67 ఏళ్ల వయసులో మోడలింగ్‌ చేస్తోంది.. ఈ డాక్టర్!

వివిధ కారణాల వల్ల చాలామంది తమ అభిరుచిని పక్కన పెట్టి ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కాలం గడిపేస్తుంటారు. తీరా, పరిస్థితులు చక్కబడ్డాక ఈ వయసులో ఏం చేస్తామని వెనకడుగు వేస్తుంటారు. కానీ, కొంతమంది మనసుకు నచ్చిన పని చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తుంటారు. దిల్లీకి చెందిన డాక్టర్‌ గీతా ప్రకాశ్‌ ఈ జాబితాలో ముందు....

Published : 13 Mar 2022 12:58 IST

(Photo: Instagram)

వివిధ కారణాల వల్ల చాలామంది తమ అభిరుచిని పక్కన పెట్టి ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కాలం గడిపేస్తుంటారు. తీరా, పరిస్థితులు చక్కబడ్డాక ఈ వయసులో ఏం చేస్తామని వెనకడుగు వేస్తుంటారు. కానీ, కొంతమంది మనసుకు నచ్చిన పని చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తుంటారు. దిల్లీకి చెందిన డాక్టర్‌ గీతా ప్రకాశ్‌ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు. 57 ఏళ్ల వయసులో ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె ప్రస్తుతం పలు ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో నచ్చిన పని చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు. ఓవైపు డాక్టర్‌గా సేవలందిస్తూనే మరోవైపు మోడల్‌గా రాణిస్తోన్న గీతా ప్రకాశ్‌ గురించి మరిన్ని విశేషాలు మీకోసం...

అలా అవకాశం లభించింది...

గీత బాల్యమంతా కశ్మీర్‌లో గడిచింది. ఆ తర్వాత ఎంబీబీస్‌ పూర్తి చేసి వైద్యురాలిగా స్థిరపడ్డారు. ఆమె పేదల కోసం ఒక ఛారిటబుల్‌ క్లినిక్‌ని సైతం నిర్వహిస్తున్నారు. అయితే ఆమె ఎప్పుడూ మోడలింగ్‌ చేయాలని ఆలోచించలేదట. ఆమె ఎక్కువ సమయం వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయడంలోనే గడిపారు. అలా 57 ఏళ్లు గడిచిపోయాయి. అయితే ఒక రోజు ఓ ఇటాలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆమె క్లినిక్‌కు వైద్యం చేయించుకోవడానికి వచ్చారు. అతనితో మాట్లాడే క్రమంలో గీతను మోడలింగ్‌ చేయమని అడిగాడు. ఆమె అప్పుడు దానిని అంత సీరియస్‌గా తీసుకోలేదు. తర్వాత కొన్ని రోజులకు అతను ఫోన్‌ చేసి మోడలింగ్‌కు ఫొటోలు పంపమని అడగడంతో ఆమెకు మోడలింగ్‌ చేయాలన్న ఆసక్తి పెరిగిందట. అయితే అప్పటిదాకా మోడలింగ్ అంటే తెలియని గీత సాధారణంగా దిగిన కొన్ని ఫొటోలను అతనికి పంపారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆమెకు మొదటి అవకాశం లభించింది. అలా మొదటిసారి తరుణ్‌ తహిలియానికి మోడల్‌గా వ్యవహరించారు. అలా క్రమంగా పలు ప్రముఖ బ్రాండ్లకు మోడలింగ్‌ చేస్తూ ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

రెండూ ముఖ్యమే...

గీత ఒకవైపు మోడల్‌గా రాణిస్తున్నా  తన వైద్య వృత్తికి ఎప్పుడూ ఫుల్‌స్టాప్‌ పెట్టలేదు. పని దినాల్లో తన పేషెంట్లకు చికిత్సను అందిస్తూనే వారాంతాల్లో మోడలింగ్‌కు సమయం కేటాయిస్తుంటారు. మరోపక్క తన ఛారిటబుల్ క్లినిక్‌ పనులను కూడా చూసుకుంటారు. అలాగే యూట్యూబ్‌లో పలు ఆరోగ్య సమస్యలు.. వాటికి సంబంధించిన చికిత్సల గురించి వీడియోలు కూడా చేస్తుంటారు. ఈ క్రమంలో ఏ వయసులో ఉన్నా.. కలల్ని సాకారం చేసుకోవడం మాత్రం ఆపద్దని తోటి మహిళలకు సలహా ఇస్తున్నారు. అభిరుచులు, మనసుకు నచ్చిన పని చేయడానికి వయసు అడ్డంకి కాదని ఈ సందర్భంగా చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్