వీటిని కలిపి వాడకూడదు..!

ఎవరైనా సరే.. ఇల్లు శుభ్రంగా కళకళలాడుతూ కనిపించాలని కోరుకోవడం సహజం. ఈ క్రమంలో ఇంటిని శుభ్రం చేసుకోవడానికి సహజసిద్ధమైన ఉత్పత్తులతో పాటు కొన్ని రసాయనిక ఉత్పత్తులను కూడా వాడుతుంటారు. ఇంకొందరు ఇంటిని లేదా వస్తువులను కొత్త వాటిలా మెరిపించాలని రెండు రకాల క్లీనింగ్....

Published : 04 May 2022 20:53 IST

ఎవరైనా సరే.. ఇల్లు శుభ్రంగా కళకళలాడుతూ కనిపించాలని కోరుకోవడం సహజం. ఈ క్రమంలో ఇంటిని శుభ్రం చేసుకోవడానికి సహజసిద్ధమైన ఉత్పత్తులతో పాటు కొన్ని రసాయనిక ఉత్పత్తులను కూడా వాడుతుంటారు. ఇంకొందరు ఇంటిని లేదా వస్తువులను కొత్త వాటిలా మెరిపించాలని రెండు రకాల క్లీనింగ్ ఉత్పత్తులను కలిపి మరీ ఉపయోగిస్తుంటారు. అయితే శుభ్రపరచడానికి వాడే రసాయనిక ఉత్పత్తుల్లో కొన్నింటిని అస్సలు కలపకూడదు. విడివిడిగానే ఉపయోగించాలి. లేదంటే పలు అనారోగ్యాల బారిన పడడంతో పాటు ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ఉత్పత్తులను కలిపి ఉపయోగించకూడదు.. ఒకవేళ అలా ఉపయోగిస్తే ఎలాంటి పరిణామాలుంటాయి..? తదితర విషయాల గురించి మనమూ తెలుసుకుందాం రండి..

ఇంటిని శుభ్రం చేసేటప్పుడు వెనిగర్, బ్లీచ్, రబ్బింగ్ ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్.. వంటి రసాయన ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తుంటాం. అయితే వీటిని విడివిడిగా ఉపయోగించినంత వరకు ఎలాంటి హానీ ఉండదు. కానీ ఇలాంటి ఉత్పత్తుల్లో కొన్నింటిని వేరే వాటితో కలిపి ఉపయోగిస్తే మాత్రం ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు, మన ప్రాణాలకు కూడా అవి ముప్పు కలిగించవచ్చు. కాబట్టి అలాంటి ప్రమాదకర సమ్మేళనాల గురించి ముందుగానే తెలుసుకొని జాగ్రత్తపడడం ఎంతో అవసరం.

బేకింగ్ సోడా - వెనిగర్

బేకింగ్ సోడా, వెనిగర్ కలపడం వల్ల అధిక మొత్తంలో నీటితో పాటు కాస్త సోడియం ఎసిటేట్ అనే రసాయనం కూడా ఏర్పడుతుంది. ఈ మిశ్రమాన్ని ఏదైనా మూసి ఉంచిన సీసా లేదా డబ్బాలో భద్రపరిస్తే అది పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇల్లు శుభ్రం చేసే క్రమంలో ఈ రెండింటినీ విడివిడిగానే ఉపయోగించాలి.

బ్లీచ్- వెనిగర్

ఈ రెండింటినీ కలపడం వల్ల క్లోరిన్ వాయువు అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. ఈ వాయువు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, కళ్లు మండడం, నీరు కారడం.. వంటివి వచ్చే అవకాశముంటుంది. కాబట్టి ఈ ఉత్పత్తులను కలపకుండా ఉపయోగించడమే శ్రేయస్కరం.

బ్లీచ్ - రబ్బింగ్ ఆల్కహాల్

బ్లీచ్‌ను నీటితో తప్ప ఏ ఇతర రసాయనాల్లోనూ కలిపి ఉపయోగించకూడదు. ముఖ్యంగా దీనిని రబ్బింగ్ ఆల్కహాల్‌తో కలపడం వల్ల క్లోరోఫామ్ అంటే మత్తుమందు తయారవుతుంది. దీని కారణంగా శరీరంలోని నాడీ వ్యవస్థ, కళ్లు, చర్మం, వూపిరితిత్తులు, మూత్రపిండాలు.. మొదలైన వాటికి హాని కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మరీ అధిక మొత్తంలో క్లోరోఫామ్ ఉత్పత్తి అయితే దాని ప్రభావం వల్ల మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి బ్లీచ్‌ను దేనితోనూ కలపకుండా విడిగానే ఉపయోగించాలి.

అమ్మోనియా - బ్లీచ్

బ్లీచ్, అమ్మోనియాలను కలపడం వల్ల క్లోరమైన్ అనే హానికారక వాయువు ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఛాతీలో నొప్పి, వూపిరి అందకపోవడం.. వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

హైడ్రోజన్ పెరాక్సైడ్ - వెనిగర్

మనం ఇంటిని లేదా ఇంట్లోని వస్తువుల్ని శుభ్రం చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్, వెనిగర్‌లను కలపకూడదు. అలా చేయడం వల్ల చర్మానికి, కళ్లకు, శ్వాస వ్యవస్థకు ఇబ్బంది కలిగి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

చూశారుగా.. 'క్లీనింగ్ ఉత్పత్తులే కదా!' అని తేలిగ్గా తీసుకొని.. వీటిలో ఏ రెండింటిని కలిపి ఉపయోగించినా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో! వీటిని గుర్తుంచుకొని ఇక మీదట జాగ్రత్త వహించండి.. ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్