మెహెందీ ఫంక్షనా? ఈ పొరపాట్లు చేయకండి!

ఐదు రోజుల పెళ్లిళ్లు ఇప్పుడు కామనైపోయాయి. ఇందులో భాగంగానే హల్దీ, మెహెందీ, సంగీత్‌..

Published : 25 Apr 2022 19:13 IST

ఐదు రోజుల పెళ్లిళ్లు ఇప్పుడు కామనైపోయాయి. ఇందులో భాగంగానే హల్దీ, మెహెందీ, సంగీత్‌.. వంటి ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్ని పెళ్లి మాదిరిగానే ఘనంగా చేసుకుంటున్నారు చాలామంది. వీటిలోనూ ఒక్కో వేడుకకు ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లే.. మెహెందీ ఫంక్షన్లోనూ వధువులు పూల ఆభరణాలతో అలంకరించుకొని, చేతులు-కాళ్లను గోరింటాకుతో నింపేసుకుంటారు. అయితే ఈ క్రమంలో తెలియకుండా దొర్లే కొన్ని పొరపాట్లు ఒకింత అసౌకర్యానికి గురిచేస్తాయంటున్నారు నిపుణులు. తద్వారా ఫంక్షన్లో పూర్తి స్థాయిలో ఎంజాయ్‌ చేయలేరని చెబుతున్నారు. మరి, అలా జరగకుండా ఉండాలంటే వధువులు దృష్టిలో ఉంచుకోవాల్సిన కొన్ని అంశాలేంటో తెలుసుకుందాం రండి..

డిజైన్‌ ఎంచుకున్నారా?

పెళ్లికి పెట్టుకునే మెహెందీ ఇతర సందర్భాలకు భిన్నంగా ఉండాలనుకుంటారు చాలామంది. ఈ క్రమంలోనే ‘నా బ్రైడల్‌ మెహెందీ అలా ఉండాలి.. ఇలా ఉండాలి..’ అని ఊహించుకుంటారు. అయితే ఇలా ఊహించుకొని సరిపెట్టుకుంటే తీరా సమయానికి హడావిడి పడాల్సి వస్తుంది.. ఆ ఆదుర్దాలో నిపుణులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే మీరు అనుకున్నట్లుగా మెహెందీ డిజైన్‌ రాకపోవచ్చు.. పైగా ఫంక్షన్లో పెళ్లికూతురు మెహెందీ అలా ఉండాలి, ఇలా ఉండాలని చుట్టూ ఉన్న వారు సలహాలిస్తుంటారు. అదీ మీకు నచ్చదు.. ఇలాంటి హడావిడి నడుమ వేడుకంతా గడిచిపోతుంది. తద్వారా ఎంజాయ్‌ చేసిన ఫీలింగే ఉండదు. కాబట్టి ఈ పొరపాటు దొర్లకుండా ఉండాలంటే మీ బ్రైడల్‌ మెహెందీ డిజైన్‌ను ముందే ఎంచుకోవడం మంచిది. తద్వారా మీకు నచ్చిన డిజైన్‌ను చేతులు, కాళ్లపై సింగారించుకోవచ్చు.. వేడుకనూ ఎంజాయ్‌ చేయచ్చు.

ముదురు రంగులు మేలు!

కేవలం మెహెందీ డిజైనే కాదు.. మెహెందీ ఫంక్షన్‌ కోసం ఎంచుకునే అవుట్‌ఫిట్‌ విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు పెళ్లి కూతుళ్లు. ఈ క్రమంలో ఎవరి అభిరుచుల్ని బట్టి తమకు నచ్చిన, నప్పిన దుస్తుల్ని ఎంపిక చేసుకుంటారు. అయితే ఇక్కడా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎలాగూ మోచేతులు, పాదాల పైవరకు గోరింటాకు పెట్టుకుంటాం కాబట్టి.. అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఎత్నిక్‌ క్యాప్రీ సల్వార్‌, షార్టర్‌ లెహెంగా, స్లీవ్‌లెస్‌ టాప్స్‌, బ్లౌజులు.. వంటివి ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇవి కాస్త మోడ్రన్‌గా ఉంటాయి.. బాగుండవేమో అని సందేహించేవారు.. లెహెంగా, చీర.. వంటివి ఎంచుకున్నా గోరింటాకు ఆరే దాకా ఒకే చోట కూర్చోవడం మంచిది. అలాగే మీరు ఎంచుకున్న డ్రస్‌ ఏదైనా సరే.. లేత వర్ణాల కంటే ముదురు రంగులో ఉన్నవి ఎంచుకుంటే ఒకవేళ గోరింటాకు అంటుకున్నా.. మరక ఏర్పడకుండా అందులోనే కలిసిపోతుంది.

సౌకర్యానికి ప్రాధాన్యం!

గోరింటాకు ఫంక్షన్‌ అంటే.. ఫొటోలు, డ్యాన్సులతో హంగామా ఉంటుంది. అలాగని మెహెందీ డిజైన్‌ పూర్తి కాకుండానే డ్యాన్సులు చేస్తామంటే.. ఆ ఉత్సాహంలో గోరింటాకు చెదిరిపోయే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి డిజైన్‌ మొత్తం పూర్తయ్యేదాకా ఓపిక వహించాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి మీరు కూర్చునే ప్రదేశం మీకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటుచేసుకోవాలి. దిండ్లు, పరుపులు, కుషన్లతో మెహెందీ వేదికను అలంకరిస్తే సౌకర్యంగా ఉంటుంది. అలాగే మధ్యమధ్యలో ఫొటోగ్రాఫర్లు ఫొటోలు క్లిక్‌మనిపిస్తుంటారు కాబట్టి మీ బ్యాక్‌గ్రౌండ్‌ని రంగురంగుల పూలు, ఇతర డెకరేటివ్‌ పీసెస్‌తో.. థీమ్‌కు తగ్గట్లుగా అలంకరించుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది.

ఆరు గంటల ముందు..!

కొంతమంది సమయం లేదని ఇలా మెహెందీ డిజైన్‌ పెట్టుకొని.. ఆరాక అలా తొలగిస్తుంటారు. అయితే దీనివల్ల గోరింటాకు అంతగా పండకపోవచ్చంటున్నారు నిపుణులు. అందుకే మెహెందీ పెట్టుకున్న తర్వాత తొలగించడానికి కనీసం ఆరు గంటలైనా గ్యాప్‌ ఇవ్వమని సూచిస్తున్నారు. ఇక పెళ్లి సమయానికి గోరింటాకు ఎర్రగా పండడానికి మార్కెట్లో ప్రత్యేకమైన క్రీమ్‌లు, లోషన్లు దొరుకుతున్నాయి. అలాగే ఇంట్లో దొరికే యూకలిప్టస్‌ ఆయిల్‌, నిమ్మ-చక్కెర మిశ్రమం.. వంటి సహజసిద్ధమైన చిట్కాలూ ప్రయత్నించచ్చు. అలాగే మెహెందీ వేడుక పెళ్లికి ముందు రోజు లేదా పెళ్లి రోజు ఉదయం పెట్టుకోకుండా.. రెండు రోజుల ముందే నిర్వహించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్