ప్రజాసేవ చేస్తాం.. చదువునూ కొనసాగిస్తాం..!

యువత రాజకీయాల్లోకి రావాలని పలువురు పిలుపునిస్తోన్నా.. చాలామంది దూరంగానే ఉంటున్నారు. రాజకీయ రణరంగంలో ప్రవేశించడానికి విముఖత చూపిస్తున్నారు. కొంతమంది వచ్చినా అందులో సింహభాగం రాజకీయ వారసులదే. ఇక మహిళల విషయానికొస్తే రాజకీయాల్లో ఇప్పటికీ వారి సంఖ్య స్వల్పంగానే ఉంటోంది.

Updated : 24 Feb 2022 19:01 IST

(Photo: Instagram)

యువత రాజకీయాల్లోకి రావాలని పలువురు పిలుపునిస్తోన్నా.. చాలామంది దూరంగానే ఉంటున్నారు. రాజకీయ రణరంగంలో ప్రవేశించడానికి విముఖత చూపిస్తున్నారు. కొంతమంది వచ్చినా అందులో సింహభాగం రాజకీయ వారసులదే. ఇక మహిళల విషయానికొస్తే రాజకీయాల్లో ఇప్పటికీ వారి సంఖ్య స్వల్పంగానే ఉంటోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మేము సైతం అంటూ అక్కడక్కడ కొంతమంది అమ్మాయిలు రాజకీయాల్లోకి ప్రవేశించి విజయాలు సాధిస్తున్నారు. వీరిలో ఉన్నత చదువులు చదివిన యువతులూ ఉండడం చెప్పుకోదగిన విషయం. ఇటీవలే తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇందుకు మరోసారి వేదికగా నిలిచాయి. ఇద్దరమ్మాయిలు రెండు పదుల వయసులో కౌన్సిలర్లుగా గెలిచి ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచారు.

దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత ఈ నెల 19న తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఇటీవలే విడుదలైన ఈ ఎన్నికల ఫలితాల్లో అధికారిక డీఎంకే పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఇందులో ఇద్దరమ్మాయిలు పిన్న వయసులో విజయం సాధించిన ఘనత దక్కించుకున్నారు. వారే ప్రియదర్శిని (21), నిల్వరసి దురైరాజ్ (22). ఒకరు వామపక్షాల అభ్యర్థిగా విజయం సాధించగా మరొకరు అధికారిక డీఎంకే పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు.

ఆటో డ్రైవర్‌ కూతురు..

చెన్నైలోని విల్లివక్కం ప్రాంతానికి చెందిన ప్రియదర్శిని ఒక ఆటో డ్రైవర్‌ కూతురు. ఆమె సెంట్రల్‌ చెన్నై 98వ వార్డుకి పోటీ చేసి గెలుపొందింది. 21 ఏళ్ల ప్రియదర్శిని ప్రస్తుతం సామాజిక శాస్త్రంలో డిగ్రీ చదువుతోంది. ఆమె డీవైఎఫ్ఐలో కూడా పని చేసింది. ఆ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి ప్రవేశించింది.

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ప్రియదర్శిని మాట్లాడుతూ ‘మా నాన్న ఆటో డ్రైవర్‌. ఆయన 20 సంవత్సరాలుగా పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. ఇక నా దృష్టంతా నా వార్డులోని నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం పైనే.. నేను ఎదుర్కొన్న ఇబ్బందులు మరొకరికి కలగకుండా చూస్తాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే ప్రజాసేవ చేస్తూనే దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తానని చెప్పుకొచ్చింది.

వాటిని పరిష్కరిస్తా!

ఇక నిల్వరసి దురైరాజ్‌ 22 ఏళ్ల వయసులో చెన్నైలోని కోడంబాకం జోన్ (136 వార్డు) నుంచి అధికారిక డీఎంకే అభ్యర్ధిగా విజయం సాధించింది. నిల్వరసి బీకామ్‌ పూర్తి చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఈ విజయం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నాకు ఓటు వేసి గెలిపించిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మా నాన్న గత 30 సంవత్సరాలుగా ట్రస్ట్‌ ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు. దానిని మరింత ముందుకు తీసుకెళ్తాను. పరిశుభ్రత, పారిశుధ్యంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తాను’ అని చెప్పుకొచ్చింది. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే మరోవైపు ఎంబీయే పూర్తి చేస్తానని చెబుతోందీ అమ్మాయి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్