ఆ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా మన తెలుగు తేజం!

నచ్చిన కెరీర్‌ని ఎంచుకోవడమే కాదు.. అందులో ఎదిగినప్పుడే దానికి పూర్తి సార్థకత! ఇదే విషయం నిరూపిస్తున్నారు ఇండో-అమెరికన్‌ నీలి బెండపూడి. టీచర్‌గా

Updated : 13 Dec 2021 13:15 IST

(Photo: Twitter)

నచ్చిన కెరీర్‌ని ఎంచుకోవడమే కాదు.. అందులో ఎదిగినప్పుడే దానికి పూర్తి సార్థకత! ఇదే విషయం నిరూపిస్తున్నారు ఇండో-అమెరికన్‌ నీలి బెండపూడి. టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. తన మూడు దశాబ్దాల కెరీర్‌లో వైస్‌ఛాన్స్‌లర్‌గా, డీన్‌గా ఎన్నెన్నో అత్యున్నత పదవుల్ని అలంకరించారు. ఇక తాజాగా ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా యూనివర్సిటీకి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. తద్వారా ఈ పదవి అధిరోహించనున్న తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి తెలుగు వనితగా చరిత్ర సృష్టించారు నీలి. మరి, టీచింగే తన ఆరో ప్రాణమంటోన్న ఈ సూపర్‌ ఉమన్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీకి ప్రస్తుతం ఎరిక్‌ జె బారన్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సుమారు మూడు దశాబ్దాల పాటు ఈ విశ్వవిద్యాలయంతో ఆయనకు అనుబంధం ఉంది. అయితే వచ్చే ఏడాది ఆయన పదవీ విరమణ చేస్తుండడంతో ఆ స్థానంలోకి నీలి బెండపూడి రానున్నారు. ఈ క్రమంలో పెన్సిల్వేనియా స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఆమెను ఈ పదవికి ఎంపిక చేసింది. దీంతో వచ్చే ఏడాది ఈ పదవి చేపట్టనున్నారు నీలి.

మూడు దశాబ్దాల ప్రస్థానంలో..!

* ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పుట్టారు నీలి బెండపూడి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన ఆమె.. పైచదువుల కోసం 1986లో అమెరికా వెళ్లారు. కన్సాస్‌ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్‌లో డాక్టరేట్‌ పట్టా పుచ్చుకున్నారు.

* ఎంతో మక్కువతో టీచింగ్‌నే వృత్తిగా ఎంచుకున్న ఆమె.. తన 30 ఏళ్ల కెరీర్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. లూయిస్‌విల్లే, కన్సాస్‌, ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ, Texas A&M.. వంటి విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ‘కన్సాస్‌ యూనివర్సిటీ’కి వైస్‌ ఛాన్స్‌లర్‌గా, ‘యూనివర్సిటీ ఆఫ్‌ కన్సాస్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’కి డీన్‌గా, ‘ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ’లో ‘Initiative for Managing Services’కి ఫౌండింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

* మార్కెటింగ్‌, కన్జ్యూమర్‌ బిహేవియర్.. వంటి అంశాల్లో మంచి పట్టున్న నీలి.. UG, Graduate, PhD విద్యార్థులకు మార్కెటింగ్‌ సబ్జెక్ట్‌ బోధించారు.

* తన వృత్తి నైపుణ్యాలకు గుర్తింపుగా ‘అవుట్‌స్టాండింగ్‌ మార్కెటింగ్‌ టీచర్‌ అవార్డు’ అందుకున్నారు నీలి. దీంతో పాటు పలు కళాశాలల నుంచి, జాతీయ స్థాయిలో పలు అవార్డులు-రివార్డులు ఆమె సొంతమయ్యాయి.

* AIG, Proctor & Gamble, US Army.. వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు కన్సల్టెంట్‌గానూ వ్యవహరించారు నీలి. అంతేకాదు.. ‘Huntington National Bank’కి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, చీఫ్‌ కన్జ్యూమర్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు.

* ప్రస్తుతం లూయిస్‌విల్లేలోనే స్థిరపడిన ఆమె.. ఆ యూనివర్సిటీకి 18వ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌ను విద్యార్థుల, అధ్యాపకుల, ఇతర సిబ్బంది అభివృద్ధికే అంకితం చేశారు.

* డాక్టర్‌ వెంకట్‌ బెండపూడిని వివాహం చేసుకున్నారు నీలి. ఆయన పలు ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీగా సేవలందించారు. ఈ జంటకు శిరీష అనే కూతురుంది.

* అమెరికాలో స్థిరపడినా తెలుగు మూలాల్ని మాత్రం మర్చిపోలేదీ గ్రేట్‌ టీచర్‌. కుటుంబ సమేతంగా తాను జరుపుకొనే ప్రతి పండగ వేడుకల్ని, తన తల్లిదండ్రులతో కలిసి గడిపిన క్షణాల్ని ఫొటోల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారామె.

అదే విజయానికి నాంది!

‘అవకాశాలు సృష్టించుకొని.. వాటిని అందిపుచ్చుకున్నప్పుడే విజయం వరిస్తుంది. నన్ను ఈ కొత్త పదవికి ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించి యూనివర్సిటీ అభ్యున్నతికి పాటుపడతా..’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు నీలి.

ఇలా తన పాఠాలతో, స్ఫూర్తిదాయక మాటలతో ఎంతోమంది విద్యార్థుల సక్సెస్‌కు పూలబాట పరిచి.. ప్రపంచంలోనే మేటి టీచర్‌గా గుర్తింపు సంపాదించారీ తెలుగు మహిళ.

కంగ్రాట్స్‌ & ఆల్‌ ది బెస్ట్‌ మేడమ్‌!!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్