వీటిని అవెన్‌లో వండకూడదట!

మైక్రోవేవ్‌ అవెన్‌ ఇప్పుడు ప్రతి ఇంట్లో భాగమైపోయింది. బేక్‌ చేయడం, గ్రిల్‌ చేయడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాల్ని వండుకోవడానికి, వేడి చేసుకోవడానికీ దీన్ని ఉపయోగిస్తుంటాం. దీంతో ఏ వంటైనా నిమిషాల్లో సిద్ధమైపోతుంది కూడా! అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల్ని వండుకోవడానికి అవెన్‌ని ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

Published : 06 Feb 2022 11:52 IST

మైక్రోవేవ్‌ అవెన్‌ ఇప్పుడు ప్రతి ఇంట్లో భాగమైపోయింది. బేక్‌ చేయడం, గ్రిల్‌ చేయడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాల్ని వండుకోవడానికి, వేడి చేసుకోవడానికీ దీన్ని ఉపయోగిస్తుంటాం. దీంతో ఏ వంటైనా నిమిషాల్లో సిద్ధమైపోతుంది కూడా! అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల్ని వండుకోవడానికి అవెన్‌ని ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. మరి, ఏంటా పదార్థాలు? తెలుసుకుందాం రండి..

* కోడిగుడ్లను తక్కువ సమయంలో ఉడికించడానికి కొంతమంది అవెన్‌ వాడుతుంటారు. నిజానికి ఈ క్రమంలో మనం ఎక్కువ ఉష్ణోగ్రతను సెట్‌ చేయాల్సి ఉంటుంది. తద్వారా అందులోని కీలక పోషకాలు నశించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని స్టౌ లేదా ఎగ్‌ బాయిలర్‌లో ఉడికించడమే మంచిదంటున్నారు నిపుణులు.

* అవెన్‌లో అన్నాన్ని ఉడికించుకోవడం వల్ల అందులోని Bacillus Cereus అనే బ్యాక్టీరియా అన్నాన్ని విషపూరితం చేసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. తద్వారా అజీర్తి, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు.. మిగిలిపోయిన అన్నాన్ని అవెన్‌లో వేడి చేసుకోవడం కూడా మంచిది కాదంటున్నారు.

* ప్రాసెస్‌ చేసిన మాంసం మైక్రోవేవ్‌ అవెన్‌ రేడియేషన్‌కి గురైనప్పుడు కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్‌ ప్రొడక్ట్స్‌ (COPs)గా రూపాంతరం చెందుతుంది. ఈ తరహా కొవ్వులు కరొనరీ ఆర్టరీ డిసీజ్‌ (CAD)కు దారితీస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు నిపుణులు.

* చికెన్‌, మష్రూమ్‌.. వంటివి వండడానికి/ఉడికించడానికి అవెన్‌ను వాడినా.. లేదంటే ఇందులో ఆయా పదార్థాల్ని వేడి చేసినా.. ఇందులో జరిగే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ రేడియేషన్‌ కారణంగా వాటిలోని పోషకాలు నశించిపోయే అవకాశాలే ఎక్కువ!

* తీసి నిల్వ చేసిన తల్లిపాలను వేడి చేయడానికి అవెన్‌ని ఉపయోగించడం సరికాదని చెబుతోంది అమెరికాకు చెందిన FDA. ఒకవేళ వేడి చేయాలనుకుంటే బాటిల్‌పై వేడి నీళ్లు పోస్తూ లేదంటే వేడి నీళ్ల కుళాయి కింద బాటిల్‌ని ఉంచి గోరువెచ్చగా అయ్యాక.. ఓసారి బాటిల్‌ని షేక్‌ చేసి పాపాయికి తాగించమని సూచిస్తోంది.

* మాంసాహారాన్ని ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవడం మనలో చాలామందికి అలవాటే! అయితే ఇలాంటి చల్లటి పదార్థాల్ని అవెన్‌లో పెట్టి వేడిచేసుకోవడం, వండుకోవడం.. వంటివి చేస్తే అవి పదార్థాన్ని సమానంగా వేడి చేయలేవు. అక్కడక్కడా చల్లదనం అలాగే ఉండిపోతుంది. ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది వివిధ రకాల అనారోగ్యాలకు దారి తీయచ్చంటున్నారు నిపుణులు. అలాగని గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న మాంసాహారాన్ని అవెన్‌ కంటే స్టౌ మీదే వండుకోవడం వల్ల అందులోని పోషకాలు తరిగిపోకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

* పండుమిర్చితో కొన్ని రకాల వంటకాలు తయారుచేస్తుంటాం. అయితే వీటిని అవెన్‌లో వండితే.. అందులోని క్యాప్సైసిన్‌ అనే రసాయనం ఘాటు వాయువుల్ని వెలువరిస్తుంది. తద్వారా అవెన్‌ తెరవగానే కళ్లలో మంట, గొంతు మంట, దగ్గు.. వంటి సమస్యలొస్తాయి. ఒక్కోసారి ఈ ఘాటు ఎక్కువైతే అవెన్ లోపల మంట కూడా వచ్చే ప్రమాదం ఉంటుందట! కాబట్టి ఇలాంటి ఘాటైన పదార్థాల్ని గాలి బాగా ప్రసరించే ప్రదేశాల్లో స్టౌపై వండుకోవడం మంచిది.

అలాగే ఇతర పదార్థాలు వండుకోవడానికైనా, వేడి చేసుకోవడానికైనా.. అవెన్‌లో సరైన ఉష్ణోగ్రత సెట్‌ చేసుకోవడం, ప్లాస్టిక్‌-పేపర్‌ తరహా పాత్రలు ఉపయోగించకపోవడం.. వంటి జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని