ఈ రిపోర్టర్‌ మధ్యలోనే టెలికాస్ట్‌ ఎందుకు ఆపిందో తెలుసా..?

ప్రపంచమంతటా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న సైనిక చర్య గురించే చర్చ జరుగుతోంది. అందమైన దేశంగా పేరుగాంచిన ఉక్రెయిన్‌.. ఇప్పుడు బాంబుల చప్పుళ్లు, మిస్సైళ్ల మోతలతో అట్టుడుకిపోతోంది. అణు రియాక్టర్‌ దగ్గర మంటలు, ప్రసూతి ఆసుపత్రిపై మిస్సైల్‌ దాడి, జీవాయుధ ల్యాబ్ల నుంచి హానికరమైన.....

Published : 23 Mar 2022 13:01 IST

(Photos: Instagram)

ప్రపంచమంతటా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న సైనిక చర్య గురించే చర్చ జరుగుతోంది. అందమైన దేశంగా పేరుగాంచిన ఉక్రెయిన్‌.. ఇప్పుడు బాంబుల చప్పుళ్లు, మిస్సైళ్ల మోతలతో అట్టుడుకిపోతోంది. అణు రియాక్టర్‌ దగ్గర మంటలు, ప్రసూతి ఆసుపత్రిపై మిస్సైల్‌ దాడి, జీవాయుధ ల్యాబ్ల నుంచి హానికరమైన వైరస్‌లు విడుదలయ్యే ప్రమాదం.. అంటూ వచ్చే వార్తలు వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. దీనిని బట్టి అక్కడ నివసించే వారి పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అది తట్టుకోలేకే లక్షల మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెడుతున్నారు. ఇలాంటి భయానక పరిస్థితుల మధ్య వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయాలంటే జర్నలిస్టులకు కత్తి మీద సాము లాంటిదే. అయినా కొంతమంది మహిళా జర్నలిస్టులు తమ ప్రాణాలకు తెగించి మరీ అక్కడి పరిస్థితిని ప్రపంచానికి తెలియజేస్తున్నారు.

క్లారిస్సా వార్డ్..

అమెరికాకు చెందిన క్లారిస్సా వార్డ్‌.. సీఎన్‌ఎన్ ఛానల్లో ఇంటర్నేషనల్‌ కరస్పాండెంట్‌గా పని చేస్తోంది. ఈ ఛానల్ తరఫున ఆమె ఉక్రెయిన్‌లోని వాస్తవ పరిస్థితులను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. ఆమె మొదట ఖర్కీవ్‌ పట్టణంలోని రష్యా బలగాల కదలికల గురించి తెలియజేసింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరానికి చేరుకుని రష్యా బలగాలు వాడుతోన్న యుద్ధ సామాగ్రి, ఉక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు తరలిపోతున్న శరణార్థుల గురించిన విషయాలను రిపోర్ట్‌ చేసింది. అక్కడి పరిస్థితులను మానవీయ కోణంలో అర్థం చేసుకున్న క్లారిస్సా.. ఉక్రెయిన్‌ శరణార్థులకు సహాయం చేయడం కోసం కొన్ని సందర్భాల్లో తన టెలికాస్ట్‌ని సైతం ఆపింది. అంతకుముందు ఆమె తాలిబన్లు అఫ్గానిస్థాన్ ఆక్రమించుకున్న విధానం, మయన్మార్‌ అంతర్యుద్ధం వంటి సంఘటనలను కూడా రిపోర్ట్‌ చేసింది. అంతేకాదు, కరోనా వైరస్‌ రెండో దశలో భాగంగా మనదేశంలో చోటు చేసుకున్న భయానక పరిస్థితులను ఆమె ప్రపంచానికి తెలియజేసింది. ఈ క్రమంలో ఆమె పలు అవార్డులనూ సొంతం చేసుకుంది.


లిన్సే అడారియో...

బయటకు వర్ణించలేని ఎన్నో విషయాలు, భావనలను ఒక్క ఫొటోతో వ్యక్తపరచవచ్చు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో లిన్సే అడారియో ఇదే పని చేస్తోంది. ఒక ఫొటో జర్నలిస్టుగా అక్కడి వాస్తవ పరిస్థితులను ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. అమెరికాకు చెందిన లిన్సే న్యూయార్క్‌ టైమ్స్‌, నేషనల్‌ జియోగ్రాఫిక్స్‌, టైమ్‌ పత్రికలకు ఫొటో జర్నలిస్ట్‌గా పని చేస్తోంది. ఆమె ఇంతకుముందు అఫ్గానిస్థాన్‌, ఇరాక్, దర్ఫూర్, కాంగో, హైతీ సంక్షోభాల్లో ప్రాణాలకు తెగించి ఫొటోలు తీసింది. ఆమె దాదాపుగా 21వ శతాబ్దంలో జరిగిన అన్ని యుద్ధాల సమయంలో ఫొటోలు తీసింది. ఇందుకు గాను పులిట్జర్‌ అవార్డుని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని భయానక పరిస్థితులను తన కెమెరాతో ప్రపంచానికి చూపిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఇర్పిన్‌లోని ఓ వంతెన సమీపంలో తీసిన ఓ ఫొటో మనసుని మెలిపెడుతోంది. ఆ ఫొటోలో ఓ కుటుంబంతో పాటు, వారికి సహకరించిన వాలంటీర్‌ రక్తపు మరకలతో అచేతనంగా పడి ఉన్నారు. ఆ చిత్రాలను చూస్తుంటే ఈ పరిస్థితి శత్రువుకు కూడా రాకూడదనేలా హృదయవిదారకంగా ఉన్నాయి.


సారా రెయిన్స్‌ఫోర్డ్...

(Photo: Twitter)

బ్రిటన్‌కి చెందిన సారా రెయిన్స్‌ఫోర్డ్‌ బీబీసీ ఈస్ట్రన్‌ యూరప్‌ కరస్పాండెంట్‌గా పనిచేస్తోంది. అంతకుముందు ఆమె మాస్కో కరస్పాండెంట్‌గా దాదాపు 20 సంవత్సరాల పాటు రష్యాలో పనిచేశారు. గతేడాది ‘దేశ భద్రత’ కారణం చెప్పి ఆమెను రష్యా నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. ఆమె పశ్చిమ దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో వీసాను సైతం రద్దు చేశారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌కి వచ్చిన సారా ఈస్ట్రన్‌ యూరప్‌ వ్యవహారాలను కవర్‌ చేస్తోంది. ఆమె అంతకుముందు క్యూబా, టర్కీ, స్పెయిన్‌ వంటి ప్రాంతాల్లో కూడా జర్నలిస్ట్‌గా పనిచేసింది. ప్రస్తుతం ప్రాణాలకు తెగించి రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించిన అంశాలను రిపోర్ట్ చేస్తోంది. ఆమె ఉక్రెయిన్‌ వాసులు పడుతున్న ఇబ్బందులు, సహాయ కార్యక్రమాల గురించి ప్రధానంగా కవర్‌ చేస్తోంది.


హోలీ విలియమ్స్..

(Photo: Facebook)

ఆస్ట్రేలియాకు చెందిన హోలీ విలియమ్స్‌ సీబీఎస్‌ న్యూస్‌కు పని చేస్తోంది. 2008లో చైనాలో జరిగిన సమ్మర్‌ ఒలింపిక్స్‌ని కవర్‌ చేసిన విలియమ్స్‌.. 12 సంవత్సరాల పాటు అక్కడే కరస్పాండెంట్‌గా పనిచేసింది. ప్రపంచంలోని కొన్ని ప్రమాదకర ప్రాంతాల నుంచి కూడా ఆమె వార్తలందించారు. ఇరాక్‌, సిరియాలో ఉండి అక్కడి సిరియన్‌ పౌర యుద్ధానికి సంబంధించిన వార్తలను రిపోర్డ్‌ చేసింది. ఆ తర్వాత ఉగ్రవాద సంస్థైన ఐసిస్‌కు వ్యతిరేకంగా పలు కథనాలను ప్రచురించి జర్నలిస్ట్‌గా తన నిబద్ధతను చాటుకుంది. ఇందుకుగాను ఎడ్వర్డ్‌ ఆర్ మరో, జాక్‌ ఆర్‌ హోవర్డ్‌ అవార్డులను సొంతం చేసుకుంది. కొన్ని నెలల నుంచి ఉక్రెయిన్‌లో చోటుచేసుకుంటున్న సంఘటనల గురించి ప్రపంచానికి తెలియజేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతానికి సంబంధించిన వార్తలను రిపోర్ట్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి పని చేస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్