Published : 09/05/2022 20:36 IST

‘ఇడ్లీ అమ్మ’కు ఇల్లు కట్టిచ్చారు!

రూపాయికే నాలుగు ఇడ్లీలు అమ్ముతూ పేదవాళ్ల ఆకలి తీర్చుతోన్న కమలత్తాళ్‌ బామ్మ మీకు గుర్తుండే ఉంటుంది కదూ! నిజానికి తన అసలు పేరు కంటే ‘ఇడ్లీ అమ్మ’ అనే పేరుతోనే ఎక్కువమందికి చేరువైందీ తమిళనాడు బామ్మ. రెండేళ్ల క్రితం వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా కంట పడి సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిన ఈ గ్రానీ.. ఇప్పుడు ఆయన పుణ్యమాని మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బామ్మ కోరిక మేరకు తన సొంత డబ్బుతో ఓ ఇల్లు కట్టిస్తానని ఆయనిచ్చిన మాట మదర్స్‌ డే రోజున నిలబెట్టుకున్నారు. ఈ శుభ సందర్భాన ఇంటి తాళాలు ఆమెకిచ్చి.. నిరుపేదల్నే బిడ్డలుగా భావించి ఆమె చేస్తోన్న సేవల్ని, ఆమెలోని మాతృత్వాన్ని కొనియాడారాయన. ఈ నేపథ్యంలో ఈ ఇడ్లీ బామ్మ కథ ఎక్కడ, ఎలా మొదలైందో తెలుసుకుందాం రండి..

కమలత్తాళ్‌ది తమిళనాడులోని పేరూర్‌కు సమీపంలోని వడివేలంపాలయం అనే గ్రామం. వ్యవసాయాధారిత కుటుంబం కావడంతో రోజూ ఆమెను ఇంట్లో వదిలేసి ఆమె కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లేవారు. దాంతో బోర్‌గా ఫీలైన ఈ బామ్మ.. ఈ ఖాళీ సమయంలో ఏదో ఒకటి చేయాలని ఆలోచించింది. ఈ క్రమంలోనే ఇడ్లీలు చేయాలన్న ఆలోచన తనకు వచ్చిందంటోందీ బామ్మ.

ఆరు గంటలకు మొదలు..

‘నేను ఇడ్లీలు చేయడం చూసి.. ఈ వయసులో ఈవిడ ఇన్ని ఇడ్లీలు ఎలా చేస్తుందో? అని ఆశ్చర్యపోతుంటారు చాలామంది. కానీ, ఎక్కువ మొత్తంలో వంటలు చేయడం నాకు కొత్తేమీ కాదు. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులందరికీ నేనే వంటచేసి పెట్టేదాన్ని. అలా ఎక్కువమందికి వంట చేయడం అలవాటుగా మారింది. అందుకే ఈ వయసులోనూ ఇడ్లీలు చేయడం పెద్దగా కష్టమనిపించట్లేదు. ఉదయాన్నే ఆరు గంటలకు లేవడం నాకు అలవాటు. ఆపై చకచకా స్నానం, పూజ ముగించుకొని నా కొడుకుతో కలిసి తోటకు వెళ్తాను. అక్కడ తాజా కాయగూరలు కోసుకొని తిరిగి ఇంటికి చేరుకుంటాను. వీటితో రుచికరమైన సాంబార్ ఓవైపు తయారుచేస్తూనే.. మరోవైపు కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తాను. ఇక ఇడ్లీ పిండి అంటారా.. అది ముందు రోజు రాత్రే తయారుచేసి పెట్టుకుంటాను. అలాగని ఏ మిక్సీలోనో లేదంటే గ్రైండర్‌లోనో రుబ్బుతానేమో అనుకునేరు. అస్సలు కాదు.. రోజూ పిండంతా రోట్లోనే రుబ్బుతా.. అలా రోజూ వెయ్యి ఇడ్లీలకు సరిపడా పిండిని.. అంటే సుమారు ఆరు కిలోల చొప్పున మినప్పప్పు, బియ్యం ముందుగా నానబెట్టి.. ఆపై దాదాపు నాలుగ్గంటల పాటు చక్కగా రోట్లోనే రుబ్బుతాను..’

కట్టెల పొయ్యి నుంచి గ్యాస్‌ స్టౌ దాకా..!

‘ఇక ఉదయం చట్నీ, సాంబార్ తయారయ్యేసరికి ఎనిమిదవుతుంది. అప్పుడు ఇడ్లీలు చేయడం మొదలుపెడతాను. అప్పటికే చాలామంది నా ఇడ్లీల కోసం ఎదురు చూస్తుంటారు. అలా ఒక విడతలో 37 ఇడ్లీల చొప్పున తయారవుతాయి. నేను తయారుచేసిన ఇడ్లీ పిండి మధ్యాహ్నం దాకా వచ్చిన కస్టమర్లకు సరిపోతుంది..’ అని చెప్పుకొచ్చిందీ బామ్మ. అయితే రెండేళ్ల క్రితం దాకా అన్ని వంటకాలు కట్టెల పొయ్యి మీదే చేసిందీ బామ్మ. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చొరవతో ఈ ఇడ్లీ బామ్మకు ఓ ఎల్‌పీజీ గ్యాస్ స్టౌ అందింది. దీంతో అప్పట్నుంచి గ్యాస్‌ స్టౌ పైనే తన వంటకాల్ని చకచకా పూర్తిచేస్తోంది.

అప్పుడు గ్యాస్‌.. ఇప్పుడు ఇల్లు!

రెండేళ్ల క్రితం ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌తో కోయంబత్తూర్‌ భారత్‌ గ్యాస్‌ విభాగం కమలత్తాళ్‌కు వంటగ్యాస్‌ కనెక్షన్‌ అందించింది. నాటి నుంచి నేటి దాకా గ్యాస్‌కయ్యే ఖర్చును ఆయనే భరిస్తున్నారు. కాగా, మరో ట్వీట్‌లో భాగంగా.. ఈ బామ్మకు సొంత ఇల్లు కట్టిస్తానని, తద్వారా తన సొంతింట్లోనే మరింత సౌకర్యవంతంగా ఇడ్లీలు చేసి అమ్ముకునే వీలు కల్పిస్తానని మహీంద్రా మాటిచ్చారు. ఆ మాటను ఈ మదర్స్‌ డే సందర్భంగా నిలబెట్టుకున్నారాయన. తన గ్రూప్‌కు చెందిన మహీంద్రా లైఫ్ స్పేసెస్‌ సంస్థ నిర్మించిన ఈ ఇంటి తాళాల్ని ఈ శుభ సమయాన ఆమె చేతికి అందించారాయన.‘పోషణ, సంరక్షణ, నిస్వార్థం.. వంటి సుగుణాలన్నీ పుణికి పుచ్చుకున్న మాతృహృదయం ఈ ఇడ్లీ అమ్మది! మాతృ దినోత్సవం సందర్భంగా ఇలా ఆమెకు, ఆమె సేవకు అండగా నిలవడం గొప్ప గౌరవం!’ అంటూ ట్వీట్‌ చేశారాయన. దీంతో ఆయన మంచి మనసుకు, ఈ బామ్మ సమాజ సేవకు సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కస్టమర్లు కాదు.. నా పిల్లలు!

కమలత్తాళ్‌ ఈ ఇడ్లీ వ్యాపారం ప్రారంభించి దాదాపు 37 ఏళ్త్లెంది. పదేళ్ల క్రితం వరకు అర్ధ రూపాయికే నాలుగు ఇడ్లీలు అమ్మే ఈ బామ్మ.. ముడిసరుకుల ధరలు పెరగడంతో మరో అర్ధ రూపాయి పెంచి గత పదేళ్లుగా రూపాయికి నాలుగు ఇడ్లీల చొప్పున అమ్ముతోంది. ఈ చుట్టు పక్కల ఉండే ఎంతోమంది పేదవాళ్లకు రూ. 20 పెడితే కానీ కడుపు నిండా అల్పాహారం దొరకని పరిస్థితి..! అలాంటిది రూపాయికే వాళ్ల ఆకలి తీర్చుతోంది. 
‘చాలామంది తమ వద్ద డబ్బులు లేక అలాగే కడుపు మాడ్చుకుంటున్నారు. అందుకే అలాంటి వారి కడుపు నింపడానికే ఈ ఇడ్లీలమ్మడం ప్రారంభించాను.. అంతేకానీ డబ్బుల కోసం కాదు! అయినా ఈ ఇడ్లీ వ్యాపారం ద్వారా నాకు రోజుకు సుమారు రూ. 200 దాకా వస్తున్నాయి. నా ఇడ్లీలు తినడానికి నా హోటల్‌కి వచ్చే వాళ్లు నాకు కస్టమర్లుగా అనిపించరు. వాళ్లూ నా బిడ్డలతో సమానం. వారినీ నా కుటుంబంలో ఒకరిగా భావించి ఎంతో తృప్తిగా వారికి ఇడ్లీలు వడ్డించడం చాలా ఆనందంగా ఉంది. వాళ్లు కూడా.. సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేసిన నా ఇడ్లీలు ఎంతో రుచిగా ఉన్నాయంటూ కడుపు నిండా తినేసి వెళ్తుంటారు. అందుకే ఎంతమంది వచ్చినా ఇడ్లీ ధర మాత్రం పెంచను. వాళ్ల కోరిక మేరకే ప్రస్తుతం ఇడ్లీలతో పాటు ఉజుంతు బోండా (మైసూర్ బోండా) కూడా తయారుచేస్తున్నా. నాలుగు బోండాలు రూ. 2.50కు అమ్ముతున్నా..’ అని చెబుతున్నారీ బామ్మ.

ఆపమన్నా.. ఆపను!

వయసు మీరుతున్నా, ఎంతమంది వద్దంటున్నా మరింత ఉత్సాహంగా పని చేస్తానే తప్ప నా సేవ మాత్రం ఆపనే ఆపనంటున్నారు కమలత్తాళ్. ‘నా మనవలు, మనవరాళ్త్లెతే.. ‘బామ్మా.. ఈ వయసులో నీకు ఎందుకింత శ్రమ. ఈ పని మానేసి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చుగా..’ అంటుంటారు. కానీ నేను అందుకు ఒప్పుకోను. పేద వారికి ఇలా నా చేత్తో వండిపెట్టడంలోనే నాకు అసలైన ఆనందం ఉంది. ప్రస్తుతం 87 ఏళ్ల వయసులోనూ నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఈ పనిని, దీని ద్వారా వచ్చే ఆనందాన్ని దూరం చేసుకోను.. మీరు కూడా ఎప్పుడైనా మా వూరొస్తే మా ఇంటికొచ్చి ఇడ్లీలు తిని వెళ్లడం మాత్రం మర్చిపోకండి..’ అంటూ అందరినీ ఆప్యాయంగా ఆదరిస్తున్నారీ ఇడ్లీ బామ్మ.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని