రీతూ.. ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని బ్రాండ్!

అంతరించిపోతున్న భారతీయ హస్తకళలకు ప్రాణం పోసి, ఆ కళాకారులకు ఉపాధి కల్పించి, వారి పొట్ట నింపిన ఘనత భారతీయ ఫ్యాషన్‌ క్వీన్‌ రీతూ కుమార్‌కే దక్కుతుంది. దేశంలో ఓ ఫ్యాషన్‌ ప్రపంచాన్నే సృష్టించి.. హ్యాండ్‌ బ్లాక్‌ ప్రింటింగ్‌తో వస్త్రాలకు సరికొత్త హంగులద్దిన ఆమె.. భారతీయ వస్త్రకళలను తన ఆరోప్రాణంగా భావించారు.

Updated : 28 Oct 2021 18:14 IST

(Photo: Instagram)

అంతరించిపోతున్న భారతీయ హస్తకళలకు ప్రాణం పోసి, ఆ కళాకారులకు ఉపాధి కల్పించి, వారి పొట్ట నింపిన ఘనత భారతీయ ఫ్యాషన్‌ క్వీన్‌ రీతూ కుమార్‌కే దక్కుతుంది. దేశంలో ఓ ఫ్యాషన్‌ ప్రపంచాన్నే సృష్టించి.. హ్యాండ్‌ బ్లాక్‌ ప్రింటింగ్‌తో వస్త్రాలకు సరికొత్త హంగులద్దిన ఆమె.. భారతీయ వస్త్రకళలను తన ఆరోప్రాణంగా భావించారు. రెండు టేబుళ్లు, నాలుగు హ్యాండ్‌-బ్లాక్‌ ప్రింటర్స్‌తో వ్యాపారాన్ని ప్రారంభించి.. ఫ్యాషన్‌ రంగాన్నే శాసించే స్థాయికి ఎదిగారు. ఐదు దశాబ్దాలుగా తన వ్యాపార దక్షతను చాటుతూ తిరుగులేని ఫ్యాషనర్‌గా పేరు తెచ్చుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో బలమైన బ్రాండ్‌గా తన లేబుల్‌ని తీర్చిదిద్దిన ఆమెతో.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ ఇటీవలే చేతులు కలిపింది. ఈ క్రమంలో రీతూ కుమార్‌ లేబుల్‌ రితికా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 52 శాతం వాటాను రిలయన్స్‌ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో.. రీతూ వ్యాపార ప్రయాణం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

రీతూ కుమార్‌.. భారతీయ ఫ్యాషన్‌ ప్రపంచంలో ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. 1944లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన ఆమె.. అక్కడ చదువుకోవడానికి సరైన సదుపాయాలు లేకపోవడంతో సిమ్లాకు వెళ్లారు. అక్కడే స్కూలింగ్‌ పూర్తిచేసిన రీతూ.. పైచదువుల కోసం దిల్లీలోని లేడీ ఇర్విన్‌ కాలేజీలో చేరారు. అదే సమయంలో శశి కుమార్‌తో ప్రేమలో పడిన ఈ ఫ్యాషనర్‌.. ఆపై అతడినే వివాహం చేసుకున్నారు.

వారికి ఉపాధి కల్పించాలని..!

పెళ్లయ్యాకా విదేశాల్లో తన చదువును కొనసాగించిన రీతూ.. ఇండియాకు తిరిగొచ్చాక మ్యూజియాలజీ చేశారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని Serampore అనే ఓ చిన్న గ్రామానికి వెళ్లారు. అక్కడి ఓ కాలనీ హ్యాండ్‌ బ్లాక్‌ ప్రింటర్స్‌కి పెట్టింది పేరు. కానీ ఆ సమయంలో కళాకారులు పని ఆపేశారని తెలుసుకున్న ఆమె.. ఎలాగైనా వారికి ఉపాధి కల్పించాలని, అంతరించిపోతున్న దేశీయ కళను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 1960లో కోల్‌కతాలో ఓ చిన్న స్టోర్‌ని ప్రారంభించి.. అక్కడి కళాకారులతో చీరలపై హ్యాండ్‌ బ్లాక్‌ ప్రింట్స్‌ని ముద్రించడం మొదలుపెట్టారు. ఇలా విభిన్న డిజైన్లతో తాను రూపొందించిన చీరల్ని ఎగ్జిబిషన్లలో పెట్టడం, వాటికి మంచి స్పందన రావడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు రీతూ.

అందాల పోటీలకూ..!

రెండు టేబుళ్లు, నాలుగు హ్యాండ్‌ బ్లాక్‌ ప్రింటర్స్‌తో ప్రారంభమైన తన వ్యాపార ప్రయాణాన్ని దూకుడుగా ముందుకు సాగించారామె. ఈ క్రమంలోనే 1966లో దిల్లీలోని డిఫెన్స్‌ కాలనీలో తన తొలి బొతిక్‌ని ప్రారంభించారు. ఆపై 1968లో కోల్‌కతాలో మరో బొతిక్‌తో పాటు ఎక్స్‌పోర్ట్‌ కంపెనీని నెలకొల్పారు. ఈ సమయంలో హ్యాండ్‌ బ్లాక్‌ ప్రింటింగ్‌, సిల్క్‌ ప్రింటింగ్‌ పద్ధతులకు ప్రాధాన్యమిచ్చిన రీతూ.. బ్రైడల్‌ వేర్‌, ఈవెనింగ్‌ క్లాత్స్‌ రూపొందించారు. ఆ కాలానికి తగినట్లుగా సంప్రదాయ దుస్తుల్ని, దేశీయ-విదేశీ ఫ్యాషన్లను రంగరించి మోడ్రన్‌ దుస్తుల్నీ అందుబాటులోకి తెచ్చారు. ఇక 1990లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొన్న పోటీదారులు రీతూ ధరించిన దుస్తులు ధరించి ఆ వేదికపై మెరవడం విశేషం. ఇలా అంతర్జాతీయ స్థాయిలోనూ తనదైన మార్క్‌ను ప్రదర్శించారీ మేటి డిజైనర్.

సెలబ్రిటీ డిజైనర్‌గా!

ఫ్యాషన్‌ ప్రపంచంలో సృజనాత్మకతను, దేశీయ హస్తకళల్ని ప్రోత్సహించే నేపథ్యంలో నిర్వహించిన ‘Tree of Life’ అనే ఫ్యాషన్‌ షోలో తన దుస్తుల్ని ప్రదర్శించారు రీతూ. లాక్మే వంటి వేదికల పైనా తన ఫ్యాషన్‌ పరిమళాలు పూయించారు. ఇలా తాను రూపొందించిన దుస్తుల్ని దేశీయంగానే కాదు.. ప్యారిస్‌, లండన్‌, న్యూయార్క్‌లలో స్టోర్లను తెరిచి అక్కడి వారికీ అందుబాటులో ఉంచారు. ఇంతింతై అన్నట్లుగా తన కంపెనీని లాభాల బాట పట్టించిన రీతూ.. 2002లో తన కొడుకు అమ్రిష్‌తో కలిసి ‘రితికా లేబుల్‌’ను స్థాపించారు. తన డిజైన్స్‌లో ఎక్కువగా న్యాచురల్‌ ఫ్యాబ్రిక్స్‌, సంప్రదాయ హస్తకళలు, ప్రింటింగ్‌, నేత కళలకు ప్రాధాన్యమిచ్చే ఈ ఫ్యాషన్‌ క్వీన్‌.. సంప్రదాయ, పాశ్చాత్య దుస్తుల్ని రూపొందించడంలో తనకు సాటి లేదనిపిస్తున్నారు. తన ఫ్యాషన్లతో సామాన్యుల్ని ఆకట్టుకోవడమే కాదు.. దేశ, విదేశీ సెలబ్రిటీలకూ దుస్తుల్ని రూపొందించారు. ఈ క్రమంలోనే ప్రిన్సెస్‌ డయానా, ప్రియాంక చోప్రా, లారా దత్తా, దీపికా పదుకొణె, మాధురీ దీక్షిత్‌, దియా మీర్జా, సోహా అలీ ఖాన్‌, కల్కీ కొచ్లిన్‌.. వంటి ముద్దుగుమ్మలూ వివిధ సందర్భాల్లో రీతూ రూపొందించిన దుస్తులు ధరించి హొయలు పోయారు. అంతేకాదు.. కరీనా కపూర్‌ పెళ్లి కోసం.. ఆమె అత్తగారు షర్మిళా ఠాగూర్ తన పెళ్లిలో ధరించిన లెహెంగాకు ఆధునిక హంగులద్ది మరోసారి తన ఫ్యాషన్‌ నైపుణ్యాల్ని ప్రదర్శించారామె.

రాజీ.. ప్రసక్తే లేదు!

ఇలా తన ఐదు దశాబ్దాల ఫ్యాషన్‌ ప్రయాణంలో నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడలేదని, ఇక పైనా రాజీపడబోనని అంటుంటారామె. ఫ్యాషన్‌పై మక్కువతో, తనదైన వ్యాపార దక్షతతో ‘పయనీర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫ్యాషన్‌’గా పేరు తెచ్చుకున్న రీతూ.. ప్రస్తుతం తన లేబుల్‌తో పాటు ‘RI Ritu Kumar’, ‘aarke’ పేర్లతో మరో రెండు ఫ్యాషన్‌ లేబుల్స్‌ని నిర్వహిస్తున్నారు. మరోవైపు ‘Ritu Kumar Home and Living’ పేరుతో గృహాలంకరణ వస్తువుల్నీ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. ఇలా ప్రస్తుతం రీతూ కుమార్‌ సంస్థకు మొత్తం నాలుగు ఫ్యాషన్‌ బ్రాండ్‌ పోర్ట్‌ఫోలియోలు, అంతర్జాతీయంగా 151 పాయింట్‌ ఆఫ్‌ సేల్స్ (పీఓఎస్‌) ఉన్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా బలమైన బ్రాండ్‌గా గుర్తింపు పొంది, ఫ్యాషన్‌-రిటైల్‌ ఆవిష్కరణలు కలిగి ఉన్న రీతూ కంపెనీ రితికా ప్రైవేట్‌ లిమిటెడ్‌లోని 52 శాతం వాటాను ఇటీవలే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్ కొనుగోలు చేసింది. కంపెనీలో అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ ఎవర్‌స్టోన్‌కు ఉన్న మొత్తం 35 శాతం వాటాను ఈ కంపెనీ కొనుగోలు చేసినట్లు రితికా ప్రై.లి. వెల్లడించింది.

‘పద్మశ్రీ’ వరించింది!

* దేశీయ హస్తకళల్ని ప్రోత్సహించి.. ఫ్యాషన్‌ రంగంలో తనదైన ముద్ర వేసిన రీతూని భారత ప్రభుత్వం 2013లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది.

* భారతీయ వస్త్రకళలు, ఫ్రెంచ్‌ ఫ్యాషన్స్‌కి వారధిగా నిలిచిన రీతూను ఫ్రెంచ్‌ ప్రభుత్వం Knight of the Order of Arts and Letters పురస్కారంతో గౌరవించింది.

* హస్తకళలపై తనకున్న మక్కువతో ‘Costumes and Textiles of Royal India’ పేరుతో ఓ పుస్తకాన్ని సైతం విడుదల చేశారు రీతూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్