని తెలిసినా, తెలియకపోయినా ఎదుటివాళ్లకు......

Published : 18 May 2022 20:35 IST

'బుద్ధి లేదు.. నిన్నేగా నీకు కొత్త పెన్సిల్ కొనిచ్చాను. మళ్లీ పక్కవాడి పెన్సిల్ తెచ్చుకోవాల్సిన అవసరమేమొచ్చింది నీకు..?' అంటూ పిల్లాణ్ని తిడుతోంది స్రవంతి. ఇలాంటి సంఘటనలు మనందరి ఇళ్లల్లోనూ ఎప్పుడో ఓసారి జరుగుతూనే ఉంటాయి. అది తప్పని తెలిసినా, తెలియకపోయినా ఎదుటివాళ్లకు తెలియకుండా ఒకరి వస్తువు మన పిల్లలు తీసుకుంటే దాన్ని దొంగతనం కిందే భావించాల్సి ఉంటుంది. ఈ అలవాటును చిన్నతనంలోనే మాన్పించాలి. లేకపోతే పెద్దయిన తర్వాత ఇదే అలవాటు వాళ్ల జీవితాన్ని పాడు చేసే అవకాశాలుంటాయి.

సాధారణంగా దొంగతనం చేసే పిల్లల్లో మూడు వయసుల పిల్లలు ఉంటారు. వీళ్లు స్థూలంగా మూడు కారణాల వల్ల దొంగతనం చేస్తుంటారు.

మొదటి రకం పిల్లలు చాలా చిన్నవాళ్లు. వీళ్లకు వాళ్లు చేసేది దొంగతనం అని తెలీదు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు, లేదా ఎవరి దగ్గరైనా మంచి వస్తువు చూసినప్పుడు దాన్ని వెంట తెచ్చుకుంటారు. ఆ వస్తువు వేరే వాళ్లది మనం తీసుకోకూడదని, లేక మనం తెచ్చుకునే వస్తువుకు డబ్బులు కట్టాలనే విషయం కానీ వాళ్లకు తెలీదు.

రెండో రకం పిల్లలకు వస్తువు వేరే వాళ్లదని, ఒకవేళ షాపు నుంచి తెచ్చుకుంటే డబ్బులు కట్టాలన్న అవగాహన ఉంటుంది. అయినా వాళ్లు దొంగతనం చేస్తారు. ఎందుకంటే వాళ్ల మీద వాళ్లకు నియంత్రణ ఉండదు. ఆ వస్తువు నచ్చింది, అది కావాలి కాబట్టి తెచ్చుకోవాల్సిందే అనుకుంటారు.

మూడో రకం పిల్లలకు కూడా అన్నీ తెలుసు. కానీ వీళ్లు అందులోని థ్రిల్‌ని అనుభవించడం కోసం దొంగతనం చేస్తుంటారు. ఒకసారి చేసినప్పుడు వాళ్లకు థ్రిల్‌గా అనిపిస్తే దాన్ని కొనసాగిస్తారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మీదున్న కోపాన్ని బయటకు ప్రదర్శించడానికి కూడా దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్లమీద తిరుగుబాటు చేస్తున్నామనుకుంటారు వాళ్లు..

ఇక టీనేజీ పిల్లలు తోటివాళ్లలో తమ హోదా పెంచుకోవడానికి, వాళ్లకు పార్టీలు ఇవ్వడానికి, ఖరీదైన వస్తువులు కొనుక్కోవడానికి తల్లిదండ్రుల దగ్గరి నుంచి డబ్బులు కొట్టేయడం చూస్తూనే ఉంటాం..

ఏం చేయాలి..?

దొంగతనం చేసే పిల్లల్లో ప్రతి ఒక్కరితో వ్యవహరించాల్సిన పద్ధతి వేరుగా ఉంటుంది.

మొదటి రకం పిల్లలు:

వీళ్లు సాధారణంగా ప్రీస్కూలర్స్, లేదా చిన్న తరగతులు చదువుతున్న వాళ్త్లె ఉంటారు. కాబట్టి ముందు వీళ్లకు దొంగతనం చేయడం తప్పన్న సంగతి తెలియజెప్పాలి. తర్వాత దొంగతనం చేసిన వస్తువును అది తీసుకున్న వాళ్లకు తిరిగి ఇచ్చేలా చూడాలి. ఇచ్చిన తర్వాత క్షమాపణ అడగమని కూడా కోరాలి. ఒకవేళ చాక్లెట్ లాంటిది తీసుకొని తినేస్తే మీరు దాన్ని తిరిగి కొని వాళ్లతోనే ఇప్పించాలి. అయితే మొదటిసారి చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయి. రెండోసారి చేస్తే వాళ్లకు అన్నీ తెలిసి తప్పు చేసినట్టే అవుతుంది.

రెండో రకం పిల్లలు:

రెండో రకం పిల్లలు వీళ్ల కంటే కాస్త పెద్దవాళ్లు.. తెలిసినా తప్పు చేసేవాళ్లు.. వీళ్లలో ఈ అలవాటు మాన్పించడం అత్యవసరం. లేకపోతే తర్వాత కష్టంగా మారుతుంది. వాళ్లు ఏదైనా దొంగతనం చేసి మీకు పట్టుబడితే వెంటనే మీరు ఆ వస్తువును తిరిగి ఎవరి దగ్గరి నుంచి తీశారో వాళ్లకు ఇచ్చేయమని చెప్పాలి. సాధారణంగా పిల్లలు వస్తువులు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోరు. ఇలాంటి సందర్భాల్లో వాళ్లకు నెమ్మదిగా వివరించాలే తప్ప తిట్టకూడదు.

'ఆ వస్తువు నీదే అయితే నువ్వెంత బాధపడతావో ఆలోచించు.. నీ వస్తువు పోతే నువ్వు ఫీలైనట్టే అవతల వాళ్లు కూడా బాధపడతారుగా..' అంటూ నెమ్మదిగా వివరించి వస్తువును తిరిగి ఇచ్చేలా చేయాలి. ఇచ్చిన తర్వాత మరోసారి దొంగతనం చేయకుండా వాళ్లకు గట్టి వార్నింగ్ ఇవ్వాలి. అయినా తిరిగి రిపీటైతే వాళ్లకు ఏదో ఒక చిన్న శిక్ష విధించాలి. ఒకవేళ తీసుకున్న వస్తువును తినేసి, లేదా ఉపయోగించేస్తే ముందు మీరు దాన్ని కొని వాళ్లతో ఇప్పించాలి. తర్వాత 'ఆ వస్తువు కొనడానికి ఇంత ఖర్చయింది. దాన్ని నువ్వే సంపాదించాలి. దాని కోసం నువ్వు ఈ పని చేయాలి' అంటూ వాళ్లకు పని అప్పగించాలి. దీని వల్ల 'వాళ్లకు డబ్బులు వూరికే రావు. నేను దొంగిలించి వాడేసిన ప్రతిసారీ అమ్మానాన్న కొనివ్వరు' అన్న అభిప్రాయం వస్తుంది.

మూడో రకం పిల్లలు:

ఇక మూడో రకం పిల్లల్లో ఈ అలవాటు మాన్పించడం కొంత కష్టమే.. ఎందుకంటే వీళ్లు ఇప్పటికే మొదటి రెండు దశలను దాటేశారు. ఇలాంటి వాళ్లు దొంగతనం చేస్తూ మీకు పట్టుబడితే మీరు దానివల్ల ఎంత బాధపడుతున్నారో వాళ్లకు తెలియజెప్పండి. దొంగతనం ఎంత పెద్ద తప్పో, దాని ఫలితాలు ఎలా ఉంటాయో వాళ్లకు వివరించండి. ఒకవేళ వాళ్లు మీ మీద కోపంతో దొంగతనం చేస్తున్నట్టయితే.. మీతో చర్చించమని చెప్పండి. కసి తీర్చుకోవడానికి వాళ్ల జీవితాన్ని పాడు చేసుకోవద్దని వివరించండి.
దొంగతనం చేసిన వస్తువును తిరిగి ఇవ్వడంతో పాటు అంత మొత్తాన్ని వాళ్లు తిరిగి సంపాదించేలా చేయండి. దాని కోసం ఇంటి పనులు చేయించండి. దీని వల్ల వాళ్లకు పని విలువ తెలుస్తుంది. పని చేస్తేనే డబ్బు వస్తుందని అర్థమవుతుంది. డబ్బు తిరిగి సంపాదించే వరకూ వాళ్లకు ఉండే ప్రత్యేకమైన సదుపాయాలు కట్ చేయండి. బయటకు తీసుకువెళ్లడం, ఖరీదైన వస్తువులు కొనివ్వడం మానేయండి. అయితే ఇవి వాళ్లకు తెలిసేలా చేయండి.

ఫ్రెండ్స్‌ని చూసి..

సాధారణంగా టీనేజ్‌లో ఉన్న పిల్లలు తమ ఫ్రెండ్స్‌ని చూసి వాళ్లకేది ఉంటే తమకది కావాలనుకుంటారు. వాటి గురించి తల్లిదండ్రులను అడిగితే కాదంటారని దొంగతనం చేసిన డబ్బులతో కొనుక్కోవాలనుకుంటారు. అందుకే మీ పిల్లలు మిమ్మల్నేదైనా వస్తువు కొనివ్వమని అడిగినప్పుడు వాళ్లను దగ్గర కూర్చోబెట్టుకొని మీ పరిస్థితిని వాళ్లకు వివరించండి. మీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకునే వయసుకు వాళ్లు చేరుకున్నారు కాబట్టి మీరు అది ఎప్పుడు కొనగలరో వాళ్లకు వివరించి చెప్పండి. ఒకవేళ అది మీ పిల్లలకు అనవసరం, లేక మీ తాహతుకు సరిపోదు అని మీకనిపించినప్పుడు అదే విషయాన్ని మీ పిల్లలకు అర్థమయ్యేలా వివరించే బాధ్యత కూడా మీదే.. లేకపోతే పిల్లల్లో ఈ అలవాటును మాన్పించడం చాలా కష్టమవుతుంది.

చిన్నప్పటి నుంచే పిల్లలకు పొదుపు అలవాట్లను నేర్పిస్తూ ఉంటే వాళ్లకు కావాల్సిన వస్తువును వాళ్లే కొనుక్కోవడానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. దీని వల్ల దొంగతనం చేసే అలవాటు కూడా తగ్గే అవకాశాలుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్