Woloo App: ఒక్క క్లిక్‌తో పరిశుభ్రమైన టాయిలెట్‌ సౌకర్యం!

ఈ రోజుల్లో మహిళలకు ఇంటిని మించిన సౌకర్యమైన ప్రదేశం మరొకటి లేదని చెప్పచ్చు. ఎందుకంటే గడప దాటాక టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చినా, పసి బిడ్డకు పాలు పట్టాల్సి వచ్చినా, ఉన్నట్లుండి సడెన్‌గా పిరియడ్స్‌ వచ్చినా.. మరో దారి లేక గమ్యస్థానం చేరే వరకూ ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకవేళ దగ్గర్లో టాయిలెట్‌ సౌకర్యం......

Published : 20 Apr 2022 16:12 IST

(Photos: Instagram)

ఈ రోజుల్లో మహిళలకు ఇంటిని మించిన సౌకర్యమైన ప్రదేశం మరొకటి లేదని చెప్పచ్చు. ఎందుకంటే గడప దాటాక టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చినా, పసి బిడ్డకు పాలు పట్టాల్సి వచ్చినా, ఉన్నట్లుండి సడెన్‌గా పిరియడ్స్‌ వచ్చినా.. మరో దారి లేక గమ్యస్థానం చేరే వరకూ ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకవేళ దగ్గర్లో టాయిలెట్‌ సౌకర్యం ఉన్నా అవి అపరిశుభ్రంగా ఉండడంతో అందులోకి వెళ్లలేని పరిస్థితి! ఇలాంటి ప్రతికూల పరిస్థితులే తమను ఆలోచనలో పడేశాయంటున్నారు నలుగురు ఆంత్రప్రెన్యూర్స్‌. ఇదే ‘ఉలూ’ పేరుతో మహిళల కోసం ప్రత్యేకంగా, వివిధ సౌకర్యాలతో కూడిన టాయిలెట్‌ రూమ్‌ను ఏర్పాటుచేసేలా వీరిని ప్రోత్సహించింది. ‘పౌడర్‌ రూమ్‌’ పేరుతో పిలిచే ఈ గదులు దగ్గర్లో ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు వీలుగా ఓ యాప్‌ను కూడా అభివృద్ధి చేశారు. ఇంతకీ ఎవరు వాళ్లు? మహిళల సౌకర్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ.. వీరు రూపొందించిన ఈ పబ్లిక్‌ టాయిలెట్స్‌ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

బాగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో, రైల్వే స్టేషన్లలో టాయిలెట్స్ ఎంత అపరిశుభ్రంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీనికి తోడు మహిళల వ్యక్తిగత రక్షణకు, సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చే సదుపాయాలు వాటిలో అంతంతమాత్రమే అని చెప్పాలి. అందుకే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ఆలోచించారు ముంబయి ఆంత్రప్రెన్యూర్స్‌ మనీష్‌ కేల్‌శిఖర్‌, రుపాలీ కేల్‌శిఖర్‌, సుప్రీత్‌ షా, అమిత్‌ అరోన్‌డేకర్‌. ఈ క్రమంలోనే ‘ఉలూ’ పేరుతో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్‌ రూమ్‌ను ఏర్పాటుచేశారు.

‘ఉలూ’ ప్రత్యేకతలివే!

2019లో ముంబయిలోని థానే రైల్వేస్టేషన్‌ వెలుపల తొలి పౌడర్‌ రూమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. మహిళల కోసం ఇందులో వివిధ సౌకర్యాలు సమకూర్చారు. అధునాతన బాత్‌రూమ్స్‌, విశ్రాంతి గది/వెయిటింగ్‌ రూమ్‌, పాపాయికి పాలు పట్టడానికి ప్రత్యేక గది, శ్యానిటరీ న్యాప్‌కిన్లు/ అత్యవసర పరిస్థితుల్లో దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక సదుపాయాలు.. ఇలా ఆయా పనుల్ని మహిళలు సురక్షితంగా చేసుకోవచ్చు. అలాగే ఈ గదిలో మహిళలకు అవసరమైన సౌందర్యోత్పత్తులు, లోదుస్తులు, శ్యానిటరీ ప్యాడ్స్‌.. వంటి అత్యవసర ఉత్పత్తుల్ని కూడా విడివిడిగా షాపుల్లో ఉంచి విక్రయిస్తున్నారు. ఈ రెండేళ్ల కాలంలో ముంబయి వ్యాప్తంగా 500 లకు పైగా పౌడర్‌ రూమ్‌లను ఏర్పాటుచేశామంటున్నారు ఉలూ సహ వ్యవస్థాపకులు రుపాలీ.

వాళ్ల ఇబ్బందులు చూడలేకే..!

‘దేశం ఎంతగా అభివృద్ధి చెందుతోన్నా పరిశుభ్రమైన టాయిలెట్స్‌ దగ్గరికొచ్చే సరికి ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. దీంతో తరచూ ప్రయాణాలు చేయాల్సి వచ్చిన వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమందైతే సరైన టాయిలెట్‌ సదుపాయాల్లేక గమ్యస్థానం చేరుకునేదాకా ఆహారం, నీళ్లు.. వంటి వాటికి దూరంగా ఉంటున్నారు. దానివల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో దగ్గర్లోని టాయిలెట్‌ సదుపాయాల్ని ఉపయోగించుకుంటే లేనిపోని ఇన్ఫెక్షన్లు చుట్టుముడుతున్నాయి. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలనే ఉలూ ఆలోచన చేశాం..’ అంటున్నారామె.

ఒక్క క్లిక్‌ దూరంలో..!

ప్రస్తుతం ముంబయి వ్యాప్తంగా సుమారు 500 లకు పైగా పౌడర్‌ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని మహిళలకు మరింత చేరువ చేసే ముఖ్యోద్దేశంతో గతేడాది ‘ఉలూ’ పేరుతో ఓ యాప్‌ కూడా రూపొందించామంటున్నారు దీని సృష్టికర్తలు. ‘ప్రయాణాల్లో ఉన్న మహిళలు తమకు దగ్గర్లో ఉన్న ఉలూ వాష్‌రూమ్స్‌ గురించి తెలుసుకోవడానికి ఓ ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించాం. ప్రతి లొకేషన్‌కు జియో ట్యాగ్‌ను అనుసంధానించాం. కాబట్టి మ్యాప్స్‌ ద్వారా దగ్గర్లోని పౌడర్‌ రూమ్‌ ఏదో కనుక్కొని అక్కడికి చేరుకోవచ్చు. వెళ్లిన ప్రతిసారీ క్యాష్‌బ్యాక్‌ పేరుతో కొన్ని పాయింట్లు పొందచ్చు.. వాటిని అందులోని వస్తువులు కొనుక్కోవడానికి వినియోగించుకోవచ్చు..’ అంటూ యాప్‌ పనితీరు గురించి చెప్పుకొచ్చారు.

త్వరలో ఈ సేవలు కూడా!

ప్రస్తుతం ముంబయికే పరిమితమైన ఉలూ సేవలు త్వరలోనే దేశంలోని ఇతర రాష్ట్రాలకు, మెట్రో నగరాలకూ విస్తరించనున్నట్లు చెబుతున్నారు స్టార్టప్‌ నిర్వాహకులు. ‘మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాలకు మా సేవల్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మహిళా ప్రయాణికుల కోసం భోజన సదుపాయాలు ఏర్పాటుచేయాలన్న ఆలోచన కూడా ఉంది. పరిశుభ్రమైన టాయిలెట్‌ సదుపాయాల్ని వినియోగించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అందుకే ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి మహిళా మా సేవల్ని వినియోగించుకోవచ్చు.. ప్రయాణాల్లో నిశ్చింతగా ఉండచ్చు..’ అంటూ తమ భవిష్యత్‌ లక్ష్యాల గురించి చెప్పుకొచ్చారు ఉలూ రూపకర్తలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్